Wriddhiman Saha: జట్టులో చోటిచ్చాక.. వద్దంటున్నాడు

ఇటీవల తరచుగా వివాదాల పాలవుతున్న వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తాజాగా మరో బాంబు పేల్చాడు. దేశవాళీ క్రికెట్లో తన జట్టు బెంగాల్‌ను వీడేందుకు సిద్ధమయ్యాడు.

Updated : 19 May 2022 07:53 IST

దిల్లీ: ఇటీవల తరచుగా వివాదాల పాలవుతున్న వెటరన్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తాజాగా మరో బాంబు పేల్చాడు. దేశవాళీ క్రికెట్లో తన జట్టు బెంగాల్‌ను వీడేందుకు సిద్ధమయ్యాడు. అందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు అవిషేక్‌ దాల్మియాతో అతను మాట్లాడినట్లు సమాచారం. వచ్చే నెల 6న జార్ఖండ్‌తో క్వార్టర్స్‌లో తలపడే బెంగాల్‌ రంజీ జట్టులో సాహాను ఎంపిక చేశారు. కానీ జట్టు ప్రకటించే ముందు అతణ్ని సంప్రదించలేదు. తనను జట్టులోకి ఎంపిక చేశారని తెలియగానే కోపంతో అవిషేక్‌కు సాహా ఫోన్‌ చేశాడని, బెంగాల్‌ను వీడేందుకు ఎన్‌ఓసీ అడిగాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత కొంత కాలంగా క్యాబ్‌ సంయుక్త కార్యదర్శి దెబాబ్రత దాస్‌తో సాహాకు ఉన్న విభేదాలే అందుకు కారణంగా తెలుస్తోంది. ‘‘ఇకపై బెంగాల్‌కు ఆడేందుకు సాహాలో ఆసక్తి లేదు. క్యాబ్‌ సంయుక్త కార్యదర్శి దెబాబ్రత దాస్‌ వైఖరి పట్ల అతను ఆగ్రహంతో ఉన్నాడు. తన నిబద్ధతను ప్రశ్నించిన అతని నుంచి సాహా బహిరంగ క్షమాపణ కోరుతున్నాడు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో వ్యక్తిగత కారణాలతో రంజీ లీగ్‌ దశ నుంచి సాహా తప్పుకున్నాడు. అప్పటి నుంచి బెంగాల్‌కు ఆడే విషయంపై సాహా నిబద్ధతను దెబాబ్రత ప్రశ్నించాడనే ఆరోపణలున్నాయి. 2007లో బెంగాల్‌ తరపున రంజీ అరంగేట్రం చేసిన సాహా.. 122 ఫస్ట్‌క్లాస్‌, 102 లిస్ట్‌- ఎ మ్యాచ్‌లాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని