Updated : 28 Jun 2022 06:44 IST

IND vs IRL: సిరీస్‌ పట్టేయాలని.. జోరు మీద టీమ్‌ఇండియా

నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20

రాత్రి 9 నుంచి

డబ్లిన్‌

అటు ప్రధాన జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు కోసం సిద్ధమవుతుండగా.. ఇటు ఐర్లాండ్‌లో అదరగొడుతున్న యువ భారత్‌ పొట్టి సిరీస్‌పై కన్నేసింది. రెండు టీ20ల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి మ్యాచ్‌ గెలిచి జోరు మీదున్న టీమ్‌ఇండియా.. నేడు జరిగే చివరి పోరులోనూ చెలరేగి సిరీస్‌ పట్టేయాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం చలాయించిన హార్దిక్‌ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిరీస్‌తో అరంగేట్రం చేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ లాంటి ఆటగాళ్లకు తమ సత్తాచాటేందుకు ఇదో మంచి ఛాన్స్‌. ఈ మ్యాచ్‌కూ వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

అదే వేదిక.. అదే ప్రత్యర్థి.. మూడు రోజుల వ్యవధిలోనే రెండో మ్యాచ్‌లోనూ ఐర్లాండ్‌ను ఓడించేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఆదివారం తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంగళవారం జరిగే చివరిదైన రెండో మ్యాచ్‌లోనూ ప్రత్యర్థిని చిత్తుచేయాలనే పట్టుదలతో భారత్‌ ఉంది. జట్టు జోరు చూస్తుంటే టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్‌.. కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ తొలి సిరీస్‌ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమనిపిస్తోంది. మరోవైపు భారత్‌ లాంటి బలమైన జట్టును తమ సొంతగడ్డపై సిరీస్‌ నెగ్గకుండా ఐర్లాండ్‌ కట్టడి చేయగలదా? సిరీస్‌ ఓటమి తప్పించుకోగలదా? అన్నది ఆసక్తికరం.

రుతురాజ్‌ ఆడతాడా?

తొలి టీ20లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రాణించిన భారత్‌కు పెద్దగా ఎలాంటి ఇబ్బందుల్లేవు. ఓపెనర్‌ రుతురాజ్‌ ఈ మ్యాచ్‌లోనైనా ఆడతాడా? అన్నది ఒక్కటే ప్రశ్నార్థకంగా మారింది. గత మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్‌ చేస్తూ పిక్క కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో ఇషాన్‌ కిషన్‌తో కలిసి తొలిసారి టీ20ల్లో ఇన్నింగ్స్‌ ఆరంభించిన దీపక్‌ హుడా తనకు లభించిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్నాడు. 47 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. గాయం నేపథ్యంలో రుతురాజ్‌ ఈ మ్యాచ్‌ ఆడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఫిట్‌నెస్‌ సాధించకపోతే తుది జట్టులో ఒక మార్పు జరగొచ్ఛు అతని స్థానంలో రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం చేస్తాడా? లేదా శాంసన్‌ను ఆడిస్తారా? అన్నది చూడాలి. ఇక ఇషాన్‌తో పాటు హార్దిక్‌ కూడా ఫామ్‌ కొనసాగిస్తుండడంతో బ్యాటింగ్‌లో ఇబ్బంది లేకుండా పోయింది. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ మునుపటి నిలకడ అందుకోవాలని చూస్తున్నాడు.

అతనిపైనే కళ్లు..

ఐపీఎల్‌లో అద్భుతమైన వేగంతో ఆకట్టుకున్న యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు అడుగుపెడతాడా? అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఐర్లాండ్‌తో తొలి టీ20తో అతను అరంగేట్రం చేయడంతో ప్రపంచ క్రికెట్లో తాను ఎలా రాణించగలడో చూద్దామనుకున్నారు. కానీ 12 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో బంతి అందుకున్న అతని బౌలింగ్‌లో 18 పరుగులు వచ్చాయి. దీంతో తను మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. ఈ నేపథ్యంలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ మ్యాచ్‌ అతనికి మంచి అవకాశం. మరోసారి అందరి కళ్లు అతనిపైనే ఉంటాయనడంలో సందేహం లేదు. పాత బంతితో ఉత్తమంగా బౌలింగ్‌ చేస్తాడనే పేరున్న అతను.. రెండో మ్యాచ్‌లో ఆలస్యంగా బౌలింగ్‌కు వచ్చి ఆకట్టుకుంటాడేమో చూడాలి. ఇక దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన భువనేశ్వర్‌ జోరు కొనసాగిస్తూ ఆరంభ ఓవర్లలో తన స్వింగ్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడి పరిస్థితులు కూడా రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేసేలా అతనికి ఉపయోగపడుతున్నాయి. చాహల్‌ తన స్పిన్‌తో బ్యాటర్లకు ఉచ్చు బిగిస్తున్నాడు. చివరి ఓవర్లలో ఉత్తమంగా బౌలింగ్‌ చేసేలా అవేశ్‌ ఖాన్‌ మెరుగవాల్సి ఉంది.

పోరాటం పెంచాలని..

పేరుకు పసికూనే అయినా భారత్‌తో తొలి టీ20లో ఓటమి తప్పించుకోవడం కోసం ఐర్లాండ్‌ బాగానే కష్టపడింది. ముఖ్యంగా మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు 12 ఓవర్లలో 108 పరుగులు చేయడం విశేషమే అని చెప్పాలి. భువీ, చాహల్‌ గొప్పగా కట్టడి చేసిన ఆ జట్టు అంత స్కోరు చేసిందంటే అందుకు కారణం 22 ఏళ్ల హ్యారీ టెక్టార్‌. అజేయ అర్ధశతకంతో మెరిసిన అతను ఫామ్‌ కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. బ్యాటింగ్‌లో అతనికి తోడు స్టిర్లింగ్‌, కెప్టెన్‌ బాల్‌బిర్నీ, టకర్‌ కూడా రాణిస్తే ఆ జట్టు విజయం కోసం పోరాడే అవకాశం ఉంటుంది. బౌలింగ్‌లో ఆకట్టుకున్న యంగ్‌తో పాటు మిగతా బౌలర్లు కూడా సత్తాచాటాలని చూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో విజయంతో ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే భారత్‌కు ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంది.

వాన మళ్లీ..

తొలి మ్యాచ్‌లో పలకరించి పోరు పూర్తిస్థాయిలో జరగకుండా అడ్డుపడిన వరుణుడు.. రెండో టీ20 పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదట వర్షం అంతరాయం కలిగించడంతో గత మ్యాచ్‌ను ఇన్నింగ్స్‌కు 12 ఓవర్ల చొప్పున కుదించి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో మ్యాచ్‌కూ వర్షం ముంపు పొంచి ఉందని తెలుస్తోంది. అక్కడ వాతావరణం ఏ మాత్రం మెరుగుపడలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌ కూడా 20 ఓవర్ల పాటు జరిగే ఆస్కారం లేదని అంటున్నారు. మరి వరుణుడు ఏం చేస్తాడో చూడాలి. మ్యాచ్‌ సాగితే పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశం ఉంది. బౌలర్లకూ కాస్త అనుకూలించొచ్ఛు

తుది జట్లు (అంచనా)

భారత్‌: రుతురాజ్‌/రాహుల్‌ త్రిపారి/శాంసన్‌ఫఫ, ఇషాన్‌, సూర్యకుమార్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌, భువనేశ్వర్‌, అవేశ్‌, చాహల్‌, ఉమ్రాన్‌.

ఐర్లాండ్‌: స్టిర్లింగ్‌, బాల్‌బిర్నీ, డెలానీ, హ్యారీ టెక్టార్‌, లోర్కాన్‌ టకర్‌, జార్జ్‌ డాక్రెల్‌, మార్క్‌ అడైర్‌, ఆండీ మెక్‌బ్రిన్‌, క్రెయిగ్‌ యంగ్‌, జోష్‌ లిటిల్‌, కానర్‌ ఓల్ఫర్ట్‌.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని