మెరిసిన జెమీమా

జెమీమా రోడ్రిగ్స్‌ (36 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడంతో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. గురువారం తొలి టీ20లో 34 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన

Published : 24 Jun 2022 01:51 IST

లంకపై భారత్‌ గెలుపు

దంబుల్లా: జెమీమా రోడ్రిగ్స్‌ (36 నాటౌట్‌; 27 బంతుల్లో 3×4, 1×6) సత్తా చాటడంతో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. గురువారం తొలి టీ20లో 34 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (1)తో పాటు సబ్బినేని మేఘన (0) ఔటయ్యారు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఓపెనర్‌ షెఫాలి వర్మ (31; 31 బంతుల్లో 4×4)తో కలిసి కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (22; 20 బంతుల్లో 3×4) ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీళ్లిద్దరితో పాటు రిచా ఘోష్‌ (11) స్వల్ప వ్యవధిలో వెనుదిరగడంతో భారత్‌ 81/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో పూజ (14), దీప్తిశర్మ (17 నాటౌట్‌)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పిన జెమీమా.. భారత్‌కు పోరాడే స్కోరు సాధించిపెట్టింది. లంక బౌలర్లలో ఇనోక రణవీర (3/30), ఒషాది రణసింఘే (2/22) భారత్‌ను కట్టడి చేశారు. ఛేదనలో లంకను రాధ యాదవ్‌ (2/22), దీప్తిశర్మ (1/9), పూజ (1/13), షెఫాలి (1/10) దెబ్బ తీశారు. 86 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఛేధనలో వెనుకబడిపోయింది. లంక 20 ఓవర్లలో 5 వికెట్లకు 104 పరుగులే చేయగలిగింది. కవిషా (47 నాటౌట్‌; 49 బంతుల్లో 6×4) ఒంటరి పోరాటం చేసింది. శనివారం రెండో టీ20 జరగనుంది.


రోహిత్‌, పంత్‌.. స్ఫూర్తితో

దంబుల్లా: జట్టులో స్థానం కోల్పోయినప్పుడు రోహిత్‌శర్మ, రిషబ్‌ పంత్‌ మాట్లాడడం స్ఫూర్తినిచ్చిందని మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌ చెప్పింది. ‘‘గత శ్రీలంక పర్యటన నుంచి నా పయనం సాఫీగా సాగట్లేదు. ప్రపంచకప్‌కు ముందు జట్టులో స్థానం కూడా కోల్పోయా. ఈ స్థితిలో భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ, రిషబ్‌ పంత్‌ మాట్లాడడం నాలో స్ఫూర్తిని నింపింది. ‘ఇలాంటి పరిస్థితులే కెరీర్‌ను నిర్వచిస్తాయి. జట్టులో స్థానం కోల్పోవడాన్ని ప్రతికూలతగా భావించొద్దు. దీన్ని సవాల్‌గా స్వీకరించి ముందుకెళ్లు’ అని వాళ్లు సలహా ఇచ్చారు. ఈ సలహా నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది. సానుకూల దృక్పథంతో నా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించా. గత నాలుగైదు నెలలుగా నా ఆటను మరింత బాగా అర్థం చేసుకున్నా’’ అని జెమీమా తెలిపింది. శ్రీలంకతో తొలి టీ20లో ఆరంభంలో కాస్త తడబాటుకు గురయ్యానని ఆ తర్వాత కుదురుకుని ఆడానని ఆమె చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని