Sunil Gavaskar: తిలక్‌ ఆ మాటల్ని నిజం చేయాలి: సునీల్‌ గావస్కర్‌

ఈ టీ20 లీగ్‌ సీజన్లో ముంబయి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ..  ఆ జట్టు తరఫున తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ సత్తా చాటుకుని అందరి దృష్టిలో పడ్డాడు. 

Updated : 18 May 2022 07:08 IST

ముంబయి: ఈ టీ20 లీగ్‌ సీజన్లో ముంబయి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ..  ఆ జట్టు తరఫున తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ సత్తా చాటుకుని అందరి దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాదే టీ20 లీగ్‌లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ 12 మ్యాచ్‌ల్లో 368 పరుగులు సాధించాడు. అందులో కొన్ని కీలక ఇన్నింగ్స్‌ ఉన్నాయి. ఇప్పటికే తిలక్‌పై రోహిత్‌ శర్మ సహా పలువురు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడీ జాబితాలోకి దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కూడా చేరడం విశేషం. ‘‘తిలక్‌ వర్మ దృక్పథం చాలా బాగుంటుంది. చెన్నైతో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ నన్నెంతో ఆకట్టుకుంది. జట్టు ఒత్తిడిలో ఉన్న స్థితిలో క్రీజులోకి వచ్చి ఒకట్రెండు పరుగులు తీస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తూనే అన్ని రకాల షాట్లు ఆడాడు. ఇది అతడికున్న క్రికెట్‌ బుర్రకు సంకేతం. అది ఉంటే పరిస్థితి ఎదురు తిరిగినపుడు ఏం చేయాలో తెలుస్తుంది. మన ఆటను మనం విశ్లేషించుకుని తిరిగి  పరుగులు రాబట్టవచ్చు. భారత్‌ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ తిలక్‌ ఆడగలడని రోహిత్‌ శర్మ సరిగ్గానే చెప్పాడు. ప్రాథమిక అంశాల్లో అతను సరైన స్థితిలోనే ఉన్నాడు. ఇక మరింత కష్టపడడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, టెక్నిక్‌ను ఇంకాస్త మెరుగుపరుచుకుని రోహిత్‌ మాటల్ని నిజం చేయడం తిలక్‌ చేతుల్లో ఉంది’’ అని సన్నీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని