బంగ్లాపై శ్రీలంక భారీ విజయం

ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీలంక భారీ విజయాన్ని అందుకుంది. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 34/4తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 169 పరుగులకు ఆలౌటైంది.

Published : 28 May 2022 03:06 IST

1-0తో సిరీస్‌ సొంతం

ఢాకా: ఆతిథ్య బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీలంక భారీ విజయాన్ని అందుకుంది. 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 34/4తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన బంగ్లా 169 పరుగులకు ఆలౌటైంది. లంక పేసర్‌ అసిత ఫెర్నాండో (6/51) ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. లిటన్‌ దాస్‌ (52; 135 బంతుల్లో 3×4), షకీబ్‌ అల్‌ హసన్‌ (58; 72 బంతుల్లో 7×4) ఆరో వికెట్‌కు 103 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరినీ అసిత పెవిలియన్‌ చేర్చడంతో జట్టు పతనం వేగంగా సాగింది. ఓ దశలో 156/5తో ఉన్న బంగ్లా.. అసిత ధాటికి 13 పరుగుల వ్యవధిలోనే మిగతా అయిదు వికెట్లు కోల్పోయింది. అనంతరం 29 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని లంక వికెట్‌ కోల్పోకుండా అందుకుంది. ఓపెనర్లు ఒషాడ ఫెర్నాండో (21 నాటౌట్‌), కరుణరత్నె (7 నాటౌట్‌) పని పూర్తిచేశారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్ల (4/93)తో రాణించిన అసిత.. టెస్టులో తొలి సారి పది వికెట్ల ఘనత సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 365 పరుగులు చేయగా.. లంక 506 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని