Updated : 20 May 2022 06:43 IST

Nikhat Zareen: మన జరీన్‌..బాక్సింగ్‌ క్వీన్‌

పసిడితో చరిత్ర సృష్టించిన నిఖత్‌

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

ఫైనల్లో అద్భుత విజయం

ఇస్తాంబుల్‌

ప్రపంచ ఛాంపియన్‌...! ఈ మాట అనడానికి బాగుంటుంది.. వినడానికి ఇష్టంగా అనిపిస్తుంది! కానీ కావడమే కష్టం! ఎందుకంటే ఆ పోటీ.. ఆ తీవ్రత.. ఆ ఉద్వేగం అలాంటిది మరి! అందుకే మన దేశంలో ఈ ట్యాగ్‌ ఉన్న క్రీడాకారులు చాలా తక్కువే! ఇప్పుడు అలాంటి అరుదైన జాబితాలో చేరింది మన అమ్మాయి నిఖత్‌ జరీన్‌! భారత మహిళల బాక్సింగ్‌ మణిపూస మేరీకోమ్‌ బాటలో నడుస్తూ స్వర్ణ భేరి మోగించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పతకం గెలిచిన తొలి బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. మొత్తం మీద ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో పసిడి గెలిచిన అయిదో భారత బాక్సర్‌గా నిలిచింది నిఖత్‌.  

ప్రత్యర్థి నేనే గెలిచాను అన్నట్లు గాల్లో పంచ్‌లు విసురుతోంది! కోచ్‌లను, సిబ్బందిని కౌగిలించుకుంటూ ముందస్తు సంబరాలు చేసుకుంటోంది! ఆమె ముఖం వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతోంది!! మరోవైపు గంభీరంగా ఉన్న నిఖత్‌ జరీన్‌ ముఖంలో తీవ్ర ఒత్తిడి! భారంగా చేయి పైకి లేపింది కానీ ఆమె వదనం అభిమానులకు గెలుపు సంకేతాల్ని ఇవ్వట్లేదు!! కానీ బౌట్‌లో బ్లూ జెర్సీ గెలిచిందని రిఫరీ ప్రకటించగానే నిఖత్‌ ఒక్కసారిగా సింహనాదమే చేసింది! ప్రపంచాన్ని జయించాను అన్నట్లుగా పిడికిలి బిగిస్తూ సంబరాలు చేసుకుంది! సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ సజల నయనాలతో  కోచ్‌లతో ఆనందాన్ని పంచుకుంది. మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో దృశ్యమిది. అంచనాలను అందుకుంటూ.. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సర్వశక్తులూ ఒడ్డి స్వర్ణం తెచ్చేసింది ఈ తెలంగాణ అమ్మాయి. అపూర్వమైన ప్రదర్శనతో అదరగొట్టిన నిఖత్‌ జరీన్‌ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన 52 కేజీల విభాగం ఫైనల్లో నిఖత్‌ 5-0తో జిట్‌పాంగ్‌ జటామస్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించింది. ఈ బౌట్లో ఆరంభం నుంచే నిఖత్‌ సివంగిలా విరుచుకుపడింది. అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో.. పవర్‌ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ప్రత్యర్థి గట్టిగానే ప్రతిఘటించినా లాఘవంగా తప్పించుకుంటూ డిఫెన్స్‌లోనూ అదరగొట్టింది. ఈ తుది బౌట్లో నిఖత్‌ జోరు ఎలా సాగిందంటే అయిదుగురు న్యాయ నిర్ణేతలు చివరికి తమ తీర్పును ఏకగ్రీవంగా ఇచ్చేంతగా!


‘‘మన బాక్సర్లు మనల్ని గర్వపడేలా చేశారు. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో పసిడి గెలిచిన నిఖత్‌ జరీన్‌కు అభినందనలు. అదే టోర్నీలో కాంస్యాలు నెగ్గిన మనీషా, పర్వీన్‌లను అభినందిస్తున్నా’’

- ప్రధాని మోదీ


ఆఖర్లో ఉత్కంఠ: బలమైన లెఫ్ట్‌ హుక్‌ షాట్లతో విరుచుకుపడిన జరీన్‌.. జిట్‌పాంగ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. సాంకేతికంగానూ బలంగా కనిపించిన ఆమె తొలి రౌండ్లో పదునైన పంచ్‌లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. అయితే రెండో రౌండ్లో జిట్‌పాంగ్‌ పుంజుకుంది. రింగ్‌లో వేగంగా కదులుతూ పాయింట్లు సాధించిన ఈ థాయ్‌ అమ్మాయి  పైచేయి సాధించింది. గెలవాలంటే ఆఖరిదైన మూడో రౌండ్లో థాయ్‌ అమ్మాయి అందరు జడ్జిలను మెప్పించాల్సి ఉండగా.. నిఖత్‌కు మాత్రం ఒక్క జడ్జి అదనంగా పాయింట్‌ ఇచ్చినా గెలిచే పరిస్థితి ఉంది.  కానీ ఏ అవకాశం ఇవ్వకుండా విజృంభించిన నిఖత్‌.. డిఫెన్స్‌ పక్కన పెట్టేసింది. 1.35 నిమిషాల్లో బౌట్‌ ముగుస్తుందనగా పంచ్‌ల వర్షంతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. జిట్‌పాంగ్‌ కూడా దూకుడుగా ఆడడంతో ఇద్దరికీ సమానంగా పాయింట్లు వచ్చినట్లే అనిపించింది. దీంతో జడ్జిల తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ రేగింది. దీనికి తోడు థాయ్‌ అమ్మాయిని చూస్తే ఆమెనే గెలిచిందేమో అన్న భావన కలిగింది. మొత్తం ప్రదర్శనను లెక్కలోకి తీసుకున్న న్యాయ నిర్ణేతలు నిఖత్‌కే పట్టం కట్టారు. కలిసికట్టుగా ఆమెనే విజేతగా ప్రకటించారు. ఈ టోర్నీలో నిఖత్‌ సాధించిన విజయాలన్నీ ఏకపక్షమే కావడం విశేషం.

నిఖత్‌ మెరుపులు

టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం.
2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణం
2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం
2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం
2019 థాయ్‌లాండ్‌  ఓపెన్లో రజతం
2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి


5

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అయిదో భారత బాక్సర్‌ నిఖత్‌. మేరీకోమ్‌ (2002, 2005, 2006, 2008, 2010, 2018) అత్యధికంగా ఆరుసార్లు విజేతగా నిలవగా.. సరితాదేవి (2006), జెన్నీ ఆర్‌ఎల్‌ (2006), లేఖ (2006) పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు.


ఇక ఆ స్థానం తనదే..

భారత బాక్సింగ్‌ అంటే వినిపించే పేరు.. మేరీకోమ్‌. రికార్డు స్థాయిలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం కొన్నేళ్లపాటు బాక్సింగ్‌ సామ్రాజ్యానికి తిరుగులేని మహారాణిగా వెలుగొందింది. కానీ ఇప్పుడామె వయసు 39 ఏళ్లు. రిటైర్మెంట్‌ దిశగా ఆమె పయనం సాగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే కొన్ని ఎంపిక చేసుకున్న టోర్నీల్లో మాత్రమే ఆమె పాల్గొనాలని నిర్ణయించుకుంది. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల (వాయిదా పడ్డాయి) సన్నద్ధత కోసం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో మేరీ ఘన ప్రస్థానం త్వరలోనే ముగిసే అవకాశం ఉంది. మరి ఇప్పుడు భారత మహిళల బాక్సింగ్‌లో మేరీ తర్వాత ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా 25 ఏళ్ల నిఖత్‌ జరీన్‌ కనిపిస్తోంది. మేరీకోమ్‌ లేకపోతే నిఖత్‌ ఇప్పటికే అత్యుత్తమ విజయాలతో ప్రపంచ అగ్రశ్రేణి బాక్సర్‌గా ఎదిగేదనే మాటలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అందులో ఎంతో నిజం ఉంది. తను పోటీపడే విభాగంలోనే మేరీకోమ్‌ ఉండడం నిఖత్‌కు చేటు చేసిందనేది కాదనలేని వాస్తవం. మేరీకోమ్‌ను చూసి స్ఫూర్తి పొంది బాక్సర్‌గా ఎదిగిన నిఖత్‌.. ఒక దశలో ఆమెతోనే కయ్యానికి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. మేరీకోమ్‌ది, నిఖత్‌ది ఒకే విభాగం (52 కేజీలు) కాగా.. రెండేళ్ల కిందట ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌కు నేరుగా మేరీనే ఎంపిక చేయడంపై నిఖత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ట్రయల్స్‌ పెట్టాలని డిమాండ్‌ చేయడం సంచలనం రేపింది. ఇది మేరీకి రుచించక.. నిఖత్‌పై మండిపడింది కూడా. చివరికి ట్రయల్స్‌ నిర్వహించక తప్పలేదు. అందులో పోరాడి ఓడిన నిఖత్‌.. తర్వాత కసిగా కష్టపడింది. దాని ఫలితమే.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ స్వర్ణం! మేరీ కెరీర్‌ ముగుస్తున్న తరుణంలో ఆమె పోటీ పడే విభాగంలోనే ఛాంపియన్‌ కావడం ద్వారా తన వారసురాలిని తానేనని చాటింది నిఖత్‌. ఇక నుంచి భాతర మహిళల బాక్సింగ్‌లో నిఖత్‌ వైపే అందరి చూపు ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ టోర్నీలో ఫైనల్‌ చేరిన ఏకైక బాక్సర్‌ ఆమెనే. ముఖ్యంగా ఇప్పుడు తను సాధించిన విజయం తెలుగు రాష్ట్రాల్లో బాక్సింగ్‌కు సరికొత్త ఊపిరి పోస్తుందనడం అతిశయోక్తి ఏ మాత్రం కాదు. బ్యాడ్మింటన్‌ అంటే సింధు పేరు ఎలా వినిపిస్తోందో.. ఇప్పుడు బాక్సింగ్‌ అంటే నిఖత్‌ పేరు కూడా అలాగే వినిపించడం ఖాయం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మరెంతో మంది అమ్మాయిలు రింగ్‌లో అడుగుపెడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని