ఐవోఏ అధ్యక్షుడిగా బత్రా తొలగింపు

నరీందర్‌ బత్రాపై వేటు పడింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడిగా అతడి పదవి ఊడింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో నరీందర్‌ బత్రా జీవితకాల సభ్యత్వం పొందడంపై నమోదైన పిటిషన్‌ను విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు..

Published : 26 May 2022 02:12 IST

సీవోఏ చేతికి హాకీ ఇండియా

దిల్లీ: నరీందర్‌ బత్రాపై వేటు పడింది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షుడిగా అతడి పదవి ఊడింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో నరీందర్‌ బత్రా జీవితకాల సభ్యత్వం పొందడంపై నమోదైన పిటిషన్‌ను విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు.. జాతీయ క్రీడా నియమావళికి విరుద్ధంగా ఏర్పాటైన పదవులను రద్దు చేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. క్రీడా నియమావళికి విరుద్ధంగా నడుస్తున్న సమాఖ్యలకు ప్రభుత్వ గుర్తింపు ఇవ్వకూడదని పేర్కొన్న హైకోర్టు.. హాకీ ఇండియా పాలనను ముగ్గురు సభ్యుల పరిపాలకుల కమిటీకి అప్పగించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఐవోఏ.. అధ్యక్షుడిగా బత్రాను తొలగించి సీనియర్‌ ఉపాధ్యక్షుడు అనిల్‌ ఖన్నాకు బాధ్యతలు అప్పగించింది. 2017లో బత్రా హెచ్‌ఐ జీవితకాల సభ్యుడి హోదాలో ఐవోఏ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఇప్పుడు ఆ పదవిని హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఐవోఏ బత్రాపై చర్యలు తీసుకుంది. హాకీ ఇండియా క్రీడా నియమావళిని ఉల్లంఘించిందని జస్టిస్‌ నజ్మీ వాజిరి, జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మలతో కూడిన బెంచ్‌ పేర్కొంది. హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా బత్రా నియామకాన్ని సవాల్‌ చేస్తూ భారత మాజీ హాకీ ఆటగాడు అస్లామ్‌ షేర్‌ఖాన్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. జీవిత కాల సభ్యుడిగా బత్రా.. ముఖ్య కార్య నిర్వాహణాధికారిగా ఎలీనా నార్మన్‌ నియామకం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హాకీ ఇండియాను నడిపించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఏఆర్‌ దవే, మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషి, హాకీ ఇండియా మాజీ కెప్టెన్‌ జాఫర్‌ ఇక్బాల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల పాలకుల కమిటీని హైకోర్టు ఏర్పాటు చేసింది. జీవితకాల సభ్యత్వ పదవి ఆధారంగా బత్రా ఇతరత్రా పదవులు పొందివుంటే.. వాటిపై పాలకుల కమిటీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. చట్టవిరుద్ధ పదవులు అడ్డుపెట్టుకుని బత్రా హాకి ఇండియా నిధులు పొందివుంటే.. ఆ సొమ్మును తిరిగి రాబట్టాలని హైకర్టు తీర్పు ఇచ్చింది. హాకీ ఇండియా నిధుల్లో రూ.35 లక్షలను బత్రా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని