Punjab: పంజాబ్‌ పంజా... బెంగళూరుపై గెలుపు

పంజాబ్‌ అదరగొట్టింది. ఓ స్ఫూర్తిదాయక విజయంతో టీ20 లీగ్‌లో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్లేఆఫ్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన

Updated : 14 May 2022 06:40 IST

విజృంభించిన రబాడ

బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌ విధ్వంసం

ముంబయి

పంజాబ్‌ అదరగొట్టింది. ఓ స్ఫూర్తిదాయక విజయంతో టీ20 లీగ్‌లో ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ప్లేఆఫ్‌ ఆశలు నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో శుక్రవారం పంజాబ్‌ 54 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగుల భారీ స్కోరు చేసింది. బెయిర్‌స్టో (66; 29 బంతుల్లో 4×4, 7×6), లివింగ్‌స్టోన్‌ (70; 42 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడారు. హర్షల్‌ పటేల్‌ (4/34) సత్తా చాటాడు. ఛేదనలో బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్‌ (35; 22 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌. రబాడ (3/21), రిషి ధావన్‌ (2/36), రాహుల్‌ చాహర్‌ (2/37) ప్రత్యర్థిని కట్టడి చేశారు. 12 మ్యాచ్‌ల్లో పంజాబ్‌కు ఇది ఆరో విజయం కాగా.. రెండు వరుస విజయాల తర్వాత బెంగళూరు ఓడింది. 13 మ్యాచ్‌ల్లో   ఆరో ఓటమితో బెంగళూరు ప్లేఆఫ్స్‌ అవకాశాలను  సంక్లిష్టం చేసుకుంది.

వాళ్లిద్దరూ నిలిచినా..: భారీ ఛేదనలో ఆరంభంలో బెంగళూరు ఇన్నింగ్స్‌ బాగానే సాగింది. 3 ఓవర్లకు 31/0తో ఉన్న స్థితి నుంచి 5 ఓవర్లకు 41/3తో ఇబ్బందుల్లో పడిపోయింది ఆ జట్టు. ఉన్నంతసేపు బాగానే ఆడిన కోహ్లి (20; 14 బంతుల్లో 2×4, 1×6) రబాడ బౌలింగ్‌లో ఓ అనవసర షాట్‌కు పోయి వెనుదిరిగాడు. ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వకపోయినా ఈ వికెట్‌ను పంజాబ్‌ సమీక్షలో సాధించింది. ఆ తర్వాత కెప్టెన్‌ డుప్లెసిస్‌ (10), మహిపాల్‌ (6)లను రిషి ధావన్‌ ఒకే ఓవర్లో ఔట్‌ చేసి బెంగళూరుని గట్టి దెబ్బ కొట్టాడు. కానీ దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్‌, రజత్‌ పటిదార్‌ (26; 21 బంతుల్లో 1×4, 2×6) పంజాబ్‌కు కాస్త కంగారు పుట్టించారు. రివర్స్‌, స్వీచ్‌ హిట్లతో మ్యాక్స్‌వెల్‌ పరుగులు సాధిస్తే.. లెగ్‌సైడ్‌ బలమైన షాట్లతో పటిదార్‌ స్కోరు పెంచాడు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువే ఉన్నా ఈ జోడీ దూకుడు చూస్తే బెంగళూరు విజయం దిశగా సాగుతుందా అనిపించింది. కానీ ఓవర్‌ తేడాతో సీన్‌ మొత్తం మారిపోయింది. పటిదార్‌ను రాహుల్‌ చాహర్‌.. మ్యాక్స్‌వెల్‌ను హర్‌ప్రీత్‌ ఔట్‌ చేయడంతో బెంగళూరుకి గట్టి దెబ్బ తగిలింది. సమీకరణం (36 బంతుల్లో 92) మరింత క్లిష్టం కావడంతో ఆ జట్టు మరింత ఒత్తిడిలో పడిపోయింది. ఆ తర్వాత బెంగళూరు బ్యాటర్ల పోరాటం పరుగుల అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే పనికొచ్చింది.

మొదట జానీ.. ఆపై లివింగ్‌స్టోన్‌: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు బెయిర్‌స్టో సుడిగాలి ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేస్తే.. మధ్యలో అందుకున్న లివింగ్‌స్టోన్‌ విధ్వంసక ఆటతో జట్టుకు భారీ స్కోరు సాధించిపెట్టాడు. ముఖ్యంగా బెయిర్‌స్టో సిక్సర పిడుగులా చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా ఎడాపెడా బాదిన అతడు తన మార్కు పుల్‌ షాట్లతో విరుచుకుపడ్డాడు. హేజిల్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో జానీ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు అందుకోవడంతో పంజాబ్‌ స్కోరుబోర్డు పరుగులెత్తింది. ధావన్‌ (21; 15 బంతుల్లో 2×4, 1×6) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్‌ 4 ఓవర్లకే 50 పరుగులు చేసింది. కానీ ధావన్‌ వెనుదిరిగినా జానీ తగ్గలేదు. సిరాజ్‌ బౌలింగ్‌లో మూడు సిక్స్‌లు దంచి 21 బంతుల్లోనే అర్ధసెంచరీ అందుకున్నాడు. అయితే కొద్ది తేడాతో భానుక రాజపక్స (1)తో పాటు బెయిర్‌స్టోను ఔట్‌ చేసిన బెంగళూరు పోటీలోకి వచ్చింది. కానీ లివింగ్‌స్టోన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో పంజాబ్‌ 14 ఓవర్లకు 142/3తో బలమైన స్థితిలో నిలిచింది. అయితే బెంగళూరు బౌలర్లు కాసేపు కట్టడి చేయడంతో కింగ్స్‌ 17 ఓవర్లకు 166/5తో నిలిచింది. కానీ 19వ ఓవర్లో (హేజిల్‌వుడ్‌) చెలరేగిన లివింగ్‌స్టోన్‌ 24 పరుగులు రాబట్టి స్కోరు 200 పరుగులు దాటించాడు. అయితే హర్షల్‌ వేసిన చివరి ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ 4 పరుగులే చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌తో పాటు హసరంగ (2/15), మ్యాక్స్‌వెల్‌ (1/17) రాణించారు. హేజిల్‌వుడ్‌ నాలుగు ఓవర్లలో 64 పరుగులివ్వడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని