Updated : 26 Jun 2022 07:13 IST

IND vs IRELAND : ఇదే మంచి తరుణం

కుర్రాళ్ల మీదే అందరి దృష్టి

ఐర్లాండ్‌తో తొలి టీ20 నేడే

రాత్రి 9 నుంచి

డబ్లిన్‌

టీ20 ప్రపంచకప్‌ సన్నాహాల్లో భాగంగా టీమ్‌ఇండియా మరో పొట్టి ఫార్మాట్‌ సిరీస్‌కు సిద్ధమైంది. సీనియర్లంతా ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌కు సిద్ధమవుతుంటే, హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని యువ భారత్‌.. రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌ను ఢీకొనబోతోంది. ప్రపంచకప్‌లో అవకాశం కోసం చూస్తున్న కుర్రాళ్లు సత్తా చాటేందుకు ఈ సిరీస్‌ మంచి అవకాశమే.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా తొలి సీజన్లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలబెట్టిన హార్దిక్‌ పాండ్య.. తొలిసారిగా టీమ్‌ఇండియా పగ్గాలు చేపట్టబోతున్నాడు. అతడి సారథ్యంలో కుర్రాళ్లతో నిండిన భారత జట్టు.. ఐర్లాండ్‌తో ఆదివారం తొలి టీ20 ఆడబోతోంది. జట్టులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న కొందరు కుర్రాళ్లతో పాటు తొలి అవకాశం దక్కించుకున్న మరికొందరు యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌ను ఎలా ఉపయోగించుకుంటారన్నది ఆసక్తికరం.

తొలి ఛాన్స్‌ దక్కుతుందా?: ఈ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం కోసం ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లు ఎదురు చూస్తున్నారు. బ్యాటింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి తొలిసారి భారత జట్టుకు ఎంపికైంది ఈ సిరీస్‌ కోసమే. బౌలింగ్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ దక్షిణాఫ్రికా సిరీస్‌కే ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో చోటు దక్కలేదు. రుతురాజ్‌ ఇప్పటిదాకా ఇచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోకపోయినా.. ఐపీఎల్‌లో అతడి జోరును దృష్టిలో ఉంచుకుని మరో ఛాన్స్‌ ఇవ్వొచ్ఛు అతనే ఇషాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. సూర్యకుమార్‌ మూడో స్థానంలో ఆడొచ్ఛు నాలుగో స్థానంలో ఎవరాడతారన్నదే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సంజు శాంసన్‌ పోటీలో ముందున్నప్పటికీ.. త్రిపాఠి, దీపక్‌ హుడా అవకాశాలను కొట్టిపారేయలేం. హార్దిక్‌, కార్తీక్‌ మిడిలార్డర్‌ భారాన్ని మోయనున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌, చాహల్‌ కీలకం. ఉమ్రాన్‌, అర్ష్‌దీప్‌లను ఆడించాలంటే హర్షల్‌, అవేష్‌ తమ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. పిచ్‌ను బట్టి రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌ లేదంటే పేస్‌ ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ను ఎంచుకునే అవకాశముంది.

పసికూనేం కాదు..: ఐర్లాండ్‌ జట్టంటే పసికూన అనుకుంటారు కానీ.. ఆ జట్టులో టీ20 స్పెషలిస్టులు చాలామందే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడే స్టిర్లింగ్‌ ఆ జట్టుకు పెద్ద బలం. ధాటిగా బ్యాటింగ్‌ చేసే స్టిర్లింగ్‌ ఉపయుక్తమైన ఆఫ్‌స్పిన్నర్‌ కూడా. కెప్టెన్‌ బాల్‌బిర్నీ, డెలానీ, టెక్టార్‌ లాంటి ప్రతిభావంతులున్నారు బ్యాటింగ్‌ ఆర్డర్లో. కాంఫర్‌, అడైర్‌ బంతితోనే కాక బ్యాటుతోనూ సత్తా చాటగలరు. లిటిల్‌, యంగ్‌, మెక్‌బ్రైన్‌, మెకార్తీ.. ప్రపంచ స్థాయి పేసర్లే.

తుది జట్లు (అంచనా).. భారత్‌: ఇషాన్‌, రుతురాజ్‌, సూర్యకుమార్‌, శాంసన్‌, హార్దిక్‌ (కెప్టెన్‌), కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌/వెంకటేశ్‌ అయ్యర్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌/అర్ష్‌దీప్‌, అవేష్‌ ఖాన్‌/ఉమ్రాన్‌ మాలిక్‌, చాహల్‌.

ఐర్లాండ్‌: బాల్‌బిర్నీ (కెప్టెన్‌), స్టిర్లింగ్‌, డెలానీ, టెక్టార్‌/డాక్రెల్‌, టకర్‌, కాంఫర్‌, అడైర్‌, లిటిల్‌, మెక్‌బ్రైన్‌, మెకార్తీ, యంగ్‌.

3 : ఐర్లాండ్‌తో భారత్‌ ఆడిన టీ20లు. మూడింట్లోనూ విజయం సాధించింది. ప్రస్తుత సిరీస్‌కు వేదికైన డబ్లిన్‌లోనే చివరగా 2018లో జరిగిన టీ20లో భారత్‌ 143 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని