Updated : 08 May 2022 06:43 IST

Rajasthan: రాజస్థాన్‌.. ప్లేఆఫ్స్‌కు చేరువగా!

మెరిసిన జైశ్వాల్‌, చాహల్‌
పంజాబ్‌పై విజయం

రాజస్థాన్‌ మళ్లీ అదరగొట్టింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పంజాబ్‌పై సత్తాచాటింది. ఆరంభ మ్యాచ్‌ల్లో పేలవ ఫామ్‌తో జట్టుకు దూరమై.. తిరిగి వచ్చిన యశస్వి జైశ్వాల్‌ అర్ధశతకం.. బట్లర్‌, హెట్‌మయర్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. చాహల్‌ మాయ.. వెరసి ఏడో విజయంతో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. 11 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో పంజాబ్‌ తన అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ముంబయి

మెగా టోర్నీలో రాజస్థాన్‌ తిరిగి విజయాల బాట పట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. మొదట పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. బెయిర్‌స్టో (56; 40 బంతుల్లో 8×4, 1×6) ఫామ్‌ అందుకున్నాడు. జితేశ్‌ శర్మ (38 నాటౌట్‌; 18 బంతుల్లో 4×4, 2×6) మెరిశాడు. ప్రత్యర్థి బౌలర్లలో చాహల్‌ (3/28) మరోసారి సత్తాచాటాడు. ఛేదనలో రాజస్థాన్‌ 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ యశస్వి జైశ్వాల్‌ (68; 41 బంతుల్లో 9×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖర్లో హెట్‌మయర్‌ (31 నాటౌట్‌; 16 బంతుల్లో 3×4, 2×6) జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/29) కాస్త పర్వాలేదనిపించాడు.

జైశ్వాల్‌ జోరు..: రాజస్థాన్‌ ఛేదన ధాటిగా ఆరంభమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు జతగా యశస్వి జైశ్వాల్‌ చెలరేగాడు. కొన్ని మ్యాచ్‌ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన జైశ్వాల్‌ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణించాడు. సందీప్‌ వేసిన తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాది తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. ఇక రబాడ (1/50) వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో వరుసగా   6, 4, 4, 2, 4తో రెచ్చిపోయిన బట్లర్‌.. ఆ తర్వాతి బంతికే ఔటైపోయాడు.  వికెట్లకు దూరంగా వేసిన యార్కర్‌ను స్కూప్‌ చేసే ప్రయత్నంలో షాట్‌ కుదరక వెనుదిరిగాడు. మరోసారి మంచి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేని శాంసన్‌ (23) వికెట్‌ పారేసుకున్నాడు. కానీ జైశ్వాల్‌ జోరు కొనసాగించడంతో జట్టు లక్ష్యం దిశగా సాగింది. మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన సందీప్‌ (0/41)కు వరుసగా రెండు ఫోర్లతో అతను స్వాగతం పలికాడు. దీంతో 11 ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. కవర్‌డ్రైవ్‌, రివర్స్‌ స్వీప్‌, స్కూప్‌, లాఫ్టెడ్‌ షాట్లతో అలవోకగా జైశ్వాల్‌ బౌండరీలు రాబట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్‌.. జైశ్వాల్‌ వికెట్‌తో పంజాబ్‌ శిబిరంలో ఉత్సాహాన్ని తెచ్చాడు. విజయం కోసం రాజస్థాన్‌ చివరి 5 ఓవర్లలో 47 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ తప్పలేదు. కానీ హెట్‌మయర్‌ మరోసారి తనకు అలవాటైన పనిని ప్రశాంతంగా పూర్తి చేశాడు. అర్ష్‌దీప్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది లక్ష్యాన్ని తేలిక చేశాడు. అప్పటివరకూ తీవ్ర ఒత్తిడిలో కనిపించి బంతులను వృథా చేసిన దేవ్‌దత్‌ (31).. రబాడ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. హెట్‌మయర్‌ కూడా ఓ సిక్స్‌ బాదడంతో 18వ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. కానీ 19వ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ కేవలం 3 పరుగులే ఇచ్చి దేవ్‌దత్‌ వికెట్‌ తీశాడు. దీంతో చివరి ఓవర్లో రాజస్థాన్‌కు 8 పరుగులు కావాల్సి ఉండగా.. చాహర్‌ (0/39) ఓవర్లో సిక్సర్‌తో ప్రత్యర్థి పోరాటానికి హెట్‌మయర్‌ తెరదించాడు.

ఆరంభంలో బెయిర్‌స్టో.. ఆఖర్లో జితేశ్‌: అంతకుముందు బెయిర్‌స్టో జోరుతో పంజాబ్‌కు శుభారంభం దక్కితే.. చివర్లో జితేశ్‌ మెరుపులతో సూపర్‌ ముగింపు దొరికింది. ఈ సీజన్‌లో తొలిసారి బ్యాట్‌ ఝుళిపించిన బెయిర్‌స్టో బౌండరీల వేటలో సాగాడు. మరోవైపు అశ్విన్‌ (1/32) బౌలింగ్‌తో బట్లర్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు ధావన్‌ (12) నిష్క్రమించాడు. ఆ దశలో బెయిర్‌స్టోకు రాజపక్స (27) జత కలిశాడు. ఈ ఇద్దరూ బౌండరీలు రాబట్టి స్కోరు వేగం పడిపోకుండా చూశారు. ముఖ్యంగా రాజపక్స దూకుడు మీద కనిపించాడు. ఆ జట్టు స్కోరు 10 ఓవర్లకు 88/1. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే రాజపక్సను బౌల్డ్‌ చేసిన చాహల్‌ ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. మరోవైపు అర్ధశతకం అందుకున్న బెయిర్‌స్టో ప్రమాదకరంగా కనిపించాడు. మళ్లీ 15వ ఓవర్లో బౌలింగ్‌ వచ్చిన చాహల్‌.. ఈ సారి మయాంక్‌ (15), బెయిర్‌స్టోను బలి తీసుకున్నాడు. కానీ జట్టుపై ఆ ప్రభావం పడకుండా ఇన్నింగ్స్‌ మెరుగ్గా ముగిసిందంటే అందుకు కారణం.. జితేశ్‌, లివింగ్‌స్టోన్‌ (22). బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన జితేశ్‌ భారీ షాట్లతో చెలరేగాడు. బ్యాటింగ్‌కు బలాన్ని జత చేసి బౌండరీలు రాబట్టాడు. ప్రసిద్ధ్‌ (1/48) ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన అతను.. చాహల్‌కు సిక్సర్‌ రుచి చూపాడు. చివరి ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టి జట్టు స్కోరును 190కి చేరువ చేశాడు. చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు 67 పరుగులు కొల్లగొట్టింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని