Published : 28 Jun 2022 01:29 IST

ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌

మూడో టెస్టులోనూ కివీస్‌ చిత్తు

3-0తో సిరీస్‌ కైవసం

లీడ్స్‌: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. సోమవారం ముగిసిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ ఏడు వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తుచేసింది. అయిదో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ విజయానికి 113 పరుగులు కావాల్సి ఉండగా.. ఆతిథ్య జట్టుతో వర్షం దోబూచులాడింది. ఉదయం నుంచే వర్షం కురవడంతో మ్యాచ్‌ ఫలితంపై ఉత్కంఠత నెలకొంది. లంచ్‌ విరామం తర్వాత వరుణుడు తెరపినివ్వడంతో ఇంగ్లాండ్‌ ఊపిరి పీల్చుకుంది. జానీ బెయిర్‌స్టో (71 నాటౌట్‌; 44 బంతుల్లో 84, 36) బ్యాట్‌ ఝుళిపించడంతో మరో 15.2 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ పని పూర్తిచేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జో రూట్‌ (86 నాటౌట్‌; 125 బంతుల్లో 114, 16), బెయిర్‌స్టో నాలుగో వికెట్‌కు అజేయంగా 111 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్‌ 3 వికెట్లే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సోమవారం ఆట ఆరంభమయ్యాక తొలి ఓవర్లోనే ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ (82; 108 బంతుల్లో 124)ను సౌథీ (1/68) క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. అయితే అక్కడ్నుంచి బెయిర్‌స్టో తుఫాన్‌ మొదలైంది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 329 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 360కి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 326 పరుగులు చేసింది. జాక్‌ లీచ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts