Published : 24 May 2022 03:38 IST

ఆఖర్లో పట్టు విడిచి..

ఆసియా కప్‌ హాకీ
పాక్‌తో భారత్‌ మ్యాచ్‌ 1-1తో డ్రా

జకార్తా: మ్యాచ్‌ అంతా ఆధిపత్యం చలాయించి.. ఆఖర్లో పట్టు విడిచి ఓటమి పాలవడం లేదా డ్రాతో సరిపెట్టుకోవడం భారత హాకీ జట్టుకు ఎప్పట్నుంచో ఉన్న బలహీనత. గత కొన్నేళ్లలో జట్టు ఎంతో మెరుగైనప్పటికీ అప్పుడప్పుడూ ఈ బలహీనత వెంటాడుతూ ఉంటుంది. ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్లో, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. ఇంకో రెండు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, విజయం సాధించడం లాంఛనమే అనుకున్న దశలో ప్రత్యర్థి షాక్‌ ఇచ్చింది. 59వ నిమిషంలో పాక్‌ పెనాల్టీ కార్నర్‌ సంపాదించగా, అబ్దుల్‌ రాణా గోల్‌ కొట్టి స్కోరు సమం చేసి తన జట్టును సంబరాల్లో ముంచెత్తాడు. సోమవారం పూల్‌-బిలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. అంతకుముందు మ్యాచ్‌ తొలి క్వార్టర్లోనే భారత్‌ ఆధిక్యం సాధించింది. 9వ నిమషంలో యువ ఆటగాడు కార్తి సెల్వం పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి జట్టుకు శుభారంభాన్నందించాడు. అతడికిదే తొలి అంతర్జాతీయ గోల్‌. మ్యాచ్‌లో మొదట స్కోర్‌ చేసే అవకాశం పాకిస్థాన్‌కే వచ్చినా, ఆ జట్టు ఉపయోగించుకోలేకపోయింది. తర్వాత భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడి పెనాల్టీ కార్నర్లు సంపాదించారు. అందులో ఒకటి కార్తి సద్వినియోగం చేశాడు. తర్వాత భారత్‌ గోల్స్‌ కొట్టలేకపోయింది. పాకిస్థాన్‌ స్కోరు సమం చేసేందుకు గట్టి ప్రయత్నమే చేసింది. చివర్లో ఆ జట్టు ప్రయత్నం ఫలించింది. భారత్‌ మంగళవారం తన తర్వాతి మ్యాచ్‌లో జపాన్‌ను ఢీకొంటుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఒమన్‌పై 7-0తో మలేసియా, బంగ్లాదేశ్‌పై 6-1తో కొరియా, ఇండొనేసియాపై 9-0తో జపాన్‌ విజయం సాధించాయి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని