సంక్షిప్త వార్తలు

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏకపక్షంగా ముగిసిన రెండో టెస్టులో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 132/6తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది.

Published : 29 Jun 2022 02:37 IST

విండీస్‌దే రెండో టెస్టు

గ్రాస్‌ ఐలట్‌ (సెయింట్‌ లూసియా): బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను వెస్టిండీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఏకపక్షంగా ముగిసిన రెండో టెస్టులో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 132/6తో నాలుగో రోజు ఉదయం ఆట కొనసాగించిన బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. కీమర్‌ రోచ్‌ (3/54), అల్జరీ జోసెఫ్‌ (3/57), జేడెన్‌ సీల్స్‌ (3/21) మూడేసి వికెట్లు పడగొట్టారు. 13 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 2.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 234.. వెస్టిండీస్‌ 408 పరుగులు చేశాయి. కైల్‌ మేయర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు లభించాయి. టెస్టు క్రికెట్లో బంగ్లాకు ఇది 100వ పరాజయం.


టీ20 ప్రపంచకప్‌ తర్వాత కివీస్‌కు

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ ఏడాది నవంబరు 18 నుంచి 30 వరకు మూడేసి టీ20, వన్డే మ్యాచ్‌ల్లో కివీస్‌తో టీమ్‌ఇండియా తలపడుతుంది. బదులుగా వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో కివీస్‌ పర్యటిస్తుంది. నవంబరు 18న వెల్లింగ్టన్‌, 20న టురంగా, 22న నేపియర్‌లో టీ20లు.. 25న ఆక్లాండ్‌, 27న హామిల్టన్‌, 30న క్రైస్ట్‌చర్చ్‌లో వన్డేలు జరుగుతాయి.


ఫిఫా ప్రపంచకప్‌లో మహిళా రిఫరీలు

టోక్యో: ఖతార్‌ వేదికగా నవంబర్‌ 21న ఆరంభం కానున్న ఫుట్‌బాల్‌ పండుగ ఫిఫా ప్రపంచకప్‌కు ముగ్గురు మహిళా రిఫరీలు ఎంపికయ్యారు. యోషిమి యమాషితా (జపాన్‌), స్టీఫానీ ఫ్రాపార్ట్‌ (ఫ్రాన్స్‌), సలీమా మకాన్‌సంగా (రువాండా) ఈ మెగా టోర్నీలో రిఫరీలుగా బాధ్యతలు చేపట్టే సువర్ణావకాశాన్ని సంపాదించారు. ఫిఫాలో మొత్తం 36 మంది మహిళా రిఫరీలు ఉండగా..వీరికే ఈ ఛాన్స్‌ దక్కింది. వీరితో పాటు నెజా బాక్‌ (బ్రెజిల్‌), కరెన్‌ దియాజ్‌ (మెక్సికో), కేథరిన్‌ నెస్‌బిట్‌ (అమెరికా) ఫిఫా ప్రపంచకప్‌లో సహాయ రిఫరీలుగా ఎంపికయ్యారు. ప్రపంచకప్‌కు మహిళా రిఫరీలను ఎంపిక చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ‘‘సాకర్‌లోని ఆకర్షణను బయటకు తీసుకురావడం రిఫరీ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం కోసం వందశాతం ప్రయత్నిస్తా. ఆటగాళ్లతో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా. కార్డ్‌ చూపించాలంటే చూపిస్తా’’ అని జపాన్‌ రిఫరీ యోషిమి చెప్పింది.


ప్రతీకారంపై ఆసీస్‌ దృష్టి

నేటి నుంచే లంకతో తొలి టెస్టు

గాలె: ఆరేళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో అనూహ్యంగా 0-3తో ఓడిపోయిన ఆస్ట్రేలియా ప్రతీకారానికి సిద్ధమైంది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం గాలెలో ప్రారంభమయ్యే తొలి టెస్టులో సత్తా చాటాలని కంగారూ జట్టు పట్టుదలతో ఉంది.  ఇటీవల ఉపఖండంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండడం కంగారూ జట్టుకు కలిసొచ్చే అంశం. పిచ్‌ స్పిన్నర్లకు సహకరించే నేపథ్యంలో లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు లసిత్‌ ఎంబుల్డేనియా, ప్రవీణ్‌ జయవిక్రమతో పాటు ఆఫ్‌ స్పిన్నర్‌ రమేశ్‌ మెండిస్‌ను లంక బరిలో దించనుంది. స్పిన్నర్లు రాణించడం వల్లే ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకున్న లంక.. టెస్టు సిరీస్‌నూ నెగ్గాలనే పట్టుదలతో ఉంది.


మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా నారంగ్‌

దిల్లీ: స్టార్‌ షూటర్‌, ఒలింపిక్స్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా ఎంపికయ్యాడు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో భాగమయ్యే క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడం ఈ సెల్‌ ప్రధాన విధి. 2024, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించడానికి, ఎంపిక చేయడానికి, వారి ప్రదర్శనలను ఎప్పటికప్పుడు గమనించడానికి ఈ సెల్‌ పని చేస్తుంది. ప్రస్తుతం టాప్స్‌ ప్రధాన బృందంలో 117 మంది.. డెవలప్‌మెంట్‌ గ్రూప్‌లో 244 మంది క్రీడాకారులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని