Updated : 24 Jun 2022 07:08 IST

Summer McIntosh: 15 ఏళ్లకే ప్రపంచ టైటిల్‌

మెకంతాష్‌ రికార్డు
లెడెకీకి 21వ పతకం

బుడాపెస్ట్‌: ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కెనడా టీనేజర్‌ సమ్మర్‌ మెకంతాష్‌ అదరగొట్టింది. మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పసిడి సాధించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి.. 2011 తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నెగ్గిన 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో తనకిదే తొలి స్వర్ణం. 2 నిమిషాల 05.20 సెకన్లలో రేసు పూర్తి చేసిన ఆమె ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ముగ్గురు స్విమ్మర్లను దాటి అగ్రస్థానంలో నిలిచింది. ఫ్లికింగర్‌ (అమెరికా), జాంగ్‌ యూఫీ (చైనా) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మరోవైపు 17 ఏళ్ల డేవిడ్‌ పొపోవిచ్‌ (రొమేనియా) రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే పురుషుల 200మీ. ఫ్రీస్టైల్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అతను.. తాజాగా 100మీ. ఫ్రీస్టైల్‌లోనూ విజేతగా అవతరించాడు. 47.58సె అతను లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన తొలి రొమేనియా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అమెరికా బంగారు చేప కేటీ లెడెకీ పతక వేట కొనసాగుతోంది. మహిళల 4×200మీ. ఫ్రీస్టైల్‌ రిలేలో తమ దేశం పసిడి గెలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. దీంతో సరికొత్త ఛాంపియన్‌షిప్‌ రికార్డు (7:41.15సె)ను అమెరికా దక్కించుకుంది. ఈ స్వర్ణంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో తన పతకాల సంఖ్యను ఆమె 21కి పెంచుకుంది. అందులో 18 బంగారు పతకాలున్నాయి. ఈ పోటీల చరిత్రలో అత్యధిక పతకాలు సాధించిన స్విమ్మర్‌గా తన రికార్డును ఆమె మరింత మెరుగుపర్చుకుంది. రెండో స్థానంలో నటాలీ (19) ఉంది. స్వర్ణాల పరంగా ఆల్‌టైమ్‌ రికార్డు చూసుకుంటే మైకెల్‌ ఫెల్ప్స్‌ (26) తర్వాత ఆమె ర్యాన్‌ లోచె (18)తో సమానంగా రెండో స్థానంలో ఉంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డ్రసెల్‌ మానసిక అనారోగ్యం కారణంగా పోటీల నుంచి తప్పుకున్నాడు.


స్విమ్మర్‌ను కాపాడిన కోచ్‌

ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి అమెరికా స్విమ్మర్‌ అనిట అల్వరజ్‌ను కోచ్‌ ఆండ్రియా కాపాడింది. ఆర్టిస్టిక్‌ సోలో ఫ్రీలో పోటీపడుతున్న అల్వరజ్‌ ఉన్నట్లుండి ఎలాంటి స్పందన లేకుండా నీటిలో మునిగిపోయింది. అది గమనించిన కోచ్‌ ఆండ్రియా వెంటనే కొలనులోకి దూకి.. మరొకరి సాయంతో ఆమెను పైకి తీసుకొచ్చింది. ప్రదర్శన చేస్తూనే స్పృహ తప్పి ముగినిపోయిన అల్వరజ్‌కు వెంటనే వైద్య సాయం అందించడంతో ప్రాణపాయం తప్పింది. రెండు సార్లు ఒలింపియన్‌ అయిన ఆమె ప్రస్తుతం బాగానే ఉంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని