సూపర్‌-4లో శుభారంభం

భారత హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా కప్‌లో అతికష్టంపై నాకౌట్‌ చేరిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. సూపర్‌ 4ను ఘనంగా ఆరంభించింది. రెండు సూపర్‌ ఫీల్డ్‌ గోల్స్‌ చేసిన భారత్‌.. తన తొలి మ్యాచ్‌లో 2-1తో జపాన్‌పై విజయం సాధించింది.

Published : 29 May 2022 02:22 IST

ఆసియా కప్‌ హాకీలో జపాన్‌పై భారత్‌ విజయం

జకార్తా: భారత హాకీ జట్టు అదరగొట్టింది. ఆసియా కప్‌లో అతికష్టంపై నాకౌట్‌ చేరిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. సూపర్‌ 4ను ఘనంగా ఆరంభించింది. రెండు సూపర్‌ ఫీల్డ్‌ గోల్స్‌ చేసిన భారత్‌.. తన తొలి మ్యాచ్‌లో 2-1తో జపాన్‌పై విజయం సాధించింది. పూల్‌లో ఆ జట్టు చేతిలో ఎదురైన 2-5 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. మంజీత్‌ (8వ), పవన్‌ రాజ్‌భర్‌ (35వ) భారత్‌ తరఫున గోల్స్‌ కొట్టారు. జపాన్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను 18వ నిమిషంలో తకుమా నివా సాధించాడు.

మ్యాచ్‌ తొలి నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను సాధించి జపాన్‌.. భారత్‌ను కలవరపెట్టింది. కానీ ఆ జట్టు గోల్‌ ప్రయత్నాన్ని భారత్‌ తిప్పికొట్టింది. ఆత్మవిశ్వాసం పెరిగిన భారత్‌.. మ్యాచ్‌ సాగుతున్నకొద్దీ మెరుగైంది. మంజీత్‌ అదిరే ప్రదర్శన ఆ జట్టుకు ఆధిక్యాన్నిచ్చింది. పవన్‌ నుంచి పాస్‌ అందుకున్న మంజీత్‌ తన నైపుణ్యంతో జపాన్‌ గోలకీపర్‌ను బోల్తా కొట్టించాడు. 13వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను సంజీప్‌ సద్వినియోగం చేయలేకపోయాడు. 18వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను తకుమా గోల్‌గా మలచడంతో జపాన్‌ 1-1తో స్కోరు సమం చేసింది. రెట్టించిన ఉత్సాహంతో దూకుడు పెంచిన జపాన్‌.. భారత డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచి మరో రెండు పెనాల్టీ కార్నర్‌లు రాబట్టింది. కానీ సఫలం కాలేదు. ద్వితీయార్ధం ఆరంభంలో పవన్‌ గోల్‌తో భారత్‌ తిరిగి ఆధిక్యం సంపాదించింది. ఉత్తమ్‌ అవకాశాన్ని సృష్టించగా.. పవన్‌ సమీపం నుంచి గోల్‌ కొట్టాడు. అయిదు నిమిషాల తర్వాత ప్రత్యర్థికి భారత్‌ మరో పెనాల్టీ కార్నర్‌ను ఇచ్చింది. కానీ జపాన్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. వెనుకబడ్డ జపాన్‌.. తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినా భారత రక్షణ శ్రేణి దృఢంగా నిలబడింది. ఆ జట్టుకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. మ్యాచ్‌ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా జపాన్‌ మరో పెనాల్టీ కార్నర్‌ను సంపాదించింది. కానీ భారత్‌ మరోసారి ఆ జట్టు ప్రయత్నాన్ని అడ్డుకుని మ్యాచ్‌లో పైచేయి సాధించింది. భారత్‌ తన తర్వాతి సూపర్‌ 4 మ్యాచ్‌లో ఆదివారం మలేసియాను ఢీకొంటుంది. మలేసియా, దక్షిణ కొరియా మధ్య జరిగిన మ్యాచ్‌ 2-2తో డ్రాగా ముగిసింది. సూపర్‌ 4లో ప్రతి జట్టూ ఇంకో జట్టుతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని