ఫార్ములా- ఈ వచ్చేస్తోంది

రేసింగ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త అందింది. హైదరాబాద్‌లోని రోడ్లపై కార్లు రయ్‌మంటూ రేసులో పరుగులు పెట్టే రోజుపై స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ఫార్ములా- ఈ రేసు జరుగుతుందని

Published : 01 Jul 2022 03:43 IST

ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో రేసు

ఈనాడు, హైదరాబాద్‌: రేసింగ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త అందింది. హైదరాబాద్‌లోని రోడ్లపై కార్లు రయ్‌మంటూ రేసులో పరుగులు పెట్టే రోజుపై స్పష్టత వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న భాగ్యనగరంలో ఫార్ములా- ఈ రేసు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. తొమ్మిదో సీజన్‌ (2022-23) కోసం ప్రకటించిన రేసు క్యాలెండర్‌లో హైదరాబాద్‌కు చోటు కల్పించారు. దీంతో భారత్‌లోనే తొలిసారిగా ఫార్ములా- ఈ రేసు తెలుగు గడ్డపై జరగబోతుంది. 2013లో ఎఫ్‌1 ఇండియన్‌ గ్రాండ్‌ప్రి తర్వాత దేశంలో జరగనున్న ప్రధాన అంతర్జాతీయ రేసు ఈవెంట్‌ ఇదే కానుంది. కొత్తగా ప్రకటించిన క్యాలెండర్‌లో భారత్‌తో పాటు బ్రెజిల్‌ (మార్చి 25న)నూ చేర్చారు. ఇప్పటికే ఈ రేసు నిర్వహణ కోసం ఫార్ములా-ఈ ప్రతినిధులతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. విద్యుత్‌ కార్లతో సాగే ఈ రేసు కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సాధారణ రోడ్లనే రేసుకు అనుకూలంగా మారుస్తారు.

హుస్సేన్‌సాగర్‌ తీరంలో..: హైదరాబాద్‌లో హుస్సేన్‌ సాగర్‌ తీరం ఈ రేసుకు వేదిక కానుంది. ట్యాంక్‌బండ్‌ చుట్టూ పూర్తిగా విద్యుత్తుతో నడిచే రేసింగ్‌ కార్లు రయ్‌ రయ్‌మని దూసుకెళ్లనున్నాయి. ఈ రేసు దాదాపు గంట పాటు జరుగుతుంది. అందుకు మరో ఏడు నెలల గడువు మాత్రమే ఉండటంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ట్రాక్‌ రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన కాంక్రీట్‌ బ్యారికేడ్స్‌ తయారవుతున్నాయి. ప్రమాదవశాత్తూ కారు అదుపు తప్పినా ట్రాక్‌ దాటకుండా ఉండేలా వర్టికల్‌ బ్యారికేడ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ను ప్రపంచపటంలో నిలిపేందుకు...తెలంగాణ ప్రభుత్వం, గ్రీన్‌కో సంస్థతో కలిసి అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సమాఖ్యతో రేసు నిర్వహణకు ఒప్పందం చేసుకుంది. దేశంలో తొలిసారి ఫార్ములా- ఈ రేసు నిర్వహించేందుకు ఎంపికైన నగరం హైదరాబాద్‌ అని పేర్కొంటూ రేస్‌ షెడ్యూల్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని