స్వైటెక్‌ అలవోకగా..

టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ అలవోకగా వింబుల్డన్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. అయిదో సీడ్‌ సకారి, మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో నాదల్‌ శుభారంభం చేశాడు.

Published : 29 Jun 2022 02:41 IST

నాదల్‌, సకారి ముందంజ
రెండో రౌండ్లో ప్రవేశం

టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ అలవోకగా వింబుల్డన్‌ రెండో రౌండ్లో అడుగుపెట్టింది. అయిదో సీడ్‌ సకారి, మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ కూడా రెండో రౌండ్లో ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో నాదల్‌ శుభారంభం చేశాడు.

లండన్‌

మహిళల ప్రపంచ నంబర్‌వన్‌ స్వైటెక్‌ (పోలెండ్‌) వింబుల్డన్‌లో ఘనంగా బోణీ కొట్టింది. మంగళవారం తొలి రౌండ్లో ఆమె 6-0, 6-3తో ఫెఫ్ట్‌ (క్రొయేషియా)ను చిత్తు చేసింది. మ్యాచ్‌లో స్వైటెక్‌ 10 విన్నర్లు కొట్టింది. ఫెఫ్ట్‌ 9 డబుల్‌ ఫాల్ట్‌లు, 23 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. అయిదో సీడ్‌ సకారి (గ్రీస్‌) 6-1, 6-4తో హీవ్స్‌ (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మాజీ నంబర్‌వన్‌ హలెప్‌ (రొమేనియా), 11వ సీడ్‌ గాఫ్‌ కూడా శుభారంభం చేశారు. తొలి రౌండ్లో హలెప్‌ 6-3, 6-2తో ముచోవా (చెక్‌)ను చిత్తు చేయగా.. గాఫ్‌ (అమెరికా) 2-6, 6-3, 7-5తో రూస్‌ (రొమేనియా)పై గెలిచింది. మరో మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో 13వ సీడ్‌ క్రెజికోవా (చెక్‌) 7-6 (7-4), 6-3తో జనెవ్‌స్కా (బెల్జియం)పై విజయం సాధించింది. నాలుగో సీడ్‌ బడోసా (స్పెయిన్‌) 6-2, 6-1తో చిరికో (అమెరికా)పై అలవోకగా నెగ్గింది. ఇతర మ్యాచ్‌ల్లో క్విటోవా (చెక్‌) 2-6, 6-4, 6-2తో పౌలిని (ఇటలీ)పై, గొలుబిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6-4, 6-3తో పెట్కోవిచ్‌ (జర్మనీ)పై, అనిసిమోవా (అమెరికా) 6-3, 6-4తో యువాన్‌ (చైనా)పై, ఒస్తాపెంకో (లాత్వియా) 6-4, 6-4తో దోడిన్‌ (ఫ్రాన్స్‌)పై, కోస్త్యుక్‌ (ఉక్రెయిన్‌) 4-6, 6-4, 6-4తో స్వాన్‌ (అమెరికా)పై విజయం సాధించారు. ఫ్లిప్కెన్స్‌ (బెల్జియం), విక్‌మేయర్‌ (బెల్జియం), జాంగ్‌ (అమెరికా) రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) శుభారంభం చేశాడు. మొదటి రౌండ్లో అతడు 6-4, 3-6, 6-3, 7-5తో సెరుండొలో (అర్జెంటీనా)పై గెలిచాడు. కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) కూడా రెండో రౌండ్లో ప్రవేశించాడు. మొదటి రౌండ్లో అతడు 3-6, 6-1, 7-5, 6-7 (3-7), 7-5తో జుబ్‌ (బ్రిటన్‌)పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో డిమానవర్‌ (ఆస్ట్రేలియా) 6-1, 6-3, 7-5తో డెలియన్‌ (బొలీవియా)పై, ఒపెల్కా (అమెరికా) 7-6 (7-5), 6-4, 6-4తో టబెర్నర్‌ (స్పెయిన్‌)పై, సాక్‌ (అమెరికా) 7-6 (8-6), 6-4, 6-4తో మిలేల్స్‌ (స్పెయిన్‌)పై నెగ్గారు.

కరోనాతో బెరెటిని ఔట్‌: నిరుటి రన్నరప్‌ మాటియో బెరెటిని ఈసారి కరోనా కారణంగా వింబుల్డన్‌కు దూరమయ్యాడు. తన తొలి రౌండ్‌ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు అతడు పోటీ నుంచి వైదొలిగాడు. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చినట్లు అతడు తెలిపాడు. ‘‘లక్షణాలు తీవ్రంగా లేకపోయినా.. నా సహచర పోటీదారులతో టోర్నీతో సంబంధమున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ రోజు ఉదయం మరోసారి పరీక్ష చేయించుకున్నా. టోర్నీకి దూరమైనందుకు చాలా నిరాశగా ఉంది. ఈ ఏడాదికి నా కల చెదిరింది. కానీ మళ్లీ బలంగా వస్తా’’ అని బెరెటిని చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని