Updated : 27 May 2022 06:51 IST

India Hockey: ఆసియా హాకీలో అద్భుతం

16-0తో ఇండోనేసియాపై గెలిచి నాకౌట్‌కు భారత్‌

జాకార్తా

ఆసియాకప్‌ హాకీ. పూల్‌-ఏలో పోటీ. ఒక డ్రా, ఒక పరాజయంతో భారత్‌.. జపాన్‌ (6), పాకిస్థాన్‌ (4) తర్వాత మూడో స్థానంలో ఉంది. పూల్‌లోని నాలుగు జట్లూ రెండేసి మ్యాచ్‌లు ఆడిన తర్వాత పరిస్థితిది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఈసారి నాకౌట్‌ చేరడం అసాధ్యమనే అనుకున్నారంతా! అందులో ఆశ్చర్యం లేదు కూడా. ఎందుకంటే పాయింట్‌తో మూడో స్థానంలో ఉండడమే కాదు, గోల్స్‌ అంతరంలో పాకిస్థాన్‌ (+13)తో పోలిస్తే భారత్‌ (-3) చాలా చాలా వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత కష్టమైన సమీకరణం భారత ముందు నిలిచింది. నాకౌట్‌ చేరాలంటే తన చివరి మ్యాచ్‌లో ఇండోనేసియాపై అత్యంత భారీ విజయం సాధించాలి. జపాన్‌ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి రూపంలో అదృష్టమూ కలిసి రావాలి. అందుకే భారత్‌పై ఎలాంటి ఆశలూ లేవు. కానీ అద్భుతమే జరిగింది. సంచలన ప్రదర్శనతో భారత్‌ అనూహ్యంగా ఆసియాకప్‌ నాకౌట్‌ దశ (సూపర్‌ 4)కు అర్హత సాధించింది.

గురువారం మొదట పాకిస్థాన్‌ 2-3తో జపాన్‌ చేతిలో ఓడిపోవడంతో భారత్‌కు ఓ అడ్డంకి తొలగిపోయింది. కానీ క్లిష్టమైన సవాల్‌ ఎదురైంది. పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంతో ముందంజ వేయాలంటే ఆఖరి మ్యాచ్‌లో కనీసం 15 గోల్స్‌ తేడాతో గెలవాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటి స్థితిలో భారత జట్టు అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చెలరేగిపోయింది. ఎటాకింగ్‌ గేమ్‌తో గోల్స్‌ వర్షం కురిపిస్తూ ఇండోనేసియాను 16-0తో చిత్తు చేసింది. పాకిస్థాన్‌ను ఇంటిముఖం పట్టించింది. మెరుగైన గోల్‌ అంతరం (1)తో భారత్‌ నాకౌట్లో ప్రవేశించింది. దిస్పాన్‌ టిర్కీ అయిదు గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. సుదేవ్‌ మూడు గోల్స్‌ సాధించాడు. ఎస్పీ సునీల్‌, పవర్‌ రాజ్‌భర్‌, కార్తీ సెల్వమ్‌ తలో రెండో గోల్స్‌ కొట్టారు. ఉత్తమ్‌ సింగ్‌, సంజీబ్‌ చెరో గోల్‌ చేశారు. చివరి క్వార్టర్‌లోనే భారత్‌ ఆరు గోల్స్‌ సాధించింది. భారత్‌-ఇండోనేసియా మ్యాచ్‌ ఫలితంతో పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ అర్హత ఆశలకు కూడా తెరపడింది. ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకే ప్రపంచకప్‌లో ఆడేందుకు అర్హత లభిస్తుంది. ఆతిథ్య జట్టు హోదాలో క్వాలిఫికేషన్‌తో సంబంధం లేకుండా భారత్‌ ప్రపంచకప్‌లో ఆడుతుంది. ఈ నేపథ్యంలోనే హాకీ ఇండియా.. యువ ఆటగాళ్లను ఆసియాకప్‌కు పంపించింది. జపాన్‌ (9 పాయింట్లు) పూల్‌-ఏ నుంచి అగ్రస్థానంతో నాకౌట్లో అడుగుపెట్టింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని