Ambati Rayudu: రాయుడు రిటైరన్నాడు.. కాదన్నాడు

చెన్నై శిబిరంలో అంబటి రాయుడు  కలకలం రేపాడు.  నుంచి రిటైరవుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన అతడు.. గంటలోపే వెనక్కి తగ్గాడు. చెన్నై టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

Updated : 15 May 2022 07:26 IST

ముంబయి: చెన్నై శిబిరంలో అంబటి రాయుడు కలకలం రేపాడు. ఈ టీ20 లీగ్‌ నుంచి రిటైరవుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించిన అతడు.. గంటలోపే వెనక్కి తగ్గాడు. చెన్నై టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడిన అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ సారి టీ20లీగ్‌లో పరాజయాలు, మేనేజ్‌మెంట్‌తో విభేదాల వల్లే ఆల్‌రౌండర్‌ జడేజా జట్టును వీడాడన్న ఊహాగానాల నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న చెన్నైకి రాయుడు పెద్ద సంకట స్థితినే కల్పించాడు. 36 ఏళ్ల రాయుడు టీ20 లీగ్‌ నుంచి రిటైరవుతున్నట్లు శనివారం ఉదయం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. ‘‘ఇదే నా చివరి టీ20లీగ్‌. ఈ 13 ఏళ్లలో రెండు గొప్ప జట్లకు ఆడా. ఈ గొప్ప ప్రయాణానికి కారణమైన ముంబయి, చెన్నైకు కృతజ్ఞతలు’’ అని ట్వీట్‌ చేశాడు. కానీ గంట లోపే ఆ ట్వీట్‌ను తొలగించాడు. ‘‘రాయుడు టీ20 లీగ్‌ నుంచి రిటైర్‌ కావట్లేదు. అతడు ట్వీట్‌ చేసిన మాట నిజమే. కానీ ఏదో భావోద్వేగంలో అలా చేసి ఉంటాడు. మేం మాట్లాడిన అనంతరం అతడు ట్వీట్‌ తొలగించాడు’’ అని చెన్నై ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ విశ్వనాథన్‌ చెప్పాడు. రిటైర్మెంట్‌ ప్రకటించి వెనక్కి తగ్గడం రాయుడుకు ఇది తొలిసారి కాదు. 2019 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపిక చేయనందుకు అప్పట్లో అతడు చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో అదే ఏడాది జులైలో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. కానీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. రాయుడు సుదీర్ఘ టీ20 లీగ్‌ కెరీర్‌లో 29.28 సగటుతో 4,187 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 అర్ధసెంచరీలు ఉన్నాయి. ప్రస్తుత  టీ20 లీగ్‌ సీజన్‌లో ఇప్పటివరకు 124 స్ట్రైక్‌రేట్‌తో 271 పరుగులు సాధించాడు. అయితే అతడు ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రాయుడు 55 వన్డేలు,  ఆరు టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని