అవును.. మోర్గాన్‌ ముగించాడు

అనుకున్నదే అయింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్లు ముందు రోజే మీడియాకు సమాచారం ఇచ్చిన అతను..

Published : 29 Jun 2022 02:38 IST

లండన్‌: అనుకున్నదే అయింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం రిటైర్మెంట్‌ ప్రకటించబోతున్నట్లు ముందు రోజే మీడియాకు సమాచారం ఇచ్చిన అతను.. లాంఛనాన్ని పూర్తి చేశాడు. 2019లో వన్డే ప్రపంచకప్‌ గెలిపించి ఇంగ్లాండ్‌ చిరకాల వాంఛను నెరవేర్చిన మోర్గాన్‌.. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు తెరదించాడు. కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న మోర్గాన్‌.. తాజాగా నెదర్లాండ్స్‌ లాంటి చిన్న జట్టుతో వరుసగా రెండు వన్డేల్లోనూ డకౌటయ్యాడు. అతను వన్డేల్లో సెంచరీ చేసి రెండేళ్లు కావస్తోంది. టీ20ల్లో అర్ధశతకం సాధించి కూడా అంతే సమయం అవుతోంది. మిగతా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగుతుండగా.. కేవలం కెప్టెన్‌ అన్న కారణంతో మోర్గాన్‌ జట్టులో నామమాత్రంగా కొనసాగుతున్నాడనే విమర్శలు పెరుగుతుండడంతో అతను రిటైర్మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. మోర్గాన్‌ ఐర్లాండ్‌ దేశస్థుడు, ఆ జట్టు తరఫునే 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రెండేళ్లకు పైగా ఐర్లాండ్‌కే ఆడిన మోర్గాన్‌.. 2009లో ఇంగ్లాండ్‌కు మారాడు. కొంత కాలానికే వన్డే, టీ20 జట్లలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఆ జట్టు తరఫున 16 టెస్టులు కూడా ఆడాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనే అతడికి పేరొచ్చింది. 248 వన్డేల్లో 7701 పరుగులు చేసిన అతను.. 115 టీ20ల్లో 2458 పరుగులు రాబట్టాడు. 16 టెస్టుల్లో అతడి పరుగులు 700. వన్డేల్లో 14 సెంచరీలు చేసిన మోర్గాన్‌.. టెస్టుల్లో రెండుసార్లు మూడంకెల స్కోరునందుకున్నాడు. 2014 వన్డే ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించి ఇంగ్లాండ్‌ ఘోర పరాభవం ఎదుర్కొన్న సమయంలో జట్టును ప్రక్షాళన చేస్తూ మోర్గాన్‌కు పగ్గాలప్పగించింది ఇంగ్లాండ్‌ బోర్డు. అతడి సారథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లిష్‌ జట్టు అనూహ్యమైన ప్రగతి సాధించింది. ఆచితూచి ఆడే శైలిని వీడి, దూకుడుగా మారుపేరుగా మారిన ఆ జట్టు.. 2019లో ప్రపంచకప్‌ కలను నెరవేర్చుకుంది. వన్డేలతో పాటు టీ20ల్లోనూ ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదిగింది. ఇలా ఇంగ్లాండ్‌ రాతను మార్చిన మోర్గాన్‌.. గత రెండేళ్లలో పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారి, చివరికిప్పుడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని