సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు 21-19, 19-21, 21-18తో లారెన్‌ లామ్‌ (అమెరికా)పై,....

Published : 19 May 2022 02:18 IST

సైనా, ప్రణయ్‌ ఔట్‌
థాయ్‌లాండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌ శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు 21-19, 19-21, 21-18తో లారెన్‌ లామ్‌ (అమెరికా)పై, మాళవిక బాన్సోద్‌ 17-21, 21-15, 21-11తో మరియా యులిటినా (ఉక్రెయిన్‌)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌ చేరుకున్నారు. సైనా నెహ్వాల్‌ 21-11, 15-21, 17-21తో కిమ్‌ యున్‌ (కొరియా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆకర్షి కశ్యప్‌ 13-21, 18-21తో మిచెల్‌ లీ (కెనడా) చేతిలో, అష్మిత చాలిహ 10-21, 15-21తో ఇంతానన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడారు. థామస్‌ కప్‌ విజయంతో జోరుమీదున్న శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో శ్రీకాంత్‌ 18-21, 21-10, 21-16తో బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 17-21, 21-15, 15-21తో డారెన్‌ ల్యూ (మలేసియా) చేతిలో పరాజయం పాలయ్యాయడు. సాయి ప్రణీత్‌ 12-21, 13-21తో కాంటాఫాన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, సౌరభ్‌వర్మ 20-22, 12-21తో టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో అశ్విని భట్‌- శిఖ గౌతమ్‌ జోడీ 21-12, 21-17తో కిటిపక్‌- పతనవరితిపన్‌ (థాయ్‌లాండ్‌) జంటపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో ఇషాన్‌ భట్నాగర్‌- తనిషా క్రాస్టో జోడీకి వాకోవర్‌ లభించింది. సుమీత్‌రెడ్డి- అశ్విని పొన్నప్ప 17-21, 17-21తో యుకి- మిసాకి (జపాన్‌) చేతిలో, రాజు మహ్మద్‌ రెహాన్‌- జమాలుదీన్‌ అనీస్‌ 12-21, 13-21తో యమషిత- షినోయా (జపాన్‌) చేతిలో, వెంకట గౌరవ్‌ ప్రసాద్‌- జుహి 15-21, 11-21తో జోసియానో- హెదియానా (ఇండోనేసియా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్లో కృష్ణ ప్రసాద్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ 21-23, 11-21తో వీ కెంగ్‌- వాంగ్‌ చాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని