Hyderabad vs Bangalore: హైదరాబాద్‌ చిత్తు.. బెంగళూరు ఖాతాలో ఏడో విజయం

రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించి, ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా అయిదు విజయాలు సాధించిన హైదరాబాద్‌.. తిరిగి ఓటమి బాట పట్టాక కోలుకోలేకపోతోంది. బౌలింగ్‌లో తడబడి, బ్యాటింగ్‌లో తేలిపోయి వరుసగా నాలుగో

Updated : 09 May 2022 06:44 IST

మెరిసిన డుప్లెసిస్‌, హసరంగ
ముంబయి

రెండు వరుస ఓటములతో టోర్నీని ఆరంభించి, ఆ తర్వాత గొప్పగా పుంజుకుని వరుసగా అయిదు విజయాలు సాధించిన హైదరాబాద్‌.. తిరిగి ఓటమి బాట పట్టాక కోలుకోలేకపోతోంది. బౌలింగ్‌లో తడబడి, బ్యాటింగ్‌లో తేలిపోయి వరుసగా నాలుగో ఓటమి చవిచూసిన ఆ జట్టు ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బ్యాటుతో డుప్లెసిస్‌, దినేశ్‌ కార్తీక్‌.. బంతితో హసరంగ, హేజిల్‌వుడ్‌ మెరిసిన వేళ హైదరాబాద్‌ను చిత్తు చేసిన బెంగళూరు ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. 12 మ్యాచ్‌ల్లో బెంగళూరుకు ఇది ఏడో విజయం. 11 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరు ఓడింది.

టోర్నీలో కీలక దశలో బెంగళూరు మెరుగైన ప్రదర్శన చేస్తోంది. మూడు వరుస ఓటముల అనంతరం ఆ జట్టు వరుసగా రెండో విజయాన్నందుకుంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన పోరులో 67 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను మట్టికరిపించింది. డుప్లెసిస్‌ (73 నాటౌట్‌; 50 బంతుల్లో 8×4, 2×6), రజత్‌ పటిదార్‌ (48; 38 బంతుల్లో 4×4, 2×6), దినేశ్‌ కార్తీక్‌ (30 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 4×6) చెలరేగడంతో మొదట బెంగళూరు 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేదనలో హసరంగ (5/18), హేజిల్‌వుడ్‌ (2/17) ధాటికి సన్‌రైజర్స్‌ 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. రాహుల్‌ త్రిపాఠి (58; 37 బంతుల్లో 6×4, 2×6) మినహా బ్యాట్స్‌మెనంతా విఫలమయ్యారు.

హైదరాబాద్‌ తడబ్యాటు: ఇన్నింగ్స్‌ తొలి బంతికే విలియమ్సన్‌ రనౌట్‌. అయిదో బంతికి (బౌలర్‌ మ్యాక్స్‌వెల్‌) మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ బౌల్డ్‌. ఛేదనలో హైదరాబాద్‌ పరిస్థితిది. ఈ దెబ్బ నుంచి ఆ జట్టు కోలుకోలేకపోయింది. త్రిపాఠి, మార్‌క్రమ్‌ వెంటనే మరో వికెట్‌ పడనివ్వలేదు. కానీ పరుగులు వేగంగా రాకపోవడంతో ఛేదనలో హైదరాబాద్‌ ఎప్పుడూ వెనుకబడే ఉంది. త్రిపాఠి బ్యాట్‌ ఝుళిపించినా.. మార్‌క్రమ్‌ (21) వేగంగా ఆడలేకపోయాడు. 9వ ఓవర్లో మార్‌క్రమ్‌ను హసరంగ వెనక్కి పంపేటప్పటికి జట్టు స్కోరు 89. ఆ తర్వాత త్రిపాఠి ధాటైన బ్యాటింగ్‌ను కొనసాగించినా అతడికి సహకారం కరవైంది. ధాటిగా మొదలెట్టిన పూరన్‌ (19) ఎక్కువసేపు నిలువలేదు. అతడితోపాటు జగదీష సుచిత్‌ (8)ను హసరంగ వెనక్కి పంపాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ విపరీతంగా పెరిగిపోయింది. చివరి అయిదు ఓవర్లలో 82 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఆపై 16వ ఓవర్లో త్రిపాఠిని హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేయడంతో హైదరాబాద్‌ ఓటమి ఖాయమైపోయింది. స్కోరు 114 వద్ద ఆ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది.

డుప్లెసిస్‌ ధనాధన్‌: అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌కు డుప్లెసిస్‌ వెన్నె ముకలా నిలిస్తే.. దినేశ్‌ కార్తీక్‌ మెరుపు ముగింపునిచ్చాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు.. తొలి బంతికే కోహ్లి వికెట్‌ను చేజార్చుకుంది. కానీ నెమ్మదిగానే ఆరంభించినా, క్రమంగా జోరందుకున్న డుప్లెసిస్‌.. రజత్‌ పటీదార్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ బ్యాట్‌ ఝుళిపించడంతో 10 ఓవర్లకు బెంగళూరు 93/1తో నిలిచింది.  ఆ తర్వాత పరుగుల కాస్త వేగం తగ్గినా, 13వ ఓవర్లో జట్టు స్కోరు 105 వద్ద పటీదార్‌ నిష్క్రమించినా.. ధాటిగా ఆడిన మ్యాక్స్‌వెల్‌ (33; 24 బంతుల్లో 3×4, 2×6)తో కలిసి మరో విలువైన భాగస్వామ్యాన్ని (54)ను నమోదు చేశాడు డుప్లెసిస్‌. అయినా బెంగళూరు స్కోరు 190 దాటుతుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే 19వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను త్యాగి ఔట్‌ చేసేటప్పటికి స్కోరు 159 పరుగులే. కానీ చెలరేగి ఆడిన దినేశ్‌ కార్తీక్‌ ఆఖర్లో విధ్వంసం సృష్టించాడు. మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్‌కు షాకిచ్చాడు. 19వ ఓవర్‌ ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టిన అతడు.. ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లు, ఫోర్‌ బాది ఇన్నింగ్స్‌కు అదిరే ముగింపునిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని