Updated : 21 May 2022 07:04 IST

Rajasthan vs Chennai: రాజస్థాన్‌ డబుల్‌ ధమాకా

ప్లేఆఫ్స్‌ బెర్తుతో పాటు రెండో స్థానం
చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నైపై గెలుపు

చెన్నైతో పోరు..  రాజస్థాన్‌ గెలవాలంటే 3 ఓవర్లలో 32 పరుగులు చేయాలి! కీలక బ్యాటర్లంతా ఔటయ్యారు.. కానీ రవిచంద్రన్‌ అశ్విన్‌ వదల్లేదు.. మెరుపు షాట్లతో చెలరేగిన అతడు  రాజస్థాన్‌కు విజయాన్ని కట్టబెట్టాడు. 14 మ్యాచ్‌ల్లో తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్‌ బెర్తే కాక పట్టికలో రెండో స్థానంలో కూడా దక్కించుకుంది రాజస్థాణ్‌. లఖ్‌నవూ కూడా 18 పాయింట్లతోనే ఉన్నా.. మెరుగైన రన్‌రేట్‌తో రాజస్థాన్‌ (0.298) టాప్‌-2లో స్థానం దక్కించుకుంది. లీగ్‌ దశలో టాప్‌-2లో నిలిచిన జట్టుకు ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌ ఓడినా ఇంకో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.

ముంబయి: టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌ చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. శుక్రవారం మొదట చెన్నై 20 ఓవర్లలో 6 వికెçË్లకు 150 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (93; 57 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్థాన్‌ బౌలర్లలో మెకాయ్‌ (2/20), చాహల్‌ (2/26), అశ్విన్‌ (1/28) ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్యాన్ని రాయల్స్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యశస్వి జైస్వాల్‌ (59; 44 బంతుల్లో 8×4, 1×6), రవిచంద్రన్‌ అశ్విన్‌ (40 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4, 3×6) జట్టును గెలిపించారు.

మొదట జైస్వాల్‌.. ఆపై అశ్విన్‌: ఛేదనలో రాజస్థాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బట్లర్‌ (2) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. కానీ రాయల్స్‌ వెనక్కి తగ్గలేదు. ఎదురుదాడి చేసింది. యశస్వి జైస్వాల్‌ దూకుడుగా ఆడడంతో ఈ జట్టు స్కోరు దూసుకెళ్లింది. పవర్‌ ప్లే ఆఖరికి 52/1తో రాజస్థాన్‌ మెరుగైన స్థితిలో నిలిచింది. కానీ చెన్నై ఇన్నింగ్స్‌ మాదిరే పవర్‌ ప్లే తర్వాత రాజస్థాన్‌ నెమ్మదించింది. బౌండరీల రాక తగ్గిపోయింది. దీనికి తోడు కెప్టెన్‌ శాంసన్‌ (15), పడిక్కల్‌ (3) వెనుదిరగడంతో రాయల్స్‌ ఒత్తిడిలో పడింది. బ్యాటింగ్‌లో ముందుగా వచ్చిన అశ్విన్‌తో కలిసి జైస్వాల్‌ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగాడు. కానీ చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో జైస్వాల్‌-అశ్విన్‌ జోడీ ధాటిగా ఆడలేకపోయింది. దీంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరుగుతూ వచ్చింది. సమీకరణం 42 బంతుల్లో 67 పరుగులుగా మారింది. ఈ స్థితిలో అశ్విన్‌, యశస్వి చెరో సిక్స్‌ బాది సాధించాల్సిన రన్‌రేట్‌ మరీ పెరిగిపోకుండా చూశారు. కానీ అర్ధసెంచరీ తర్వాత జైస్వాల్‌ వెనుదిరగడం.. ఆ వెనుకే ప్రమాదకర హెట్‌మయర్‌ (6) కూడా ఔట్‌ కావడంతో రాయల్స్‌ మరింత ఒత్తిడిలో పడిపోయింది. ఈ రెండు వికెట్లను స్పిన్నర్‌ ప్రశాంత్‌ సోలంకి (2/20) ఖాతాలో వేసుకున్నాడు. అయితే ధాటిగా ఆడిన అశ్విన్‌ మళ్లీ రాయల్స్‌ను విజయం దిశగా నడిపించాడు. చివరి రెండు ఓవర్లలో 19 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో పతిరన బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన అశ్విన్‌ జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు. ఆఖరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండగా మరో బౌండరీతో అతడు విజయాన్ని ఖాయం చేశాడు.

మొయిన్‌ చెలరేగినా..: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై మొయిన్‌ అలీ విధ్వంసంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. తొలి ఓవర్లోనే రుతురాజ్‌ (2) ఔటైనా.. 3 ఓవర్లకు చెన్నై 15 పరుగులే చేసినా ఆ తర్వాత రాజస్థాన్‌ బౌలర్లును మొయిన్‌ వణికించాడు. అతడు ఫోర్లు, సిక్స్‌లతో బెంబేలెత్తించడంతో 3 ఓవర్లకు 15/1గా ఉన్న చెన్నై స్కోరు పవర్‌ ప్లే ఆఖరికి 75/1గా మారింది. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో మొయిన్‌ వరుసగా 6, 4, 4, 4, 4, 4 బాదేశాడు. ఈ క్రమంలోనే 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ రాజస్థాన్‌ బలంగా పుంజుకుంది. స్వల్ప వ్యవధిలో కాన్వే, జగదీశన్‌ (1), రాయుడు (3) వికెట్లు పడగొట్టింది. 8 ఓవర్లకు 83/1తో ఉన్న చెన్నై.. ఆ తర్వాత 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 96/4తో నిలిచింది. దీనికి తోడు అలీ ఒక్కసారిగా నెమ్మదించగా.. కెప్టెన్‌ ధోని (28 బంతుల్లో 26) కూడా ధాటిగా ఆడకపోవడంతో పరుగుల రాక మందగించింది. చివరి రెండు ఓవర్లలో 14 పరుగులు చేసిన చెన్నై.. ధోని, మొయిన్‌ వికెట్లు చేజార్చుకుంది. సెంచరీ చేసేలా కనిపించిన మొయిన్‌ ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు. పవర్‌ ప్లేలో 75 పరుగులు చేసిన చెన్నై.. ఆ తర్వాత 14 ఓవర్లలో 75 పరుగులే చేయగలిగింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని