Updated : 26 Jun 2022 07:21 IST

Jyothi Surekha: కష్టానికి ఫలితమిది

‘ఈనాడు’తో జ్యోతి సురేఖ

ఈనాడు - హైదరాబాద్‌

భారత్‌ తరపున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఏడు నెలలు గడిచిపోయాయి.. మధ్యలో సెలక్షన్‌ ట్రయల్స్‌లో వివిధ కారణాల వల్ల సరైన ప్రదర్శన చేయలేకపోయింది.. ఆటకు కాస్త విరామం వచ్చింది.. కానీ ఆమె మాత్రం ఆగిపోలేదు. వింటినారిని ఎంత వెనక్కి లాగితే అంత వేగంగా బాణం దూసుకెళ్లినట్లు.. జ్యోతి సురేఖ చాలా వేగంగా ముందుకు సాగుతోంది. తాజాగా ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో సత్తాచాటిన ఈ 25 ఏళ్ల తెలుగమ్మాయి.. టోర్నీలో పోటీ, పతకాలు గెలిచిన ఆనందం.. ఇలా ఎన్నో విషయాలను పారిస్‌ నుంచి ‘ఈనాడు’తో పంచుకుంది. ఆ విశేషాలు తన మాటల్లోనే..!

ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో ఫలితం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. కేవలం ప్రదర్శన మీదే దృష్టి పెట్టా. అత్యుత్తమంగా రాణించాలనుకున్నా. ఇప్పుడు ఓ స్వర్ణం, రజతం దక్కాయంటే అదనపు ఆనందమే అనుకోవాలి. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో అభిషేక్‌ వర్మతో కలిసి దేశానికి తొలి ప్రపంచకప్‌ పసిడి అందించడం చాలా సంతోషంగా ఉంది. 2012 నుంచి అతనితో కలిసి ఆడుతున్నా. ఆ అన్నయ్య భారత జట్టులో ఉండడం కూడా నాకు కలిసొచ్చింది. నేనెక్కువగా ఆడింది అతనితోనే. ఇప్పటికే మేం కలిసి చాలా పతకాలు సాధించాం. మా మధ్య మంచి అవగాహన ఏర్పడింది. అందుకే జంటగా ఎంతటి తీవ్ర ఒత్తిడిలోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం. ఇప్పుడదే పట్టుదలతో బంగారు పతకం అందుకున్నాం.

కొద్దిలో చేజారింది..: వ్యక్తిగతంగా మాత్రం ఛాంపియన్‌గా నిలవలేకపోయినందుకు కొంచెం నిరాశ పడ్ఢా వ్యక్తిగత విభాగంలో ప్రపంచకప్‌లో ఇదే నాకు తొలి పతకం. దీని కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా. చాలా ఏళ్లుగా కష్టపడ్ఢా ఇప్పటికి అనుకున్నది సాధించా. ఈ రజతం సంతృప్తిని ఇచ్చిందనే చెప్పాలి. ఫైనల్లో విజయం కోసం పూర్తిస్థాయిలో ప్రయత్నించా. షూటాఫ్‌లోనూ ఒత్తిడి లేకుండా బాణాన్ని సంధించా. కానీ తృటిలో పసిడి చేజారింది. నాపై జనాల్లో అంచనాలుండడం సహజమే. కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోను. నా దృష్టి మొత్తం మెరుగైన ప్రదర్శన చేయాలనే దానీ మీదే ఉంది. సెమీస్‌లో తలపడ్డ ప్రత్యర్థి (సోఫీ) ఒలింపియన్‌ అని తెలుసు కానీ పతకం (బీజింగ్‌ ఒలింపిక్స్‌ రికర్వ్‌లో కాంస్యం) గెలిచిందని తెలీదు. ఆమెను కూడా సాధారణ ప్రత్యర్థి లాగే భావించి పోటీపడి విజయం సాధించా.

విరామం వచ్చినా..: చివరగా భారత జట్టు తరపున ఆడి ఏడు నెలలు అవుతుందని అంటున్నారు. గతేడాది నవంబర్‌లో ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో చివరగా దేశం తరపున ప్రాతినిథ్యం వహించా. అయితే ఆటకు మాత్రం దూరం కాలేదు. జనవరిలో అమెరికాలో ఇండోర్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడి టైటిల్‌ గెలిచా. కానీ ఆ తర్వాత ప్రపంచకప్‌ తొలి, రెండో అంచె పోటీలు, ఆసియా క్రీడల (ఇప్పుడు వాయిదా పడ్డాయి) కోసం మార్చిలో నిర్వహించిన ట్రయల్స్‌లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. అంతకంటే ముందే ఓ టోర్నీ కోసం జమ్ముకశ్మీర్‌ వెళ్లి.. అక్కడి నుంచి వచ్చిన తర్వాతి రోజే ట్రయల్స్‌లో పోటీపడాల్సి వచ్చింది. చివర్లో వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించలేదు. అందుకే ఆ ప్రపంచకప్‌ పోటీలకు జట్టుతో పాటు వెళ్లేందుకు ఎంపిక కాలేదు. దీంతో నిరాశ చెందా. 15 రోజుల వరకు విల్లును ముట్టుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నన్ను నడిపిస్తున్న ఆట మీద ప్రేమ మళ్లీ నాలో పట్టుదల నింపింది. తిరిగి బలంగా పుంజుకోవాలని నిర్ణయించుకున్నా. మళ్లీ సోనిపట్‌లోని సాయ్‌ కేంద్రంలో సాధన ముమ్మరం చేశా. గత నెలలో ట్రయల్స్‌లో సత్తాచాటి ఈ ప్రపంచకప్‌ పోటీలకు ఎంపికయ్యా. ప్రపంచ క్రీడలకూ అర్హత సాధించా. వాయిదా పడ్డ ఆసియా క్రీడలకు తిరిగి నిర్వహించే ట్రయల్స్‌లో రాణిస్తాననే నమ్మకం ఉంది. 2028 ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ విభాగాన్ని కూడా ప్రవేశపెట్టాలనే ప్రపంచ ఆర్చరీ ప్రతిపాదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పచ్చజెండా ఊపాలని కోరుకుంటున్నా.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని