Published : 26 May 2022 02:15 IST

మూడో రౌండ్లో కెర్బర్‌

సకారికి షాక్‌
జకో, జ్వెరెవ్‌ ముందుకు
ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్లో జర్మనీ స్టార్‌ కెర్బర్‌ మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆమె 6-1, 7-6 (7/2)తో జాక్వెమోట్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించింది. తొలి సెట్లో కెర్బర్‌ జోరు ముందు జాక్వెమోట్‌ నిలువలేకపోయింది. 1, 5, 7 గేముల్లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన కెర్బర్‌ 6-1తో సులభంగా సెట్‌ గెలుచుకుంది. కానీ రెండో సెట్లో కెర్బర్‌కు ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 11వ గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ను కాచుకున్న ఈ జర్మనీ స్టార్‌ సెట్‌ను సెట్‌ టైబ్రేకర్‌కు మళ్లించింది. టైబ్రేకర్‌లో సర్వీసుల్లో విజృంభించిన ఆమె సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది. మరోవైపు నాలుగో సీడ్‌ సకారి (గ్రీస్‌) ఓడిపోయింది. ఆమె 6-7 (5/7), 6-7 (4/7)తో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో ఓటమి చవిచూసింది. బ్రిటన్‌ టీనేజర్‌ ఎమా రదుకాను కూడా ఇంటిముఖం పట్టింది. ఈ పన్నెండో సీడ్‌ 6-3, 1-6, 1-6తో సస్‌నోవిచ్‌ (బెలారస్‌) చేతిలో ఓడింది. తొలి సెట్లో దూకుడుగా ఆడి నెగ్గిన రదుకాను.. ఆ తర్వాత రెండు సెట్లలో కేవలం రెండు గేమ్‌లు మాత్రమే గెలవగలిగింది. మరోవైపు విక్టోరియా అజరెంకా (బెలారస్‌), కొకో గాఫ్‌ (అమెరికా) మూడో రౌండ్‌ చేరారు. ఈ 15వ సీడ్‌ 6-1, 7-6 (7/3)తో పెట్కొవిచ్‌ (బోస్నియా)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో కొకో గాఫ్‌ 6-1, 7-6 (7/4)తో వాన్‌ యువాంక్‌ (బెల్జియం)పై నెగ్గింది. రెండో సెట్లో రెండుసార్లు సర్వీస్‌ కోల్పోయినా వెంటనే బ్రేక్‌ చేసిన గాఫ్‌.. అదే జోరుతో టైబ్రేకర్‌లోనూ పైచేయి సాధించింది. బెన్సిస్‌ (స్విట్జర్లాండ్‌), లెలా ఫెర్నాండెజ్‌ (కెనడా), స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా), అనిసిమోవా (అమెరికా), కనేపి (ఇస్తోనియా), గ్రెచెవా (రష్యా), నోరి (బ్రిటన్‌) రెండో రౌండ్‌ అధిగమించారు.

జ్వెరెవ్‌ కొద్దిలో..: పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ కొద్దిలో ఓటమి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా గొప్పగా పోరాడి విజయాన్ని అందుకున్నాడీ జర్మనీ స్టార్‌. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో జ్వెరెవ్‌ 2-6, 4-6, 6-1, 6-2, 7-5తో సెబాస్టియన్‌ బాజ్‌ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. 3.30 గంటలకుపైగా సాగిన ఈ పోరులో జ్వెరెవ్‌ను బాజ్‌ ముప్పతిప్పలు పెట్టించాడు. తొలి రెండు సెట్లు గెలిచి సవాల్‌ విసిరిన ఈ అర్జెంటీనా ఆటగాడు సంచలనం సృష్టించేలా కనిపించాడు. కానీ పుంజుకున్న జ్వెరెవ్‌ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ఆడాడు. వరుస రెండు సెట్లలో కేవలం మూడు గేమ్‌లే ప్రత్యర్థికి కోల్పోయాడంటే జ్వెరెవ్‌ దూకుడును అర్థం చేసుకోవచ్చు. అయితే నిర్ణయాత్మక అయిదో సెట్లో బాజ్‌ గట్టిగానే పోరాడాడు. కానీ 11వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. రెండో రౌండ్లో టాప్‌సీడ్‌ జకో 6-2, 6-3, 7-6 (7/4)తో మోల్‌కాన్‌ (స్లొవేకియా)ను ఓడించాడు. దిమిత్రోవ్‌ (బల్గేరియా), ఇస్నర్‌ (అమెరికా), ష్వార్జ్‌మ్యాన్‌ (అర్జెంటీనా), అలియాసిమ్‌ (కెనడా), కచానోవ్‌ (రష్యా) కూడా మూడో రౌండ్లో అడుగుపెట్టారు.

రామనాథన్‌ జోడీ శుభారంభం: పురుషుల డబుల్స్‌లో రామ్‌కుమార్‌ రామనాథన్‌ జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో రామ్‌కుమార్‌-రీస్‌ (అమెరికా) జంట 7-6 (7/4), 6-3తో అల్ట్‌మెయిర్‌-ఒటె (జర్మనీ) జోడీపై విజయం సాధించింది. తొలి సెట్‌ పదో గేమ్‌లో సెట్‌ పాయింట్‌ కాపాడుకుని ఆపై సెట్‌ గెలిచిన రామ్‌కుమార్‌ ద్వయం.. రెండో సెట్లో విజృంభించింది. తొమ్మిదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని