Updated : 12 May 2022 06:57 IST

Virat Kohli: ఔటైనప్పుడు.. నేనెందుకు నవ్వానంటే..: విరాట్‌

దిల్లీ: ఏ బ్యాట్స్‌మన్‌ అయినా ఔటైనపుడు బాధగా, నిరాశగా ముఖం పెడతాడు. కానీ విరాట్‌ కోహ్లి మాత్రం ఈ సీజన్లో వరుసగా తక్కువ స్కోర్లకు వెనుదిరుగుతున్నపుడు నవ్వు ముఖం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్లో విరాట్‌ మూడుసార్లు గోల్డెన్‌ డక్‌ (తొలి బంతికే ఔట్‌) కావడం, ఆ సందర్భాల్లో అతను ఒక నవ్వు నవ్వి పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ స్పందనకు కారణమేంటో విరాట్‌ వెల్లడించాడు. ‘‘నా కెరీర్లో ఇలా ఇంతకు ముందెన్నడూ జరగలేదు. అందుకే నేనలా నవ్వా. ఆట ఏమేం చూపిస్తుందో అవన్నీ నేను చూసేశానని అనిపించింది’’ అని కోహ్లి చెప్పాడు. తన పేలవ ఫామ్‌పై టీ20 లీగ్‌ వ్యాఖ్యాతల నుంచి వస్తున్న విమర్శల గురించి కూడా అతను స్పందించాడు. ‘‘విమర్శకులు నా స్థానంలో ఉండి ఆలోచించలేరు. నేనేమనుకుంటున్నానో వాళ్లు తెలుసుకోలేరు. విమర్శలకు ప్రభావితం కాకుండా ఉండడానికి రెండు దారులున్నాయి. ఒకటి టీవీ రిమోట్‌లో మ్యూట్‌ బటన్‌ నొక్కడం, లేదంటే ఎవరేమంటున్నారో పట్టించుకోకుండా ఉండిపోవడం. నేను ఈ రెండు పనులూ చేస్తా’’ అని విరాట్‌ అన్నాడు. మరోవైపు చాలా ఏళ్ల పాటు తనతో కలిసి బెంగళూరు జట్టుకు ఆడిన ఏబీ డివిలియర్స్‌ ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్‌కు దూరం కావడంపై విరాట్‌ మాట్లాడాడు. ‘‘ఏబీ లేని లోటు చాలా కనిపిస్తోంది. నేను అతడితో తరచుగా మాట్లాడుతుంటా. అతను అమెరికాలో కుటుంబంతో కలిసి గోల్ఫ్‌ చూస్తున్నాడు. అదే సమయంలో బెంగళూరు ప్రదర్శనను గమనిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏదో రకంగా జట్టులో అతను భాగమవుతాడని ఆశిస్తున్నా’’ అన్నాడు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి

దిల్లీ: టీ20 లీగ్‌లో పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఇంగ్లాండ్‌ పర్యటనకు కోహ్లి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు ఈ విశ్రాంతి దోహదపడుతుందని భావిస్తున్నారు. గత రెండు నెలలుగా బయో బబుల్‌లో ఉంటున్న కోహ్లీకి ఆట నుంచి విరామం అవసరమని చేతన్‌శర్మ సారథ్యంలోని జాతీయ సెలెక్షన్‌ కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. కెరీర్‌లోనే అత్యంత పేలవమైన ఫామ్‌లో ఉన్న కోహ్లి.. గత మూడేళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts