నిఖత్‌కు ఘన స్వాగతం

డప్పు, డోలు మోతలతో మార్మోగిన విమానాశ్రయం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో ఎటు చూసినా సందడే.. ఇక అడుగడుగునా పూల వర్షాలు.. ఇదీ ప్రపంచ ఛాంపియన్‌గా తొలిసారి రాష్ట్రంలో అడుగుపెట్టిన నిఖత్‌ జరీన్‌కు లభించిన ఘన స్వాగతం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడితో సరికొత్త

Published : 28 May 2022 03:06 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: డప్పు, డోలు మోతలతో మార్మోగిన విమానాశ్రయం.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ నృత్యాలతో ఎటు చూసినా సందడే.. ఇక అడుగడుగునా పూల వర్షాలు.. ఇదీ ప్రపంచ ఛాంపియన్‌గా తొలిసారి రాష్ట్రంలో అడుగుపెట్టిన నిఖత్‌ జరీన్‌కు లభించిన ఘన స్వాగతం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడితో సరికొత్త చరిత్ర సృష్టించిన నిఖత్‌ శుక్రవారం హైదరాబాద్‌ చేరుకుంది. ఆమెతో పాటు షూటింగ్‌ ఛాంపియన్‌ ఇషా సింగ్‌, ఫుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యలకు తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బంగారు పతకం ప్రదర్శిస్తూ నిఖత్‌ కనిపించగానే ప్రాంగణమంతా హోరెత్తింది. రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు మరో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ అమ్మాయిలకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ వాహనంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయిదు కిలోమీటర్ల మేర క్రీడాభిమానులు జాతీయ జెండాలతో ఈ ఛాంపియన్లకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిఖత్‌ మాట్లాడుతూ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని చెప్పింది. ‘‘ఒలింపిక్స్‌లో పసిడితో దేశం, రాష్ట్రం ప్రతిష్ఠను ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తూనే ఉంటా. ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎదగడానికి సహకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ మంత్రి కేటీఆర్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు’’ అని ఆమె చెప్పింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన నిఖత్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. ఆమెతో పాటు తన తల్లిదండ్రులను ఆయన అభినందించారు. నిఖత్‌, ఇషా సింగ్‌, సౌమ్య.. ఇలా నిజామాబాద్‌కు చెందిన ముగ్గురు అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో సత్తాచాటడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. శాట్స్‌ ఛైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని