Updated : 22 May 2022 09:54 IST

Umran Malik: ఉమ్రాన్‌కు ఛాన్స్‌?

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టు ఎంపిక నేడు 

టీ20 లీగ్‌ ముగిసిన కొన్ని రోజుల్లోనే టీమ్‌ఇండియా అంతర్జాతీయ క్రికెట్‌ పునఃప్రారంభించనున్న నేపథ్యంలో సెలక్షన్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. జూన్‌ 9న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం సెలక్షన్‌ కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించనుంది. ఐపీఎల్‌లో  ఆకట్టుకున్న ఉమ్రాన్‌ మాలిక్, మోసిన్‌ ఖాన్‌లకు జట్టులో చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ముంబయి:  టీ 20లీగ్‌ ఎప్పటిలాగే భవిష్యత్తు తారలను వెలుగులోకి తెస్తోంది. హైదరాబాద్‌ తరఫున ఉమ్రాన్‌ మాలిక్‌ పదునైన పేస్‌తో అందరి దృష్టినీ ఆకర్షిస్తే.. ఎడమచేతి వాటం పేసర్‌ మోసిన్‌ ఖాన్‌ (లఖ్‌నవూ) పేస్‌తో పాటు కచ్చితత్వంతో ఆకట్టుకున్నాడు. జాతీయ సెలక్టర్ల నుంచి వీరికి పిలుపు అందితే ఆశ్చర్యపోనక్కర్లేదు. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌ కోసం చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆదివారం జట్టును ఎంపిక చేయబోతోంది. సెలక్టర్లు వెటరన్‌ ఆటగాళ్లు శిఖర్‌ ధావన్, దినేశ్‌ కార్తీక్‌ పునరాగమనం చేసే అవకాశముంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియాకు ఆడని ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కూడా జట్టులోకి రావచ్చు. టీ 20 లీగ్‌లో అతడు ఫామ్, ఫిట్‌నెస్‌ను చాటుకున్నాడు. బౌలింగ్‌ కూడా చేస్తున్నాడు. భారత టెస్టు జట్టు జూన్‌ 15న ఇంగ్లాండ్‌ బయల్దేరనున్న నేపథ్యంలో.. అన్ని ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్, బుమ్రాలకు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు విశ్రాంతినివ్వొచ్చు. అదే జరిగితే ధావన్‌ లేదా హార్దిక్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశముంది. నిరుడు లంక పర్యటనలో పరిమిత ఓవర్ల జట్టుకు ధావన్‌ నాయకత్వం వహించాడు. టీ 20లీగ్‌లో గుజరాత్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

పంజాబ్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. ఆఖరి ఓవర్లలో అతడి ఎకానామీ రేట్‌ చాలా గొప్పగా ఉంది. యార్కర్లు వేయడంతో మంచి నేర్పు ఉంది. మెగా టోర్నీ తరఫున టీ20 లీగ్‌లో సత్తా చాటిన యువ బ్యాట్స్‌మన్‌ తిలక్‌ వర్మ పేరు చర్చకు వచ్చే అవకాశ ముంది. వెస్టిండీస్, శ్రీలంకలతో ఆడిన దీపక్‌ హుడా, వెంకటేశ్‌ అయ్యర్‌లకు మరో అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. దినేశ్‌ కార్తీక్‌ ఫినిషర్‌గా తనకు అవకాశం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నాడు. ఫినిషర్‌గా సత్తా చాటుకున్న రాహుల్‌ తెవాతియా కూడా రేసులో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కానీ సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో మేనేజ్‌మెంట్‌.. జట్టుపై ఓ అంచనాకు వచ్చే అవకాశముంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ జూన్‌ 9న ఆరంభమవుతుంది. ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత జట్టు.. నిరుడు వాయిదా పడ్డ అయిదో టెస్టును ఆడనుంది. ఈ మ్యాచ్‌ జులై 1న బర్మింగ్‌హామ్‌లో ఆరంభమవుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో భారత్‌ మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు కూడా ఆడుతుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌ జూన్‌ 26, 28వ తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడుతుంది. ఐర్లాండ్‌తో ఆడే జట్టుకు జాతీయ క్రికెట్‌ అకాడమీ అధిపతి లక్ష్మణ్‌ కోచ్‌గా ఉండే అవకాశముంది. ప్రధాన కోచ్‌ రాహుల్‌... అదే సమయంలో లీసెస్టెర్‌షైర్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ (జూన్‌ 24-27)లో తలపడే టెస్టు జట్టుతో ఉంటాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని