చివరి టీ20లో భారత్‌ పరాజయం

శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్న భారత మహిళల ఆశ తీరలేదు. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (80 నాటౌట్‌; 48 బంతుల్లో 144, 16) చెలరేగడంతో సోమవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. 1

Published : 28 Jun 2022 01:29 IST

లంకను గెలిపించిన చమరి

దంబుల్లా: శ్రీలంకతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలన్న భారత మహిళల ఆశ తీరలేదు. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (80 నాటౌట్‌; 48 బంతుల్లో 144, 16) చెలరేగడంతో సోమవారం జరిగిన చివరిదైన మూడో టీ20లో లంక 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది. 139 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మొదట భారత్‌ 5 వికెట్ల నష్టానికి 138 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (39; 33 బంతుల్లో 34, 16) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌.. త్వరగానే ఓపెనర్‌ షెఫాలి వర్మ (5) వికెట్‌ను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (22), సబ్బినేని మేఘన (22) నిలవడంతో భారత్‌ 7.3 ఓవర్లలో 48/1తో బాగానే కనిపించింది. కానీ వీళ్లిద్దరు వరుస ఓవర్లలో ఔట్‌ కావడం ఆ జట్టును దెబ్బతీసింది. హర్మన్‌ప్రీత్‌, జెమీమా నిలబడ్ఢా. ధాటిగా ఆడలేకపోయారు. స్కోరు వేగం బాగా తగ్గిపోయింది. అయితే 13వ ఓవర్‌ నుంచి బ్యాటర్లు కాస్త వేగం పెంచారు. హర్మన్‌తో నాలుగో వికెట్‌కు 64 పరుగులు జోడించిన జెమీమా.. 19వ ఓవర్లో నిష్క్రమించింది. ఆఖర్లో హర్మన్‌ప్రీత్‌, పూజ వస్త్రాకర్‌ (13) కాస్త బ్యాట్‌ ఝుళిపించారు. లక్ష్యఛేదనలో లంక స్కోరు బోర్డును ఓపెనర్‌ చమరి పరుగులు పెట్టించింది. మరో ఓపెనర్‌ విశ్మి (5) తొలి ఓవర్లోనే ఔటైనా.. చమరి ధాటిగా ఆడింది. హర్షిత (13)తో రెండో వికెట్‌కు 31, నీలాక్షి (30)తో మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించి శ్రీలంకను విజయపథంలో నడిపించింది. సొంతగడ్డపై శ్రీలంకకు భారత్‌పై ఇదే తొలి టీ20 విజయం. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు