Updated : 28 May 2022 09:27 IST

Rajasthan vs Bangalore: బట్లర్‌ కొడితే.. రాజస్థాన్‌ ఫైనల్లో

జోస్‌ మరో శతకం

టైటిల్‌ పోరుకు రాజస్థాన్‌

 బెంగళూరుకు మళ్లీ భంగపాటు

అహ్మదాబాద్‌

ఈ 15వ సీజన్‌.. ఫైనల్‌ చేరాలంటే చివరి అవకాశం.. లక్ష్యం మరీ చిన్నదేమీ కాదు.. ప్రత్యర్థి తక్కువదేమీ కాదు.. కానీ పవర్‌ ప్లే ముగిసే సరికే ఆ జట్టుకు విజయం తేలికైపోయింది. అప్పుడే సాధించాల్సిన రన్‌రేట్‌ ఓవర్‌కు 6.50 పరుగులుగా మారింది. ఇక మ్యాచ్‌ ఎన్ని ఓవర్లలో ముగుస్తుందనే దానిమీదే ఆసక్తి. అందుకు కారణం బట్లర్‌. అతను బ్యాట్‌ పడితే బౌండరీలు సలామ్‌ కొట్టాయి. సిక్సర్లు ఖాతాలో చేరాయి. మరో సెంచరీ అతడి ఒల్లో వాలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న అతని జోరుకు రాజస్థాన్‌ తుదిపోరు చేరింది. బెంగళూరు ఇంటి ముఖం పట్టింది. ఆరంభ సీజన్‌లో టైటిల్‌ గెలిచాక.. మళ్లీ ఈ సీజన్‌ ఫైనల్లో అడుగుపెట్టడం రాజస్థాన్‌కిదే తొలిసారి. ఆదివారం టైటిల్‌ పోరులో గుజరాత్‌తో ఆ జట్టు తలపడుతుంది.

రాజస్థాన్‌  అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శుక్రవారం రెండో క్వాలిఫయర్‌లో బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో గెలిచిన ఆ జట్టు ఫైనల్‌ చేరింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (58; 42 బంతుల్లో 4×4, 3×6) మరోసారి సత్తాచాటాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ (3/22), మెకాయ్‌ (3/23) అదరగొట్టారు. ఈ పేస్‌ ద్వయం కచ్చితమైన లైన్‌, లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసి వికెట్లు సాధించింది. ఛేదనలో బట్లర్‌ (106 నాటౌట్‌; 60 బంతుల్లో 10×4, 6×6) అజేయ శతకంతో చెలరేగడంతో రాజస్థాన్‌ 3 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్‌ (2/23) ఆకట్టుకున్నాడు.

బాదుడే.. బాదుడు: 158.. ఆపసోపాలు పడుతూ బెంగళూరు బ్యాటర్లు రాజస్థాన్‌ ముందు ఉంచిన లక్ష్యమిది. మరీ తక్కువేమీ కాదు. పిచ్‌ కూడా బౌలింగ్‌కు సహకరిస్తోంది. దీంతో మ్యాచ్‌ కాస్త హోరాహోరీగా సాగుతుందేమోనన్న చిన్న ఆశ అభిమానులది. కానీ పరుగుల దాహం తీరని బట్లర్‌ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. కీలక మ్యాచ్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాడు. తొలి ఓవర్లో (సిరాజ్‌)నే మరో ఓపెనర్‌ యశస్వి (21) రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ఛేదనలో జట్టుకు అదిరే ఆరంభాన్నిచ్చాడు. ఇక సిరాజ్‌ (0/31) రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో బట్లర్‌ బౌండరీల దండయాత్ర మొదలెట్టాడు. బంతి మైదానంలో కనిపించకుండా.. బౌండరీ బయటే ఉండాలనేలా కసితీరా కొట్టాడు. షాబాజ్‌ (0/35) ఓవర్లో అలవోకగా రెండు సిక్సర్లు రాబట్టాడు. యశస్విని హేజిల్‌వుడ్‌ ఔట్‌ చేయడంతో ఆరు ఓవర్లకు రాజస్థాన్‌ 67/1తో నిలిచింది. ఆ వెంటనే 23 బంతుల్లోనే బట్లర్‌ అర్ధశతకం పూర్తయింది. బట్లర్‌కు శాంసన్‌ (23) తోడవడంతో జట్టు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. పదో ఓవర్లలోనే స్కోరు వంద దాటింది. ఆ తర్వాతి ఓవర్లోనే బట్లర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వికెట్‌కీపర్‌ కార్తీక్‌ పట్టలేకపోవడం దెబ్బతీసింది. శాంసన్‌ వికెట్‌ పడగొట్టిన బెంగళూరు బౌలర్లు మధ్యలో కట్టుదిట్టంగా బంతులేశారు. కానీ బట్లర్‌ ఆగలేదు. హసరంగ ఓవర్లో రెండు సిక్సర్లతో.. ఇటు సెంచరీకి తాను చేరువయ్యాడు.. అటు జట్టును గెలుపునకు దగ్గర చేశాడు. సింగిల్‌తో 59 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్లోనే సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించాడు.

బౌలర్లు భళా..: అంతకుముందు భారీస్కోరు సాధించేలా కనిపించిన బెంగళూరుకు రాజస్థాన్‌ బౌలర్లు కళ్లెం వేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ్‌, మెకాయ్‌ పిచ్‌ నుంచి లభించిన అధిక బౌన్స్‌ను ఉపయోగించుకుని ప్రత్యర్థిని కట్టడి చేశారు. లఖ్‌నవూతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సంచలన శతకంతో రాత్రికి రాత్రే హీరో అయిపోయిన రజత్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పేలవ ఫామ్‌ కొనసాగిస్తూ కోహ్లి (7) త్వరగానే పెవిలియన్‌ చేరడంతో డుప్లెసిస్‌ (25)కు జత కలిసిన రజత్‌ నెమ్మదిగా మొదలెట్టి.. ఆ తర్వాత చెలరేగాడు. పరాగ్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అతను మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించాడు. కానీ మధ్య ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. దీంతో స్కోరు వేగాన్ని పెంచాలనే ప్రయత్నంలో డుప్లెసిస్‌ వెనుదిరిగాడు. 11 ఓవర్లకు స్కోరు 81/2. వచ్చీ రాగానే మ్యాక్స్‌వెల్‌ (24) తనకు అలవాటైన రీతిలో బౌండరీలతో రెచ్చిపోయాడు. ఓ వైపు రజత్‌ టాప్‌గేర్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండడం.. ఇంకోవైపు మ్యాక్సీ ఎడాపెడా బాదేస్తుండడంతో బెంగళూరు 180కి పైగా పరుగులు చేస్తుందనిపించింది. కానీ గొప్పగా పుంజుకున్న రాజస్థాన్‌ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. మ్యాక్సీ మెరుపు ఇన్నింగ్స్‌కు బౌల్ట్‌ (1/28) ముగింపునిచ్చాడు. సిక్సర్‌తో అర్ధశతకం చేరుకున్న రజత్‌.. అశ్విన్‌ (1/31) ఉచ్చులో పడి వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్‌ గతి తప్పింది. అయినా క్రీజులో దినేశ్‌ కార్తీక్‌ (6) ఉన్నాడు కదా అని ఆశ పెట్టుకున్న జట్టుకు, అభిమానులకు ప్రసిద్ధ్‌ పెద్ద షాకిచ్చాడు. అతని బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ లెంగ్త్‌ బంతిని అంచనా వేయలేక లాంగాన్‌లో సులువైన క్యాచ్‌ ఇచ్చి కార్తీక్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే కళ్లు చెదిరే యార్కర్‌కు హసరంగ (0) బౌల్డయ్యాడు. చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు కేవలం 34 పరుగులు మాత్రమే సాధించింది.


4 

ఈ సీజన్‌లో బట్లర్‌కిది నాలుగో శతకం. ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి (2016లో 4) రికార్డును సమం చేశాడు.


5

భారత టీ20 క్రికెట్‌ లీగ్‌లో బట్లర్‌కిది అయిదో సెంచరీ. అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. గేల్‌ (6) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts