Updated : 01 Jul 2022 08:15 IST

IND vs ENG: ఆఖరి సవాల్‌.. భారత్‌కు బుమ్రా సారథ్యం

ఇంగ్లాండ్‌తో అయిదో టెస్టు నేటి నుంచే

మధ్యాహ్నం 3 గంటల నుంచి

ఎన్నోసార్లు ఇంగ్లాండ్‌కు వెళ్లినా టీమ్‌ఇండియా మూడు సార్లు మాత్రమే టెస్టు సిరీస్‌ గెలిచింది. నాలుగోసారి ఆ ఘనత సాధించేందుకు ఇప్పుడో అవకాశం. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఇంగ్లాండ్‌తో ఆఖరి సమరానికి సిద్ధమైంది. నేటి నుంచే చివరిదైన అయిదో టెస్టు. నిరుడు కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టిది. పరిస్థితుల్లో మార్పులెన్నో! తాజాగా టెస్టు సిరీస్‌లో అదిరే ప్రదర్శనతో కివీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌, అప్పటికన్నా బలంగా కనపడుతోంది. కీలక ఆటగాళ్లయిన కెప్టెన్‌ రోహిత్‌, రాహుల్‌లను కోల్పోవడం ప్రతికూలాంశమే అయినా.. గత ఏడాది ప్రదర్శన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో భారత్‌ పోరుకు సిద్ధమవుతోంది. బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

బర్మింగ్‌హామ్‌

బర్మింగ్‌హామ్‌లో రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం మొదలయ్యే చివరిదైన అయిదో టెస్టులో బుమ్రా నేతృత్వంలోని టీమ్‌ ఇండియా.. ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఢీకొంటుంది. నిరుడు సిరీస్‌లో భారత్‌ ఆధిక్యంలో ఉండగా జట్టులో కరోనా కేసులు రావడంతో ఈ ఆఖరి మ్యాచ్‌ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. అప్పటికి ఇప్పటికి ఎన్నో మార్పులు. కోహ్లి టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీని వదులుకున్నాడు. అతడి స్థానంలో పగ్గాలు అందుకున్న రోహిత్‌ ఇప్పుడు కొవిడ్‌-19 పాజిటివ్‌ కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఉపసారథి రాహుల్‌ కూడా అందుబాటులో లేడు. గాయంతో పర్యటనకు రాలేదు. మొత్తం మీద కెప్టెన్సీ చివరికి బుమ్రా చేతికి వచ్చింది. భారత బౌలింగ్‌ దళానికి బుమ్రా తిరుగులేని సారథి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ జట్టు కెప్టెన్‌గా... స్టోక్స్‌ నేతృత్వంలో దుర్భేద్యంగా కనిపిస్తోన్న ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాను నడిపించడం సవాలే. నిరుడు ఇక్కడ అదరగొట్టిన రెగ్యులర్‌ ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ దూరం కావడం భారత్‌కు పెద్ద ఇబ్బందే. కోహ్లి సెంచరీ కొట్టకున్నా.. మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శన చేస్తాడని కోచ్‌ ద్రవిడ్‌ ఆశిస్తున్నాడు. 40వ పుట్టినరోజుకు దగ్గర్లో ఉన్న అండర్సన్‌ ఇప్పటికీ తన స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించగలడు. యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ గిల్‌ భిన్నమైన పరీక్షను ఎదుర్కోబోతున్నారు. శుభ్‌మన్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయం. రెండో ఓపెనర్‌ ఎవరన్నదే ప్రశ్న. విహారి లేదా మయాంక్‌.. గిల్‌తో కలిసి బరిలోకి దిగే అవకాశముంది. పుజారా పేరు కూడా వినిపిస్తోంది. కౌంటీల్లో అదిరే ప్రదర్శనతో తిరిగి భారత జట్టుకు ఎంపికైన అతడు.. ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.కోహ్లి నాలుగో స్థానంలో, ఆ తర్వాత శ్రేయస్‌, పంత్‌, జడేజా బ్యాటింగ్‌కు వస్తారు. బుమ్రా, షమి, సిరాజ్‌ పేస్‌ భారాన్ని మోస్తారు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్‌ స్థానం కోసం శార్దూల్‌ ఠాకూర్‌, అశ్విన్‌ మధ్య పోటీ నెలకొంది. శార్దూల్‌కే అవకాశాలెక్కువ.

జోరుమీదున్న ఇంగ్లాండ్‌: ఇంగ్లాండ్‌ జోరు మీదుంది. కొత్త కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ మార్గనిర్దేశంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఇంగ్లాండ్‌లో పిచ్‌లు ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌కు మరింతగా సహకరిస్తున్న నేపథ్యంలో షమి, సిరాజ్‌, బుమ్రాలకు ఉత్సాహంతో ఉన్న ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ను నిలవరించడం సవాలే. రూట్‌, బెయిర్‌స్టోల సూపర్‌ ఫామ్‌ ఆతిథ్య జట్టుకు గొప్ప సానుకూలాంశం. అనుభవజ్ఞులైన అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌తో పాటు మాథ్యూ పాట్స్‌తో ఇంగ్లాండ్‌ పేస్‌ దళం అత్యంత పదనుగా కనిపిస్తోంది.

తుది జట్లు

ఇంగ్లాండ్‌: అలెక్స్‌ లీస్‌, క్రాలే, ఒలీ పోప్‌, రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌, సామ్‌ బిలింగ్స్‌, మాథ్యూ పాట్స్‌, బ్రాడ్‌, జాక్‌ లీచ్‌, అండర్సన్‌

భారత్‌ (అంచనా): శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌/పుజారా, హనుమ విహారి, కోహ్లి, శ్రేయస్‌, పంత్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌/అశ్విన్‌, షమి, సిరాజ్‌, బుమ్రా

పిచ్‌ ఎలా ఉందంటే..

టెస్టు మ్యాచ్‌ తొలి రెండు రోజుల ఆటకు వర్షం వల్ల అంతరాయాలు కలిగే అవకాశముంది. మూడో రోజు నుంచి వాతావరణం మెరుగుపడుతుంది. ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎడ్జ్‌బాస్టన్‌లో సాధారణంగా పరుగులు బాగానే వస్తాయి. సగటు తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 307 పరుగులు. సగటు రెండో ఇన్నింగ్స్‌ స్కోరు 320. మూడో ఇన్నింగ్స్‌ సగటు 244 కాగా.. నాలుగో ఇన్నింగ్స్‌ సగటు 152 మాత్రమే. ఇక్కడ సాధారణంగా పేసర్లకు మంచి స్వింగ్‌ లభిస్తుంది.

ఒక్కటీ నెగ్గలేదు

అయిదో టెస్టు వేదిక ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ రికార్డు పేలవం. ఇక్కడ ఒక్క టెస్టూ నెగ్గలేదు. ఆరు మ్యాచ్‌ల్లో ఓడి.. ఒక మ్యాచ్‌ను డ్రాగా ముగించింది.

* ఇంగ్లాండ్‌లో భారత్‌ రెండు సార్లు రెండు టెస్టులు (1986, 2021) గెలిచింది. ఒక్కసారి కూడా ఓ సిరీస్‌లో మూడు టెస్టులు గెలవలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని