Rafael Nadal: ఈ దాహం తీరనిది

19 ఏళ్ల కుర్రాడు.. తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో దిగి విజేతగా నిలిచాడు. యువ రక్తంతో పరుగులు పెట్టే ఆ టీనేజర్‌.. ఘనంగా గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాడు. 26 ఏళ్ల ఆటగాడు.. ఓ వైపు సీనియర్ల అనుభవాన్ని తట్టుకుంటూ.. మరోవైపు జూనియర్ల నుంచి పోటీని ఎదుర్కొంటూ..

Updated : 06 Jun 2022 09:11 IST

ఈనాడు క్రీడావిభాగం

19 ఏళ్ల కుర్రాడు.. తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో దిగి విజేతగా నిలిచాడు. యువ రక్తంతో పరుగులు పెట్టే ఆ టీనేజర్‌.. ఘనంగా గ్రాండ్‌స్లామ్‌ బోణీ కొట్టాడు. 26 ఏళ్ల ఆటగాడు.. ఓ వైపు సీనియర్ల అనుభవాన్ని తట్టుకుంటూ.. మరోవైపు జూనియర్ల నుంచి పోటీని ఎదుర్కొంటూ.. టైటిళ్ల దండయాత్ర కొనసాగించాడు. 36 ఏళ్ల సీనియర్‌.. వయసు మీద పడుతున్నా వన్నె తగ్గని ఆటతో.. వెనక్కితగ్గని పోరాటంతో.. అత్యుత్తమ ఆటగాళ్లను ఓడించి ట్రోఫీ అందుకున్నాడు.

పైన పేర్కొన్న ఆటగాళ్లు ముగ్గురు కాదు.. ఒక్కడే! అవును.. అతనే రఫెల్‌ నాదల్‌. తరాలు మారుతున్నా.. దశాబ్దాలు గడుస్తున్నా.. అతని టైటిళ్ల దాహం మాత్రం తీరడం లేదు. పురుషుల టెన్నిస్‌లో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్‌ విజయాలతో శిఖరాగ్రానికి చేరిన ఈ స్పెయిన్‌ బుల్‌ను నడిపిస్తున్నదేమిటి? అతనికా శక్తి ఎక్కడి నుంచి వస్తోంది?

కొలిమిలో మండుతూ సుత్తి దెబ్బలు తినే ఇనుము.. ఆయుధంగా మారుతుంది. నాదల్‌ అలాంటి ఓ ఆయుధమే. ఫెదరర్‌, జకోవిచ్‌, గాయాలు.. ఈ మూడింటినీ దాటి ఇప్పుడతను దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడిగా ఎదిగాడు. ఎన్నో అడ్డంకులు ఎదురైనా.. మరెన్నో ఒడుదొడుకులు వచ్చినా.. సమస్యలు పలకరించినా.. అతనెప్పుడూ ఆగిపోలేదు. ఒకవేళ ఆగిపోయి ఉంటే ఇప్పుడు నాదల్‌ అనే దిగ్గజం ఉండేవాడు కాదు. ‘‘నేను టెన్నిస్‌ ఎందుకు ఆడుతున్నానంటే దాన్ని ప్రేమిస్తున్నా కాబట్టి’’ ఇదీ రఫా చెప్పిన మాట. ఆటపై ప్రేమ, అంకిత భావమే తన విజయాలకు కారణమని అతనంటాడు. అదే అక్షర సత్యం. ప్రేమ ఎంత పనైనా చేయిస్తుంది.. ఎంత దూరమైనా నడిపిస్తుంది. ఇప్పుడు టెన్నిస్‌పై ప్రేమ అతణ్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. అద్భుతమంటూ ఏదీ ఉండదు అని నమ్మే అతనే ఓ అద్భుతం.


గెలుపు కాదు..

బంతిని బలంగా బాదడం.. ప్రత్యర్థికి అందకుండా కొట్టడం.. అవతలి వ్యక్తిని ఓడించడం.. ఇవీ నాదల్‌ లక్ష్యాలు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఇన్ని టైటిళ్లు సాధించడం.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాలు.. వీటి గురించి అతనెప్పుడూ ఆలోచించలేదు. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటే.. క్రమంగా ఉన్నతి సాధిస్తూనే ఉంటే.. ఎప్పటికప్పుడూ మెరుగవుతూనే ఉంటే.. గెలుపు దక్కుతుందని తనకు తెలుసు. అందుకే ఎప్పుడూ విజయం గురించి కాకుండా దాన్ని చేరుకునే ప్రక్రియపైనే ధ్యాస పెట్టాడు. టీనేజీ నుంచే తన ఆలోచన విధానమిదే. అందుకే 19 ఏళ్లకే తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచినా.. ఇప్పుడు 36 ఏళ్లకు అదే టోర్నీలో 14వ టైటిల్‌ను అందుకున్నా అతను పొంగిపోలేదు. ‘‘ఇప్పటికీ టెన్నిస్‌ ఆడుతున్నానంటే.. గెలుపోటములను సమానంగా చూడడమే ఓ ప్రధాన కారణం. మంచి రోజులుంటాయి.. అలాగే చెడు రోజులూ వస్తాయి. కానీ వాటిని ఒకేలా చూడాలి’’ అని నాదల్‌ అంటాడు. వెనకబడ్డానని ఆగిపోడు. ఆధిక్యం దక్కిందని నెమ్మదించడు. పరిస్థితి ఏదైనా.. కోర్టులో అతని దూకుడు సాగుతూనే ఉంటుంది.


అలుపు కాదు ఊపు..

వయసు మీద పడితే అలుపు రావడం సహజం. జవసత్వాల్లో పట్టు తగ్గుతుంది. కానీ రఫాకు మాత్రం ఊపు వస్తోంది. ఈ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అతని ఆటతీరే అందుకు నిదర్శనం. ప్రి క్వార్టర్స్‌లో, క్వార్టర్స్‌లో నాలుగు గంటలకు పైగా ప్రత్యర్థులతో పోరు.. సెమీస్‌లో మూడు గంటలకు పైగా సమరం.. అయినా అతను అలసి పోలేదు. అలవోకగా ఫైనల్లో గెలిచేశాడు. ఎంతో దూరంగా వెళ్తున్నట్లు కనిపిస్తున్న బంతిని అమాంతం రాకెట్‌తో కొట్టేస్తాడు. కానీ తన పరిధిలోనే లేని బంతిని కూడా తిరుగులేని వేగంతో రిటర్న్‌ చేస్తాడు. కోర్టుకు రెండు వైపులా చిరుతలా పరుగులు పెట్టాడు. దాదాపు రెండు దశబ్దాలుగా అతని ఈ వేగం నిలకడగా కొనసాగుతోంది. ఇప్పుడూ అదే కనిపించింది. ముఖ్యంగా జ్వెరెవ్‌తో సెమీస్‌ మ్యాచ్‌లో.. నాదల్‌ అంతకుమించి ఆటతీరు ప్రదర్శించాడు. ప్రత్యర్థి కోర్టులో ఓ మూలకు బంతి కొట్టాడా? అక్కడ నాదల్‌ ఉంటాడు. ఆ వెంటనే ఇంకో మూలకు బంతి వెళ్లిందా? అక్కడా అతనుంటాడు. ఆ వెంటనే నెట్‌ దగ్గరకు వేగంగా పరుగెత్తుకుంటూ వస్తాడు. మళ్లీ కోర్టు బయటకు వెళ్తాడు. ఇలా బంతి ఎక్కడికి వెళ్తే అక్కడికి.. ఇలా కోర్టులో మొత్తం అతనే కనిపించాడు. పాయింట్లు గెలిస్తే వచ్చే ఉత్సాహం.. సెట్‌ నెగ్గితే వచ్చే ఊపు.. మ్యాచ్‌ సొంతమైతే కలిగే శక్తి.. ఇలా మొత్తంగా తనను టైటిల్‌ అందుకునేలా నడిపించాయి.


తగ్గేదేలే..

ఆటగాళ్ల కెరీర్‌ను గాయాలు ప్రమాదంలో పడేస్తాయి. కానీ అలాంటి గాయాలెన్నింటినో దాటుకుని రఫా ఈ స్థాయికి చేరాడు. తొడ కండరాలు, మోకాలు, దీర్ఘకాలంగా వేధిస్తున్న పాదం.. ఇలా చాలా గాయాల తీవ్రత కారణంగా కన్నీళ్లు పెట్టుకుని ఇక ఆటకు గుడ్‌బై చెప్పేద్దామా? అని అతను ఆలోచించిన రోజులున్నాయి. గతేడాది సగం సమయం కోర్టుకు దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు నెల రోజుల ముందు కూడా తిరిగి టెన్నిస్‌ ఆడతానా? అనే అనుమానం వ్యక్తం చేశాడు. కానీ ఎప్పటికప్పుడూ గాయాలను దాటుకుంటూ.. ఆటలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగే అలవాటును కొనసాగించాడు. బేస్‌లైన్‌కు దగ్గరగా ఉంటూ సర్వీస్‌ చేయడం.. ర్యాలీల కంటే కూడా విన్నర్లపై ఎక్కువగా దృష్టి పెట్టడం.. బంతిని స్పిన్‌ చేస్తూ ప్రత్యర్థిని బోల్తా కొట్టించడం.. తన సామర్థ్యాన్ని పెంచుకుని అలసట అనే పదాన్నే దరి చేరకుండా చూసుకోవడం.. ఇలా ఎప్పటికప్పుడూ తనను తాను కొత్తగా మార్చుకుంటున్నాడు.


ఎంతో ప్రత్యేకం..

ప్రత్యర్థి చేతిలో ఓటమితోనో, అంపైర్‌తో గొడవపడో రాకెట్‌ను నేలకు కొట్టే ఆటగాళ్లున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసే క్రీడాకారులూ ఉన్నారు. కానీ నాదల్‌ ఎప్పుడైనా అలా ప్రవర్తించాడా? అంటే దాదాపు లేదనే చెప్పాలి. ఆటను ప్రేమించే అతను.. ప్రత్యర్థులను గౌరవిస్తాడు. గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాడు. అందుకే సెమీస్‌లో జ్వెరెవ్‌కు గాయమైతే గదిలోకి వెళ్లి అతని పరిస్థితి తెలుసుకున్నాడు. తిరిగి కోర్టులోకి వచ్చి జ్వెరెవ్‌కు గాయం కావడం తనను బాధించిందని చెప్పాడు. మ్యాచ్‌కు ఇలాంటి ముగింపు నిరాశ కలిగించిందని పేర్కొన్నాడు. ఈ ఒక్క సంఘటనే అనే కాదు. అతనెప్పుడూ కోర్టులో గీత దాటి ప్రవర్తించలేదు. అందుకే అభిమానులకే కాదు ఫెదరర్‌, జకోవిచ్‌ లాంటి ప్రత్యర్థులకూ అతనంటే ఎంతో గౌరవం. ‘‘ప్రపంచానికి మనమే రాజు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఈ జీవితంలో ప్రతి ఒక్కరూ ముఖ్యమే’’ అని చెప్పే రఫా.. ఆచరణలోనూ దాన్ని పాటిస్తున్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచిన అతను.. ఇక మిగిలిన వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌లోనూ జయ కేతనం ఎగరేయాలని చూస్తున్నాడు. గాయం మళ్లీ తిరగబెట్టకుంటే.. అతను ఇదే దూకుడు కొనసాగిస్తే ఆ రెండు టైటిళ్లూ ఖాతాలో చేరడం ఖాయం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని