Chennai vs Delhi: చెన్నై చమక్‌.. దిల్లీపై ఘన విజయం

ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆడాక.. వరుసగా ఏడు మ్యాచ్‌లకు జట్టులో చోటు దక్కలేదు.. మళ్లీ అవకాశం రాగానే కసితో పరుగులు చేస్తూ.. తన విలువ చాటుతున్నాడు కాన్వే. దిల్లీపైనా చెలరేగిన అతను వరుసగా మూడో అర్ధసెంచరీ అందుకున్నాడు.

Updated : 09 May 2022 06:39 IST

సత్తాచాటిన కాన్వే
విజృంభించిన అలీ, ముకేశ్‌

ఈ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆడాక.. వరుసగా ఏడు మ్యాచ్‌లకు జట్టులో చోటు దక్కలేదు.. మళ్లీ అవకాశం రాగానే కసితో పరుగులు చేస్తూ.. తన విలువ చాటుతున్నాడు కాన్వే. దిల్లీపైనా చెలరేగిన అతను వరుసగా మూడో అర్ధసెంచరీ అందుకున్నాడు. ఇక బౌలింగ్‌లో మొయిన్‌ అలీ, ముకేశ్‌తో పాటు బౌలర్లు సమష్టిగా విజృంభించడంతో చెన్నై ఘన విజయాన్ని సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది నాలుగో గెలుపు. మరోవైపు అన్నే మ్యాచ్‌ల్లో ఆరో ఓటమితో ప్లేఆఫ్స్‌ రేసులో దిల్లీ వెనకబడింది.

నవీ ముంబయి

సీజన్‌లో మిణుమిణుకుమంటున్న ప్లేఆఫ్స్‌ ఆశలను చెన్నై నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. ఆదివారం రెండో మ్యాచ్‌లో ఆ జట్టు 91 పరుగుల తేడాతో దిల్లీని చిత్తుచేసింది. డెవాన్‌ కాన్వే (87; 49 బంతుల్లో 7×4, 5×6) మరోసారి చెలరేగడంతో మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. రుతురాజ్‌ (41; 33 బంతుల్లో 4×4, 1×6) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌ (2/28), నోకియా (3/42) మెరిశారు. ఛేదనలో చెన్నై బౌలర్ల ధాటికి దిల్లీ 117 పరుగులకే ఆలౌటైంది. మొయిన్‌ అలీ (3/13), ముకేశ్‌ చౌదరీ (2/22), సిమర్‌జీత్‌ సింగ్‌ (2/27), బ్రావో (2/24) వికెట్లు పంచుకున్నారు.

దిల్లీ ఢమాల్‌..: భారీ ఛేదనలో దిల్లీ నిలబడలేదు. చెన్నై పరుగుల వరద పారించిన పిచ్‌పై తడబడుతూనే బ్యాటింగ్‌ మొదలెట్టిన ఆ జట్టు.. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది. ఓ వైపు బౌండరీలు వచ్చినా.. మరోవైపు పవర్‌ప్లేలోనే ఓపెనర్లు కేఎస్‌ భరత్‌ (8), వార్నర్‌ (19) వికెట్లను కోల్పోయింది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన ఆంధ్ర ఆటగాడు భరత్‌ త్వరగానే వెనుదిరిగాడు. ఇక తీక్షణ (1/29) ఓవర్లో ఎల్బీ ఔట్‌కు సమీక్ష కోరిన వార్నర్‌.. ఫలితం ప్రతికూలంగా రావడంతో అంపైర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌ చేరాడు. కానీ వస్తూనే పంత్‌ (21) హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టడం, మార్ష్‌ (25) బౌండరీల బాటలో సాగడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. 7 ఓవర్లకు స్కోరు 71/2. కానీ 15 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టిన చెన్నై విజయాన్ని ఖాయం చేసుకుంది. బంతి అందుకున్న అలీ.. తెలివిగా బంతులేసి వరుసగా తన రెండు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ మలుపు తిప్పాడు. మొదట భారీషాట్‌కు ప్రయత్నించిన మార్ష్‌ లాంగాన్‌లో రుతురాజ్‌ చేతికి చిక్కగా.. ఆ తర్వాత ఒకే ఓవర్లో పంత్‌, రిపల్‌ (6) వికెట్లు పారేసుకున్నారు. పంత్‌ బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్‌ (1)తో పాటు ప్రమాదకర పావెల్‌ (3)ను ముకేశ్‌ ఔట్‌ చేయడంతో దిల్లీ పనైపోయింది. బ్రావో వరుస బంతుల్లో రెండు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

కాన్వే జోరు..: ఓపెనర్ల దూకుడుతో చెన్నైకు శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కు రుతురాజ్‌, కాన్వే 110 పరుగులు జోడించారు. రుతురాజ్‌ను బుట్టలో వేయడానికి అక్షర్‌ (0/23)కు పంత్‌ బంతినిస్తే.. అతని బౌలింగ్‌లో కాన్వే రెండు కళ్లు చెదిరే సిక్సర్లు కొట్టాడు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 57/0తో నిలిచింది. ఈ సీజన్‌లో ఉత్తమంగా రాణిస్తున్న కుల్‌దీప్‌పై కాన్వే నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ రాబట్టాడు. క్రీజు వదిలి బంతిని అమాంతం స్టాండ్స్‌లో పడేసినా.. క్రీజులో కదులుతూ కచ్చితమైన టైమింగ్‌తో బౌండరీ దాటించినా అతనికే చెల్లింది. 27 బంతుల్లోనే అతను అర్ధశతకాన్ని అందుకున్నాడు. కుల్‌దీప్‌ను వదలని అతను.. మరో ఓవర్లో చక్కని కవర్‌డ్రైవ్‌లతో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించాడు. రుతురాజ్‌ ఔటైనా శివమ్‌ దూబె (32) జతగా జోరు కొనసాగించిన కాన్వే.. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో మరో సిక్సర్‌ కొట్టాడు. శార్దూల్‌ బౌలింగ్‌లో అక్షర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన దూబె అదే ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదాడు. 16 ఓవర్లకు స్కోరు 167/1. చెన్నై 220కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ ఆఖర్లో దిల్లీ బౌలర్లు చెన్నైకి కళ్లెం వేశారు. ఖలీల్‌ వరుస ఓవర్లలో కాన్వే, రాయుడు (5)ను వెనక్కిపంపాడు. మధ్యలో దూబె ఇన్నింగ్స్‌కు మార్ష్‌ (1/34) ముగింపు పలికాడు. చివరి ఓవర్లో నోకియా.. వరుస బంతుల్లో అలీ (9), ఉతప్ప (0)ను పెవిలియన్‌ చేర్చాడు. కానీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన ధోని (21 నాటౌట్‌; 8 బంతుల్లో 1×4, 2×6).. కొన్ని మెరుపు షాట్లు కొట్టడంతో స్కోరు 200 దాటింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని