R Praggnanandhaa: ఫైనల్లో ప్రజ్ఞానంద

మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద జోరు కొనసాగుతోంది. సెమీఫైనల్లో అతడు 3.5-2.5తో తనకన్నా రేటింగ్‌లో మెరుగైన నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీష్‌ గిరికి షాకిచ్చాడు.

Updated : 26 May 2022 06:48 IST

సెమీస్‌లో అనీష్‌కు షాక్‌
మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ చెస్‌

చెన్నై: మెల్ట్‌వాటర్‌ ఛాంపియన్స్‌ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత యువ సంచలనం ప్రజ్ఞానంద జోరు కొనసాగుతోంది. సెమీఫైనల్లో అతడు 3.5-2.5తో తనకన్నా రేటింగ్‌లో మెరుగైన నెదర్లాండ్స్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనీష్‌ గిరికి షాకిచ్చాడు. నాలుగు గేమ్‌ల ఈ సెమీస్‌ సమరంలో ప్రజ్ఞానంద-అనీష్‌ మొదట 2-2తో సమానంగా నిలిచారు. తొలి గేమ్‌ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌ను ప్రజ్ఞానంద నెగ్గి అనీష్‌కు ఈ టోర్నీలో తొలిసారి ఓటమి రుచి చూపించాడు. కానీ పుంజుకున్న అనీష్‌ మూడో గేమ్‌లో డ్రా చేసుకుని.. నాలుగో గేమ్‌ను గెలుచుకోవడంతో పోరు టైబ్రేకర్‌కు మళ్లింది. కానీ టైబ్రేకర్‌లో అనుభవజ్ఞుడైన అనీష్‌పై పైచేయి సాధించిన 16 ఏళ్ల ప్రజ్ఞానంద ఫైనల్‌కు దూసుకెళ్లాడు. టైటిల్‌ పోరులో డింగ్‌ లీరెన్‌ (చైనా)తో భారత స్టార్‌ తలపడనున్నాడు. అయితే ఒక టాప్‌ ఆటగాడిపై హోరాహోరీ గెలిచిన తర్వాత ఏ ఆటగాడైనా విశ్రాంతి తీసుకుంటాడు. కానీ ప్రజ్ఞానంద మాత్రం కళాశాలకు వెళ్లిపోయాడు. ఫైనల్‌ పరీక్షలు జరుగుతుండడమే ఇందుకు కారణం. కానీ ఆ తర్వాత కూడా అతడికి విశ్రాంతి కష్టమే. ఎందుకంటే డింగ్‌ లీరెన్‌తో ఫైనల్‌ ఉంది. అటు పరీక్షలు చూసుకుంటూ ఇటు టాప్‌ ఆటగాళ్ల పని పడుతున్నాడీ భారత టీనేజర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని