థాయ్‌లాండ్‌ ఓపెన్‌.. సెమీస్‌లో సింధు

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-15, 20-22, 21-13తో ప్రపంచ

Published : 21 May 2022 02:27 IST

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆరో సీడ్‌ సింధు 21-15, 20-22, 21-13తో ప్రపంచ నంబర్‌వన్‌ అకానె యమగూచి (జపాన్‌)పై విజయం సాధించింది. వీరిద్దరు చివరిసారిగా తలపడిన ఆసియా ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ వివాదాస్పదమైంది. సింధు ఆధిక్యంలో ఉన్న సమయంలో సర్వీస్‌ ఆలస్యమైందంటూ ఆమెకు ఒక పాయింటు పెనాల్టీ విధించారు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన సింధు ఓటమి చవిచూసింది. తాజా విజయంతో యమగూచిపై సింధు ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో సింధు అద్భుతంగా ఆడింది. క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌లు, డ్రాప్‌లతో విరుచుకుపడిన సింధు తొలి గేమ్‌లో 11-9తో ఆధిక్యం సంపాదించింది. కొద్దిసేపటికే వరుసగా 7 పాయింట్లు నెగ్గి 19-14తో మరింత ముందంజ వేసింది. యమగూచి షటిల్‌ను నెట్‌కు ఆడటంతో 21-15తో తొలి గేమ్‌ సింధు సొంతమైంది. రెండో గేమ్‌ను సింధు మరింత దూకుడుగా ఆరంభించి 10-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. విరామానంతరం యమగూచి పుంజుకుని 16-16తో పాయింట్లను సమం చేసింది. అక్కడ్నుంచి 20 పాయింట్ల వరకు స్కోరు సమమవుతూ వెళ్లింది. సింధు సర్వీస్‌ పొరపాటు, షటిల్‌ను బయటకు ఆడటంతో 2 పాయింట్లు నెగ్గిన యమగూచి 22-20తో రెండో గేమ్‌ గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోసింధు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. స్మాష్‌లతో చెలరేగిన సింధు 15-11తో ఆధిక్యం సంపాదించింది. వరుసగా పాయింట్లు రాబడుతూ 21-13తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. యమగూచిపై తన గెలుపోటముల రికార్డును 14-9తో మరింత మెరుగుపరుచుకుంది. శనివారంసెమీస్‌లో చెన్‌ యుఫీ (చైనా)తో సింధు తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని