Dinesh Karthik: కార్తీక్‌.. తలుపు బద్దలు కొట్టాడు: రాహుల్‌ ద్రవిడ్‌

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? తుది జట్టుపై కోచ్‌ ద్రవిడ్‌ ఓ అంచనాకు ఎప్పుడు వస్తాడు? దినేశ్‌ కార్తీక్‌కు ఎలాంటి పాత్ర అప్పగిస్తారు? విఫలమవుతున్న పంత్‌ సంగతేంటీ? ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Updated : 21 Jun 2022 06:49 IST

జట్టులో పంత్‌ అంతర్భాగం

ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుంది? తుది జట్టుపై కోచ్‌ ద్రవిడ్‌ ఓ అంచనాకు ఎప్పుడు వస్తాడు? దినేశ్‌ కార్తీక్‌కు ఎలాంటి పాత్ర అప్పగిస్తారు? విఫలమవుతున్న పంత్‌ సంగతేంటీ? ఇలా చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా సిరీస్‌ ముగిసిన నేపథ్యంలో ఇలాంటి ఎన్నో సందేహాలకు ద్రవిడ్‌ సమాధానమిచ్చాడు. సఫారీ సేనతో టీమ్‌ఇండియా ప్రదర్శన.. టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక ప్రణాళిక.. ఇంగ్లాండ్‌లో టెస్టు మ్యాచ్‌.. ఇలా ఎన్నో విషయాలు పంచుకున్నాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!

బెంగళూరు

దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో జట్టులో తన ఎంపికకు దినేశ్‌ కార్తీక్‌ న్యాయం చేశాడు. అతనికి అప్పగించిన పనిని సమర్థంగా పూర్తి చేయడం చూస్తుంటే గొప్పగా ఉంది. కార్తీక్‌ ప్రదర్శన కారణంగా ముందుకు సాగే క్రమంలో జట్టు పరంగా మాకు చాలా అవకాశాలు ఏర్పడతాయి. గత రెండు లేదా మూడేళ్లుగా ఐపీఎల్‌లో ఫినిషర్‌గా అతని అసాధారణ ప్రదర్శన చూసి ఇప్పుడు జట్టులోకి తీసుకున్నాం. దక్షిణాఫ్రికాతో రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో అతనాడిన ఇన్నింగ్స్‌ (27 బంతుల్లో 55 పరుగులు) మా నిర్ణయం జట్టుకు కలిసొచ్చిందనే దానికి సూచికగా నిలిచింది. ఇన్నింగ్స్‌ చివరి అయిదు ఓవర్లలో చెలరేగి జట్టుకు అధిక స్కోరు అందించే ప్రదర్శనలు కావాలి. ఆ దిశగా కార్తీక్‌, హార్దిక్‌ ఉత్తమంగా బ్యాటింగ్‌ చేశారు. చివరి ఓవర్లలో మా ప్రణాళికలకు అమలు చేసేది వాళ్లిద్దరే. టీ20 ప్రపంచకప్‌ జట్టు ఎంపిక పరిగణలో కార్తీక్‌ కచ్చితంగా ఉంటాడు. జట్టులోకి రావాలంటే కేవలం తలుపు తట్టితే సరిపోదు దాన్ని బద్దలు కొట్టాలి. రాజ్‌కోట్‌లో అర్ధశతకంతో కార్తీక్‌ ఆ పని చేశాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టుపై..

టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాకు పయనమయ్యే భారత బృందంపై వీలైనంత త్వరగా ఓ స్పష్టతకు వస్తాం. ప్రపంచకప్‌ దగ్గర పడుతున్న కొద్దీ తుది బృందంలో ఉండే ఆటగాళ్లు ఎవరో నిర్ణయించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ప్రస్తుతం మనం జీవిస్తున్న ప్రపంచంలో కొన్ని అనిశ్చితితో కూడిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచకప్‌ కోసం 15 మంది ఆటగాళ్లనే తీసుకెళ్లాలి. కానీ అందుకోసం ముందుగా 18 నుంచి 20 మంది క్రికెటర్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్ల గాయాలు, మన నియంత్రణలో లేని ఇతర కారణాల వల్ల కొన్ని మార్పులు చేయాల్సి రావొచ్ఛు ఐర్లాండ్‌తో సిరీస్‌ లేదా ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌ల తర్వాత తుది బృందంపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని చెప్పడం కష్టమే. కానీ వీలైనంత త్వరగా ఈ అంశంపై దృష్టి సారిస్తాం. ఓ జట్టుగా మేం మరింత సానుకూలంగా, దూకుడైన క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాం. మొదటి నుంచి అదే చేస్తున్నాం. ఇలాంటివి ప్రయత్నించినప్పుడు అన్ని సార్లు అనుకున్న ఫలితం రాదు. కానీ మేం ఎలాంటి క్రికెట్‌ ఆడాలనుకుంటున్నామనే దానిపై ఓ స్పష్టత ఉంది.

నిరాశ లేదు

కేవలం కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన ఆటగాళ్లపై ఓ అంచనాకు రాలేం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోం. ఒక సిరీస్‌ లేదా ఒక మ్యాచ్‌లో ప్రదర్శన బట్టి ఆటగాళ్లపై ఓ నిర్ణయానికి రావడం నాకు నచ్చదు. క్లిష్టమైన వికెట్లపైనా కొన్ని మ్యాచ్‌ల్లో శ్రేయస్‌ ఎంతో అంకితభావంతో జట్టు కోసం సానుకూలంగా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో రుతురాజ్‌ తన సత్తాచాటాడు. ఎవరి ప్రదర్శనా మాకు నిరాశ కలిగించలేదు. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆటగాళ్లతో చర్చిస్తాం. మన క్రికెటర్లలో చాలా మందికి ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉంది. ఇక విశ్లేషణ, సమాచారం విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తాం. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు బిగ్‌బాష్‌ లీగ్‌ గణాంకాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటిపైనా పరిశోధన చేస్తాం. ప్రపంచకప్‌కు ముందు కంగారూ గడ్డపై మాకు సిరీస్‌ ఆడే అవకాశం లేదు. దాన్ని మనం మార్చలేం. ప్రపంచకప్‌కు ముందు రెండు వారాల సమయాన్ని మెరుగ్గా ఉపయోగించుకుని టోర్నీకి సిద్ధమవుతాం.

ఇంగ్లాండ్‌ మెరుగ్గా..

నిరుడు ఇంగ్లాండ్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. అప్పుడు వాయిదా పడ్డ చివరి టెస్టు జులై 1న ఆరంభం కానుంది. ఇప్పుడు పరిస్థితులు విభిన్నంగా మారాయి. గతేడాది సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు ఇంగ్లాండ్‌ ఉత్తమంగా ఆడుతోంది. కొన్ని మంచి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ న్యూజిలాండ్‌తో సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. కానీ మా జట్టు కూడా అత్యుత్తమంగా ఉంది. టెస్టు క్రికెట్‌ ఆడడాన్ని ఎంతో ఇష్టపడ్ఢా సుదీర్ఘ ఫార్మాట్లో మ్యాచ్‌లను చూడడం ఆస్వాదిస్తా. ఇప్పుడు టెస్టుల్లో జట్టుకు కోచింగ్‌ ఇవ్వడాన్ని కూడా ప్రేమిస్తా. అందుకే ఇంగ్లాండ్‌తో టెస్టు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.


పంత్‌ కీలకం..

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పంత్‌ (5 మ్యాచ్‌ల్లో 58) రాణించలేకపోయినప్పటికీ అతను జట్టు భవిష్యత్‌ ప్రణాళికల్లో కీలకం. ఈ సిరీస్‌లో అతను మరిన్ని పరుగులు చేయాల్సి ఉండేదని అనుకున్నాడు. కానీ అది తనను ఏ మాత్రం బాధ పెట్టదు. మధ్య ఓవర్లలో ఎదురు దాడి చేసి పరుగులు సాధించే ఆటగాళ్లు కావాలి. స్ట్రైక్‌రేట్‌ (158కి పైగా) పరంగా చూసుకుంటే ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను మంచి ప్రదర్శనే చేశాడు. సగటు విషయంలో వెనకబడ్డప్పటికీ దాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగైన గణాంకాలు అందుకుంటాడనే నమ్మకంతో ఉన్నాం. దూకుడుగా ఆడే క్రమంలో కొన్ని మ్యాచ్‌ల్లో అతను తప్పులు చేసి ఉండొచ్ఛు కానీ మా బ్యాటింగ్‌ లైనప్‌లో అతను అంతర్భాగంగా కొనసాగుతాడు. తనకున్న బలం అలాంటిది. పైగా మధ్య ఓవర్లలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడే అలాంటి ఎడమ చేతి వాటం బ్యాటర్‌ మాకు ముఖ్యం. కెప్టెన్సీ విషయానికి వస్తే 0-2తో వెనకబడ్డ జట్టును 2-2తో సిరీస్‌ సమం చేసే స్థాయికి అతను తీసుకురావడం గొప్ప విషయం. సారథ్యం అంటే కేవలం గెలుపోటములు మాత్రమే కాదు. పంత్‌ ఓ యువ కెప్టెన్‌. నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడే అతనికి కెప్టెన్సీ, కీపింగ్‌, బ్యాటింగ్‌ అవకాశాలు రావడం మంచి విషయమే. దీని వల్ల అతనిపై భారం పడుతోంది. కానీ దాని నుంచి అతను అనుభవాన్ని పొందాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని