Published : 28 May 2022 03:06 IST

ప్రిక్వార్టర్స్‌లో జకో

నాదల్‌, గాఫ్‌ ముందంజ

ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్లో టైటిల్‌ దిశగా మరో అడుగు వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో జకో 6-3, 6-3, 6-2తో అలిజ్‌ బిదానె (స్లొవేనియా)ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన జకో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరో గేమ్‌లో సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆపై సెట్‌ గెలుచుకున్న జకో...ఆ తర్వాత రెండు సెట్లలో రెండేసిసార్లు బిదానె సర్వీస్‌లో బ్రేక్‌ సాధించి విజయాన్ని అందుకున్నాడు. టైటిల్‌ ఫేవరెట్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్స్‌ చేరాడు. మూడో రౌండ్లో నాదల్‌ 6-3, 6-2, 6-4తో జాండ్‌చాప్‌ (నెదర్లాండ్స్‌)పై నెగ్గాడు. తొలి సెట్‌ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నాదల్‌ ఆపై సెట్‌ గెలిచి ఆధిక్యంలోకి వెళ్లాడు. రెండో సెట్లో రఫా మరింత చెలరేగి ఆడాడు. తన శైలిలో బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో పాటు తెలివైన డ్రాప్‌లతో జాండ్‌చాప్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. అదే దూకుడుతో 3, 5 గేముల్లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి సెట్‌ గెలిచాడు. మూడో సెట్లోనూ నాదల్‌దే హవా. అయితే జాండ్‌చాప్‌ కాస్త పుంజుకున్నా రఫా జోరు ముందు నిలువలేకపోయాడు. పదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్‌ సాధించిన నాదల్‌ సెట్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఈ పోరులో నాదల్‌ 2 ఏస్‌లతో పాటు 25 విన్నర్లు కొట్టాడు. ష్వార్జ్‌మ్యాన్‌ (అర్జెంటీనా), అలియాసిమ్‌ (కెనడా) కూడా ముందంజ వేశారు.

గాఫ్‌ ముందుకు: అమెరికా టీనేజర్‌ కొకోగాఫ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్లో ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్లో 18వ సీడ్‌ గాఫ్‌ 6-3, 6-4తో కయా కనేపి (ఇస్తోనియా)పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదటి నుంచి జోరుగా ఆడిన గాఫ్‌ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి ఆపై సెట్‌ గెలిచింది. రెండో సెట్లో కనేపి కాస్త పోరాడింది. కానీ ఏడో గేమ్‌లో ప్రత్యర్థి అనవసర తప్పిదాన్ని సొమ్ము చేసుకుంటూ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన గాఫ్‌.. అదే ఊపులో సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలుచుకుని వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరోవైపు రొలాండ్‌ గారోస్‌లో మహిళల విభాగంలో సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతోంది. జర్మనీ స్టార్‌ ఏంజెలిక్‌ కెర్బర్‌ మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. రెండో రౌండ్లో 21వ సీడ్‌ కెర్బర్‌ 4-6, 6-7 (5/7)తో సస్‌నోవిచ్‌ (బెలారస్‌) చేతిలో ఓడింది. 14వ సీడ్‌ బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) కూడా ఓడిపోయింది. కెనడా సంచలనం లెలా ఫెర్నాండెజ్‌ 7-5, 3-6, 7-5తో బెన్సిచ్‌ పోరాటానికి తెర దించింది. అనిసిమోవా (అమెరికా), మెర్టిన్స్‌ (బెల్జియం), ట్రెవిసాన్‌ (ఇటలీ) ప్రిక్వార్టర్స్‌ చేరారు. ముచోవా (చెక్‌రిపబ్లిక్‌)తో పోరులో అనిసిమోవా 6-7 (7/9), 6-2, 3-0తో ఉన్న దశలో ప్రత్యర్థి గాయంతో తప్పుకోవడంతో అనిసిమోవా ముందంజ వేసింది. మరో మ్యాచ్‌లో మెర్టిన్స్‌ 6-2, 6-3తో గ్రెచెవా (రష్యా)పై గెలవగా, ట్రెవిసాన్‌ 6-3, 6-4తో సావిల్లె (ఆస్ట్రేలియా)ను ఓడించింది. బెలారస్‌ స్టార్‌ అజరెంకా 6-4, 5-7, 6-7 (5/10)తో టెక్మాన్‌ (స్విట్జర్లాండ్‌) చేతిలో ఓడింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని