Published : 19 May 2022 02:19 IST

చరిత్రకు పంచ్‌ దూరంలో..

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో నిఖత్‌
నేడు జుటామస్‌తో పసిడి పోరు
మనీష, పర్వీన్‌లకు కాంస్యాలు
దిల్లీ

భారత బాక్సింగ్‌ యువ సంచలనం.. తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ చరిత్ర సృష్టించే దిశగా సాగుతోంది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే పతకం ఖాయం చేసిన తను.. దాన్ని పసిడిగా మార్చాలనే లక్ష్యంతో దూసుకెళ్తోంది. సెమీస్‌లో తిరుగులేని ఆధిపత్యంతో ప్రత్యర్థిని చిత్తుచేసి ఏకపక్ష విజయం సాధించిన ఆమె.. తొలిసారి ఈ మెగా పోటీల ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆమెకు, స్వర్ణానికి మధ్య మిగిలింది మరో బౌట్‌ మాత్రమే. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డు నమోదుచేసేందుకు తనకు కావాల్సింది మరో విజయమే!

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల నిఖత్‌ జోరు కొనసాగుతోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను కొట్టుకుంటూ.. బలంతో, తెలివితో బోల్తా కొట్టిస్తూ.. రింగ్‌లో సివంగిలా కదులుతూ.. ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ దిశగా ఆమె దూసుకెళ్తోంది. 52 కేజీల విభాగం ఫైనల్లో అడుగుపెట్టిన తను.. పసిడికి పంచ్‌ దూరంలో నిలిచింది. బుధవారం సెమీస్‌లో ఆమె 5-0 తేడాతో కరోలిన్‌ డి అల్మీదా (బ్రెజిల్‌)ను చిత్తుచిత్తుగా ఓడించింది. బౌట్లో అసలు ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లతో చెలరేగిన నిఖత్‌ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. స్వర్ణమే లక్ష్యంగా సాగుతున్న తను సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలోనూ ఎంతో ప్రశాంతంగా పని పూర్తిచేసింది. బౌట్‌ ఆరంభం నుంచి ప్రత్యర్థిపై ఆధిపత్యం చలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై ముష్టిఘాతాలతో విరుచుకుపడింది. తెలివిగా కదులుతూ అదును చూసి బలమైన పంచ్‌లతో ఆమె చేసిన దాడికి ప్రత్యర్థి నిలవలేకపోయింది. దీంతో న్యాయనిర్ణేతలందరూ ఏకగ్రీవంగా నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. ఇప్పటికే జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. ఇప్పుడు సీనియర్‌ స్థాయిలోనూ తొలిసారి ఆ టైటిల్‌ను అందుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. గురువారం తుదిపోరులో జుటామస్‌ జిట్‌పాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ఆమె తలపడుతుంది. మరోవైపు మనీష (57 కేజీలు), పర్వీన్‌ (63 కేజీలు) కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. సెమీస్‌లో మనీష 1-4తో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య విజేత ఇర్మా టెస్టా (ఇటలీ) చేతిలో ఓడింది. మరో సెమీస్‌లో పర్వీన్‌.. ఐర్లాండ్‌ బాక్సర్‌ అమీ సారా చేతిలో పోరాడి పరాజయం పాలైంది. భారత్‌ నుంచి ఇప్పటివరకూ మేరీకోమ్‌ (ఆరు సార్లు), సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ మాత్రమే మహిళా ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరే అవకాశం నిఖత్‌కు వచ్చింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని