Rohit Sharma: తిలక్‌ మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు ఆడతాడు: రోహిత్‌

యువ బ్యాటర్‌ తిలక్‌వర్మ త్వరలోనే మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు ఆడతాడని ముంబయి  కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడేందుకు కావాల్సిన టెక్నిక్‌, నిగ్రహం అతనిలో పుష్కలంగా ఉన్నాయని రోహిత్‌

Updated : 14 May 2022 07:12 IST

ముంబయి: యువ బ్యాటర్‌ తిలక్‌వర్మ త్వరలోనే మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు ఆడతాడని ముంబయి  కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడేందుకు కావాల్సిన టెక్నిక్‌, నిగ్రహం అతనిలో పుష్కలంగా ఉన్నాయని రోహిత్‌ కితాబిచ్చాడు. ఈ సీజన్‌లో ముంబయి ఘోరంగా విఫలమైనా.. 19 ఏళ్ల తిలక్‌ మాత్రం అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తిలక్‌ ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్‌ల్లో 386 పరుగులతో ఒక టీ20 లీగ్‌  సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన యువ ఆటగాడిగా రిషబ్‌ పంత్‌ (366 పరుగులు- 2017) రికార్డును తిరగరాశాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా తిలక్‌ కొనసాగుతున్నాడు. 40.88 సగటు.. 132.85 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. ‘‘తొలి ఏడాదే తిలక్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. అలాంటి ప్రశాంతమైన స్వభావం కలిగి ఉండటం అంత సులువైన విషయం కాదు. త్వరలోనే అతను మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు ఆడతాడని అనుకుంటున్నా. అత్యున్నత స్థాయిలో ఆడేందుకు అవసరమైన టెక్నిక్‌, నిగ్రహం అతనిలో ఉన్నాయి. అతనిలో చాలా విషయాలు సానుకూలంగా కనిపిస్తున్నాయి. తిలక్‌లో కసి ఉంది. అతనితో మాట్లాడినప్పుడు బాగా ఆడాలన్న కసి.. మ్యాచ్‌లు ముగించాలన్న కోరిక.. విజయవంతం కావాలన్న ఉత్సాహం దర్శనమిస్తుంది. అతను సరైన మార్గంలోనే ఉన్నాడు. తిలక్‌ ఇలాగే ఎదగాలి. తన ఆటను ఇంకా మెరుగు పరుచుకుంటూ మరింత నాణ్యమైన బ్యాటర్‌గా అవడం చూడాలి’’ అని రోహిత్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని