IND vs LEIC Practice Match : భళా అనిపించిన భారత బౌలర్లు.. మెరిసిన పంత్‌

ఇంగ్లాండ్‌ గడ్డపై బ్యాట్స్‌మెన్‌ తడబడ్ఢా. బౌలర్లు అంచనాలకు తగ్గట్లే రాణించారు. లెస్టర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇటు పేస్‌తో, అటు స్పిన్‌తో ఆకట్టుకున్న భారత్‌.. ప్రత్యర్థికి ఆధిక్యం సాధించే అవకాశం ఇవ్వలేదు. రెండో రోజు, శుక్రవారం ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి (3/42)తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ (2/71), మహ్మద్‌ సిరాజ్‌ (2/46)..

Updated : 25 Jun 2022 06:37 IST

లెస్టర్‌ 244 ఆలౌట్‌

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 80/1

లెస్టర్‌: ఇంగ్లాండ్‌ గడ్డపై బ్యాట్స్‌మెన్‌ తడబడ్ఢా. బౌలర్లు అంచనాలకు తగ్గట్లే రాణించారు. లెస్టర్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇటు పేస్‌తో, అటు స్పిన్‌తో ఆకట్టుకున్న భారత్‌.. ప్రత్యర్థికి ఆధిక్యం సాధించే అవకాశం ఇవ్వలేదు. రెండో రోజు, శుక్రవారం ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి (3/42)తో పాటు శార్దూల్‌ ఠాకూర్‌ (2/71), మహ్మద్‌ సిరాజ్‌ (2/46).. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (3/28) సత్తా చాటడంతో లెస్టర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌటైంది. ప్రాక్టీస్‌ కోసమని ఈ మ్యాచ్‌లో లెస్టర్‌కు ఆడిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ (76; 87 బంతుల్లో 14X4, 1X6) తనదైన శైలిలో చెలరేగి ప్రత్యర్థి జట్టులో టాప్‌స్కోర్‌గా నిలవడం విశేషం. ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించిన చెతేశ్వర్‌ పుజారా (0) మాత్రం నిరాశ పరిచాడు. నాలుగు రోజుల ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తొలి రోజును 246/8 వద్ద ముగించిన భారత జట్టు.. రెండో రోజు అదే స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత షమి.. ఆరంభంలోనే లెస్టర్‌ కెప్టెన్‌ సామ్‌ ఎవాన్స్‌ (1)ను ఔట్‌ చేసి భారత్‌కు శుభారంభాన్నిచ్చాడు. పుజారాను సైతం అతను నిలవనివ్వలేదు. మూడో స్థానంలో ఆడిన పుజారా బౌల్డయి వెనుదిరిగాడు. ధాటిగా ఆడిన కింబర్‌ (31), ఎవిసన్‌ (22)లను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చడంతో లెస్టర్‌ 71/4తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో రిషి పటేల్‌ (34)తో కలిసి పంత్‌ జట్టును ఆదుకున్నాడు. ఆపై అతను వాకర్‌ (34)తోనూ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 207 పరుగుల వద్ద పంత్‌.. జడేజా బౌలింగ్‌లో ఏడో వికెట్‌ రూపంలో వెనుదిరిగాక ఇన్నింగ్స్‌ ఎక్కువసేపు కొనసాగలేదు. జడేజా, శార్దూల్‌ లోయరార్డర్‌ పనిపట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. ఆట ఆఖరుకు 80/1తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రీకర్‌ భరత్‌ మరోసారి (31 నాటౌట్‌) నిలకడగా ఆడుతున్నాడు. ఉన్నంతసేపు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేసిన శుభ్‌మన్‌ (38) చివర్లో ఔటై వెనుదిరిగాడు. ప్రత్యర్థి జట్టుకు ఆడుతున్న నవదీప్‌ సైని అతణ్ని ఔట్‌ చేశాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ సైతం లెస్టర్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భరత్‌కు తోడుగా విహారి (9) క్రీజులో ఉన్నాడు. భారత్‌ ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని