300వ విజయంతో..

13సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ రొలాండ్‌ గారోస్‌లో మరో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఈ స్పెయిన్‌ వీరుడు 6-3, 6-1, 6-4తో  మోటెట్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం

Published : 27 May 2022 02:56 IST

 మూడో రౌండ్లో నాదల్‌

 ప్లిస్కోవా, హలెప్‌ ఇంటికి

పారిస్‌

13సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఛాంపియన్‌ రఫెల్‌ నాదల్‌ రొలాండ్‌ గారోస్‌లో మరో టైటిల్‌ దిశగా అడుగులు వేస్తున్నాడు. అతడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడో రౌండ్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఈ స్పెయిన్‌ వీరుడు 6-3, 6-1, 6-4తో  మోటెట్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రఫా.. తొలి రెండు సెట్లలో నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. కానీ మూడో సెట్లో మోటెట్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లి ఆశ్చర్యపరిచాడు. వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌.. ఆ తర్వాత మరో అవకాశం ఇవ్వలేదు. పదో గేమ్‌లో బ్రేక్‌ సాధించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. ఇది రఫా కెరీర్‌లో 300వ గ్రాండ్‌స్లామ్‌ విజయం. నాదల్‌ వారసుడిగా పేరు తెచ్చుకున్న కార్లోస్‌ అల్కరస్‌ (స్పెయిన్‌) కూడా ముందంజ వేశాడు. అతడు అతికష్టం మీద  మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌ పోరులో ఆరోసీడ్‌ అల్కరస్‌ 6-1, 6-7 (7/9), 5-7, 7-6 (7/2), 6-4తో రమోస్‌ వినోలాస్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. నాలుగున్నర గంటలకు పైగా సాగిన ఈ పోరులో మ్యాచ్‌ పాయింట్‌ను కాపాడుకుని కార్లోస్‌ విజయాన్ని అందుకోవడం విశేషం. తొలి సెట్‌ గెలిచి జోరు మీద కనిపించిన అల్కరస్‌.. ఆ తర్వాత రెండు సెట్లూ ఓడిపోయాడు. అంతేకాదు నాలుగో సెట్లో ఓటమి అంచుల వరకు వెళ్లాడు. కానీ గొప్పగా పుంజుకున్న ఈ టీనేజర్‌.. ఆ సెట్‌తో పాటు ఆ తర్వాత సెట్‌నూ దక్కించుకుని ముందంజ వేశాడు. ఈ పోరులో అల్కరస్‌ 10 ఏస్‌లతో పాటు 74 విన్నర్లు కొట్టాడు. రష్యా స్టార్‌ డానియల్‌ మెద్వెదెవ్‌ కూడా మూడో రౌండ్‌ చేరాడు. ఈ రెండో సీడ్‌ 6-3, 6-4, 6-3తో లాస్లో డీర్‌ (సెర్బియా)ను ఓడించాడు. గోఫిన్‌ (బెల్జియం), హర్కాజ్‌ (పోలెండ్‌), రూడ్‌ (నార్వే), సిలిచ్‌ (క్రొయేషియా) మూడో రౌండ్‌ చేరారు.

ప్లిస్కోవా, హలెప్‌ ఔట్‌: మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకరైన కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఎనిమిదో సీడ్‌ ప్లిస్కోవా 2-6, 2-6తో జీన్‌జీన్‌ (ఫ్రాన్స్‌) చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్‌లో 5 డబుల్‌ఫాల్ట్స్‌తో పాటు 28 అనవసర తప్పిదాలు చేసిన ప్లిస్కోవా ఓటమి కొనితెచ్చుకుంది. మాజీ ఛాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) కథ కూడా ముగిసింది. అన్‌సీడెడ్‌ జెంగ్‌ (చైనా) 2-6, 6-2, 6-1తో హలెప్‌కు షాకిచ్చింది. మరోవైపు టాప్‌సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఆమె 6-0, 6-2తో రిస్కె (అమెరికా)ను చిత్తు చేసింది. తొమ్మిదో సీడ్‌ కొలిన్స్‌ (అమెరికా) 4-6, 3-6తో తన దేశానికే చెందిన రోజర్స్‌ చేతిలో ఓడగా.. మూడో సీడ్‌ బదోసా (స్పెయిన్‌), ఏడో సీడ్‌ సబలెంక (బెలారస్‌), మాడిసన్‌ కీస్‌ (అమెరికా), జెస్సికా (అమెరికా) ముందంజ వేశారు. బదోసా 7-5, 3-6, 6-2తో జువాన్‌ (స్లొవేనియా)పై గెలవగా, సబలెంక 6-1, 6-3తో బ్రింగెల్‌ (అమెరికా)పై, కీస్‌ 6-4, 7-6 (7/3)తో గర్సియా (ఫ్రాన్స్‌)పై, జెస్సికా 6-1, 5-7, 6-4తో కలినినా (ఉక్రెయిన్‌)పై నెగ్గారు.

ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జంట: పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న-మాట్‌ మిడిల్‌కాప్‌ (నెదర్లాండ్స్‌) జోడీ ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. రెండో రౌండ్లో బోపన్న జంట 6-3, 6-4తో ఆండ్రీ గోల్బెవ్‌ (కజకిస్థాన్‌)-ఫాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌)పై విజయం సాధించింది. మరోవైపు రామ్‌కుమార్‌ రామనాథన్‌ పోరు ముగిసింది. రామ్‌కుమార్‌-రీస్‌ (అమెరికా) జంట 3-6, 2-6తో కూహాఫ్‌ (నెదర్లాండ్స్‌)-స్కూప్స్‌కీ (బ్రిటన్‌) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియామీర్జా-డోడిగ్‌ (క్రొయేషియా) రెండో రౌండ్‌ చేరారు. సానియా జోడీ 7-6 (7/4), 6-2తో సిగ్మండ్‌ (జర్మనీ)-గోంజెలెజ్‌ (మెక్సికో)పై విజయం సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని