జకోవిచ్‌ శుభారంభం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. మూడో సీడ్‌ రూడ్‌, అయిదో సీడ్‌ అల్కరాజ్‌ కూడా బోణీ కొట్టగా.. ఏడో సీడ్‌ హర్కజ్‌ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ ఆన్స్‌ జాబెర్‌, పదో సీడ్‌ రదుకాను రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

Published : 28 Jun 2022 01:29 IST

రెండో రౌండ్లో రూడ్‌, అల్కరాజ్‌

లండన్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. మూడో సీడ్‌ రూడ్‌, అయిదో సీడ్‌ అల్కరాజ్‌ కూడా బోణీ కొట్టగా.. ఏడో సీడ్‌ హర్కజ్‌ కథ తొలి రౌండ్లోనే ముగిసింది. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ ఆన్స్‌ జాబెర్‌, పదో సీడ్‌ రదుకాను రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.

టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) వింబుల్డన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. టోర్నీ తొలి రోజు సోమవారం తొలి రౌండ్లో అతడు 6-3, 3-6, 6-3, 6-4తో క్వోన్‌ (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. అయితే క్వోన్‌ అంత తేలిగ్గా తలవంచలేదు. గట్టి పోటీనే ఇచ్చిన అతడు.. రెండో సెట్‌ను గెలుచుకున్నాడు కూడా. రెండో సెట్‌ను కోల్పోయాక జకోవిచ్‌ పుంజుకున్నాడు. వింబుల్డన్‌లో అతడికిది 80వ విజయం. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ 80 సింగిల్స్‌ విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా జకోవిచ్‌ ఘనత సాధించాడు. తొలి రౌండ్లో పదునైన సర్వీసులు చేసిన అతడు 15 ఏస్‌లు సంధించాడు. ఏడు ఏస్‌లు కొట్టిన క్వోన్‌ అయిదు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. మూడో సీడ్‌ రూడ్‌ (నార్వే), అయిదో సీడ్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) కూడా రెండో రౌండ్లో అడుగుపెట్టారు. మొదటి రౌండ్లో రూడ్‌ 7-6 (7-1), 7-6 (11-9), 6-2తో రామోస్‌ -వినోలాస్‌ (స్పెయిన్‌)పై నెగ్గగా.. హోరాహోరీ పోరులో అల్కరాజ్‌ 4-6, 7-5, 4-6, 7-6 (7-3), 6-4తో స్ట్రఫ్‌ (జర్మనీ)ని ఓడించాడు. మరో మ్యాచ్‌లో తొమ్మిదో సీడ్‌ నోరీ (బ్రిటన్‌) 6-0, 7-6 (7-3), 6-3తో అందుజర్‌ (స్పెయిన్‌)పై గెలిచాడు. ఏడో సీడ్‌ హర్కజ్‌ (పోలెండ్‌)కు షాక్‌ తగిలింది. డెవిడోవిచ్‌ (స్పెయిన్‌) మొదటి రౌండ్లో 7-6 (7-4), 6-4, 5-7, 2-6, 7-6 (10-8)తో హర్కజ్‌పై విజయం సాధించాడు. మనారినో (ఫ్రాన్స్‌), పాల్‌ (అమెరికా), హేలిస్‌ (ఫ్రాన్స్‌), హంబెర్ట్‌ (ఫ్రాన్స్‌), మునార్‌ (స్పెయిన్‌), తియోఫె (అమెరికా) రెండో రౌండ్లో ప్రవేశించారు.

మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా) అలవోకగా రెండో రౌండ్‌కు చేరుకుంది. మొదటి రౌండ్లో ఆమె 6-1, 6-3తో బోర్క్‌లాండ్‌ (స్వీడన్‌)ను చిత్తు చేసింది. రెండో సీడ్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా), పదో సీడ్‌ రదుకాను (బ్రిటన్‌) కూడా శుభారంభం చేశారు. తొలి రౌండ్లో కొంటావీట్‌ 7-5, 6-1తో పెరా (అమెరికా)పై విజయం సాధించింది. రదుకాను 6-4, 6-4తో ఉత్వాంక్‌ (బెల్జియం)పై నెగ్గింది. రిస్కే (అమెరికా), కావా (పోలెండ్‌), కలినినా (ఉక్రెయిన్‌), నీమియర్‌ (జర్మనీ), సురెంకో (ఉక్రెయిన్‌) రెండో రౌండ్లో అడుగుపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని