ఐర్లాండ్‌ పర్యటనకు కోచ్‌ లక్ష్మణ్‌!

గతేడాది టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి ఇంగ్లాండ్‌ వెళ్తే.. ద్వితీయ శ్రేణి జట్టుతో ద్రవిడ్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఇప్పుడేమో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుండగా..

Published : 19 May 2022 02:16 IST

దిల్లీ: గతేడాది టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి ఇంగ్లాండ్‌ వెళ్తే.. ద్వితీయ శ్రేణి జట్టుతో ద్రవిడ్‌ శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. ఇప్పుడేమో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుండగా.. ద్వితీయశ్రేణి జట్టుకు కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఐర్లాండ్‌ వెళ్లే అవకాశముంది. ద్రవిడ్‌ తర్వాత జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌ ఇప్పుడు కోచ్‌ అవతారం ఎత్తనున్నాడని తెలిసింది. ఏకైక టెస్టుతో పాటు మూడేసి చొప్పున టీ20లు, వన్డేల కోసం వచ్చే నెలలో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ వెళ్తుంది. జులై 1న ఆరంభమయ్యే టెస్టు మ్యాచ్‌ కంటే ముందు లీసెస్టర్‌తో జూన్‌ 24 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతుంది. ఆ సమయంలోనే రెండు టీ20 (జూన్‌ 26, 28)ల సిరీస్‌ కోసం మరో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ జట్టుకు లక్ష్మణ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ‘‘టీమ్‌ఇండియాతో ద్రవిడ్‌ ఇంగ్లాండ్‌లో ఉన్న సమయంలో లక్ష్మణ్‌ టీ20 జట్టుతో ఐర్లాండ్‌ వెళ్లే అవకాశం ఉంది’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం కుర్రాళ్లతో కలిసి లక్ష్మణ్‌ వెస్టిండీస్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే నెల 9 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌ కోసం ఈ నెల 22న టీమ్‌ఇండియాను ఎంపిక చేసే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, బుమ్రాకు విశ్రాంతినిస్తారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని