Ranji Trophy Final: మధ్యప్రదేశ్‌ కల తీరినట్లే.. ముంబయిపై భారీ ఆధిక్యం

రంజీ ట్రోఫీ కోసం మధ్యప్రదేశ్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లే. ఆ జట్టు ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో 2022 సీజన్‌ విజేతగా నిలవడం లాంఛనమే. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 162 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన నేపథ్యంలో.. అద్భుతాలు జరిగితే తప్ప డ్రాగా ముగిసే అవకాశాలున్న మ్యాచ్‌లో విజేతగా నిలవబోయేది ఆ జట్టే.

Updated : 26 Jun 2022 07:28 IST

రంజీ ట్రోఫీ గెలుపు లాంఛనమే

రజత్‌ సెంచరీ.. డ్రా దిశగా ఫైనల్‌

బెంగళూరు

రంజీ ట్రోఫీ కోసం మధ్యప్రదేశ్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్లే. ఆ జట్టు ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో 2022 సీజన్‌ విజేతగా నిలవడం లాంఛనమే. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ 162 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన నేపథ్యంలో.. అద్భుతాలు జరిగితే తప్ప డ్రాగా ముగిసే అవకాశాలున్న మ్యాచ్‌లో విజేతగా నిలవబోయేది ఆ జట్టే. ముంబయి 374 పరుగులకు బదులుగా.. మధ్యప్రదేశ్‌ 536 పరుగులు చేసి భారీ ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. మూడో రోజే ఎంపీ 368/3తో నిలవడంతో ఆధిక్యం లాంఛనమే అనిపించింది. నాలుగో రోజు, శనివారం ఎంపీ.. ఆధిక్యంలోకి వెళ్లడమే కాక ముంబయి గెలుపు గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వకుండా మరింత ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. 67 పరుగులతో ఇన్నింగ్స్‌ కొనసాగించి భారత టీ20 లీగ్‌ హీరో రజత్‌ పటిదార్‌ (122; 219 బంతుల్లో 20X4) సెంచరీ పూర్తి చేశాడు. లోయర్‌ ఆర్డర్లో సరన్ష్‌ జైన్‌ (57; 97 బంతుల్లో 7X4) కూడా రాణించడంతో భారీ ఆధిక్యం ఎంపీ సొంతమైంది. ప్రత్యర్థి బౌలర్లలో శామ్స్‌ ములాని 5/173, తుషార్‌ దేశ్‌పాండే (3/116), మోహిత్‌ అవస్తి (2/93) రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ముంబయి 22 ఓవర్లలో 2 వికెట్లకు 113 పరుగులు చేసింది. కెప్టెన్‌ పృథ్వీ షా (44), హార్దిక్‌ తమోర్‌ (25) ఔటయ్యారు. అర్మాన్‌ జాఫర్‌ (30), సువేద్‌ పార్కర్‌ (9) క్రీజులో ఉన్నారు. ఇంకా ముంబయి 49 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌లో ఇంకొక్క రోజు ఆటే మిగిలి ఉన్న నేపథ్యంలో ముంబయి.. ఆధిక్యంలోకి వెళ్లి మధ్యప్రదేశ్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ జట్టును ఆలౌట్‌ చేయడం అసాధ్యం. కాబట్టి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా ఎంపీ తొలిసారి రంజీ విజేతగా నిలవడం లాంఛనమే.

సంక్షిప్త స్కోర్లు.. ముంబయి తొలి ఇన్నింగ్స్‌: 374

మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 536 (యశ్‌ దూబె 133, శుభమ్‌ శర్మ 116, రజత్‌ పటిదార్‌ 122, సరన్ష్‌ జైన్‌ 57; శామ్స్‌ ములాని 5/173, తుషార్‌ దేశ్‌పాండే 3/116, మోహిత్‌ అవస్తి 2/93)

ముంబయి రెండో ఇన్నింగ్స్‌: 113/2 (పృథ్వీ షా 44, హార్దిక్‌ తమోర్‌ 25, అర్మాన్‌ జాఫర్‌ 30 బ్యాటింగ్‌, సువేద్‌ పార్కర్‌ 9; కుమార్‌ కార్తికేయ 1/50, గౌరవ్‌ యాదవ్‌ 1/23)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని