Updated : 24 Jun 2022 07:28 IST

Team India WarmUp Match: భరత్‌ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్‌ఆర్డర్‌

భారత్‌ 246/8
వార్మప్‌ మ్యాచ్‌
లెస్టర్‌

ఇంగ్లాండ్‌తో కీలకమైన అయిదో టెస్టుకు ముందు టీమ్‌ఇండియా ఆడుతున్న ఏకైక సన్నాహక మ్యాచ్‌లో జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. అసలు పోరుకు ముందు ఈ వార్మప్‌ మ్యాచ్‌లో వీలైనంత ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశాన్ని కీలక బ్యాటర్లు అందిపుచ్చుకోలేకపోయారు. రిజర్వ్‌ వికెట్‌ కీపర్‌ కేఎస్‌ భరత్‌ (70 బ్యాటింగ్‌; 111 బంతుల్లో 8×4, 1×6) మాత్రమే క్రీజులో నిలబడ్డాడు. దీంతో గురువారం లెస్టర్‌ జట్టుతో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 246/8తో నిలిచింది. వర్షం కారణంగా ఆట ముందుగానే ముగిసింది. భరత్‌కు తోడుగా షమి (18 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (25), శుభ్‌మన్‌ గిల్‌ (21), కోహ్లి (33) మంచి ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ప్రత్యర్థి బౌలర్లలో 21 ఏళ్ల పేసర్‌ రోమన్‌ వాకర్‌ (5/24) సత్తాచాటాడు. ఈ మ్యాచ్‌లో పుజారా, పంత్‌, బుమ్రా, ప్రసిద్ధ్‌.. లెస్టర్‌ తరఫున ఆడుతున్నారు. ఆటగాళ్లకు వీలైనంత ఎక్కువ ప్రాక్టీస్‌ కల్పించాలనే ఉద్దేశంతో భారత జట్టు మేనేజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. పదునైన పేస్‌ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన ప్రసిద్ధ్‌.. శ్రేయస్‌ను వెనక్కి పంపడం విశేషం.

నిలబడలేక..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తడబడింది. టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్లుగా వస్తారనే అంచనాలున్న రోహిత్‌, గిల్‌ ఈ వార్మప్‌ పోరులో ఇన్నింగ్స్‌ ఆరంభించారు. కానీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. శరీరానికి దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి గిల్‌.. విల్‌ డేవిస్‌ (2/64) బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ కొద్దిసేపటికే హుక్‌ షాట్‌ ఆడి ఔటయ్యే బలహీనతను కొనసాగిస్తూ రోహిత్‌ నిష్క్రమించాడు. అక్కడి నుంచి ఓ ఎండ్‌లో వాకర్‌.. మరో ఎండ్‌లో ప్రసిద్ధ్‌ (1/37) బ్యాటర్లను పరీక్షించారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన విహారి (3) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. ఇక శ్రేయస్‌ (0) ఖాతా తెరవకుండానే దూరంగా వెళ్తున్న బంతిని ఆడి పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. జడేజా (13) వికెట్ల ముందు దొరికిపోవడంతో జట్టు 81/5తో కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులో అడుగుపెట్టిన భరత్‌ పాతుకుపోయాడు. ఈ ఆంధ్ర ఆటగాడు ఎంతో పట్టుదలతో బ్యాటింగ్‌ చేశాడు. చెలరేగుతున్న ప్రత్యర్థి బౌలర్లను జాగ్రత్తగా కాచుకున్నాడు. కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. మరో ఎండ్‌లో దాదాపు రెండు గంటల పాటు క్రీజులో గడిపిన కోహ్లి భారీ స్కోరు చేసేలా కనిపించాడు. కానీ తన వరుస ఓవర్లలో కోహ్లి, శార్దూల్‌ (6)ను ఔట్‌ చేసిన వాకర్‌ మళ్లీ జట్టును దెబ్బతీశాడు. ఆ దశలో ఉమేశ్‌ (23), షమితో కలిసి భరత్‌ కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకున్నాడు. మంచి స్ట్రోక్‌ప్లేతో అలరించిన అతను వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు రాబట్టాడు. బౌలింగ్‌లో బుమ్రా (0/34) వికెట్‌ తీయలేకపోయాడు. ప్రసిద్ధ్‌ మాత్రం తన స్వింగ్‌, పేస్‌తో ఆకట్టుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 246/8 (కేఎస్‌ భరత్‌ 70 బ్యాటింగ్‌, కోహ్లి 33, రోమన్‌ వాకర్‌ 5/24, విల్‌ డేవిస్‌ 2/64)

జట్టుతో చేరిన అశ్విన్‌: కరోనా బారిన పడి ఆలస్యంగా ఇంగ్లాండ్‌ చేరుకున్న సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఎట్టకేలకు భారత జట్టుతో చేరాడు. జట్టుతో కలిసి అశ్విన్‌ ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అయితే అతను ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్‌ సాధించలేదని తెలిసింది. అందుకే వార్మప్‌ మ్యాచ్‌లో ఆడలేదు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని