Aruna Reddy: అనుమతి లేకుండా వీడియో తీశారు: అరుణా రెడ్డి

శారీరక ఫిట్‌నెస్‌ పరీక్ష సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా తన వీడియోను రికార్డు చేశారంటూ సాయ్‌ కోచ్‌ రోహిత్‌ జైస్వాల్‌పై తెలుగు జిమ్నాస్ట్‌ బుద్దా అరుణ రెడ్డి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎఫ్‌ఐ) నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ కోచ్‌ వీడియో

Updated : 28 May 2022 10:58 IST

దిల్లీ: శారీరక ఫిట్‌నెస్‌ పరీక్ష సందర్భంగా ఎలాంటి అనుమతి లేకుండా తన వీడియోను రికార్డు చేశారంటూ సాయ్‌ కోచ్‌ రోహిత్‌ జైస్వాల్‌పై తెలుగు జిమ్నాస్ట్‌ బుద్దా అరుణా రెడ్డి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య (జీఎఫ్‌ఐ) నుంచి ఎలాంటి ఆదేశాలు లేనప్పటికీ కోచ్‌ వీడియో తీశారని ఆమె చెబుతోంది. ఆమె ఫిర్యాదు మేరకు ఈ విషయంపై విచారణ కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) ముగ్గురు సభ్యుల కమిటీని శుక్రవారం నియమించింది. సాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (జట్లు) రాధిక  ఆధ్వర్యంలో కోచ్‌ కమలేష్‌, డిప్యూటీ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కైలాష్‌ మీనతో కూడిన కమిటీ దర్యాప్తు జరిపి వచ్చే వారం నివేదిక సమర్పించనుంది. .

చాలాసార్లు అడిగా..: ఫిట్‌నెస్‌ పరీక్ష సమయంలో జీఎఫ్‌ఐ అనుమతితోనే వీడియో తీస్తున్నారని అనుకున్నానని, కానీ ఆ తర్వాతే అసలు విషయం తెలిసిందని అరుణ ‘ఈనాడు’తో చెప్పింది. అనుమతి లేకుండా ఓ అమ్మాయి వీడియో ఎలా రికార్డు చేస్తారని ఆమె ప్రశ్నించింది. ‘‘కైరో ప్రపంచకప్‌ సందర్భంగా నా మోకాలికి గాయమైంది. ఈ ఏడాది మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగిన బాకు ప్రపంచకప్‌ పోటీలకు ముందు జీఎఫ్‌ఐ ఆదేశాల మేరకు ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం దిల్లీకి వెళ్లా. జీఎఫ్‌ఐ ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలోనే మార్చి 24న పరీక్ష జరిగింది. అప్పుడు సాయ్‌ కోచ్‌ జైస్వాల్‌ తన శిష్యుడితో వీడియో తీయించారు. ఆ పోటీల్లో పాల్గొనే భారత జట్టుకు నన్ను ఎంపిక చేయలేదు. ఆ తర్వాత గాయం తీవ్రత పెరగడంతో ఆ వీడియో, వైద్య నివేదిక పంపించాలని జీఎఫ్‌ఐ అధ్యక్షుడు సుధీర్‌ మిట్టల్‌కు చాలా సార్లు మెయిల్‌ చేశా. వీడియో తీసేందుకు ఎలాంటి అనుమతి లేదని ఈ నెల 24న అతని నుంచి బదులొచ్చింది. ఎలాంటి వీడియో లేదని చెబుతున్నారు. కానీ వీడియో తీశారనడానికి నా దగ్గర ఆధారాలున్నాయి. అందుకే ఫిర్యాదు చేశా’’ అని ఆమె తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని