భారత్‌ @ 104

ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 104 ర్యాంకులో నిలిచింది. తాజా జాబితాలో భారత్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. కోస్టారికా చేతిలో ఓడి ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన న్యూజిలాండ్‌ (103) భారత్‌ కన్నా ముందుంది.

Published : 24 Jun 2022 01:51 IST

దిల్లీ: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 104 ర్యాంకులో నిలిచింది. తాజా జాబితాలో భారత్‌ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. కోస్టారికా చేతిలో ఓడి ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన న్యూజిలాండ్‌ (103) భారత్‌ కన్నా ముందుంది. అయితే ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 19వ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇరాన్‌ నంబర్‌వన్‌ ర్యాంకులో ఉంది. సునీల్‌ ఛెత్రి సారథ్యంలో భారత్‌ ఇటీవల ఆసియాకప్‌ క్వాలిఫికేషన్‌ టోర్నీలో ఆడిన మూడు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ గెలిచి గ్రూప్‌-డిలో అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు 24 జట్లు తలపడే ఆసియాకప్‌కు అర్హత సాధించింది. ఓవరాల్‌ ఫిఫా ర్యాంకింగ్స్‌లో బ్రెజిల్‌ అగ్రస్థానంలో ఉండగా.. బెల్జియం, అర్జెంటీనా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ టాప్‌-5లో చోటు దక్కించుకున్నాయి.


గడువు విధించిన ఫిఫా

దిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌)కు ఫిఫా గడువు విధించింది. వచ్చే నెల 31లోపు కొత్త నియమావళిని ఆమోదించాలని, సెప్టెంబర్‌ 15 లోపు ఏఐఎఫ్‌ఎఫ్‌కు ఎన్నికలు నిర్వహించాలని ఫిఫా స్పష్టం చేసింది. నిర్దేశించిన తేదీల్లోపు ఈ చర్యలు తీసుకోకపోతే భారత్‌ను నిషేధించే ప్రమాదం ఉందని ఫిఫా హెచ్చరించింది. ఒకవేళ అలా జరిగితే అక్టోబర్‌లో స్వదేశంలో జరగాల్సిన అండర్‌-17 అమ్మాయిల ప్రపంచకప్‌ ఇతర దేశానికి తరలి వెళ్తుంది. ఏఐఎఫ్‌ఎఫ్‌కు కొత్త నియమావళి, ఎన్నికల నిర్వహణ కోసం గత నెలలో సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యులతో పరిపాలన కమిటీ నియమించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ నియామవళి రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. మరోవైపు మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన ఫిఫా, ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ప్రతినిధుల బృందం ఆ ఎన్నికలు, నియమావళిలో మార్పుల గురించి చర్చించింది. ఫిఫా- ఏఎఫ్‌సీ ఉన్నత స్థాయి సమావేశానికి తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఛైర్మన్‌ కేటీ మహీ సారథ్యంలో హైదరాబాద్‌ ఎఫ్‌సీ, శ్రీనిధి డెక్కన్‌ ఎఫ్‌సీ ప్రతినిధులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని