34 ఏళ్ల గ్లీసన్‌కు పిలుపు

టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం టీ20, వన్డే జట్లను ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 34 ఏళ్ల పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ తొలిసారి జట్టుకు ఎంపికయ్యాడు.

Updated : 02 Jul 2022 07:15 IST

ఇంగ్లాండ్‌ పరిమిత ఓవర్ల జట్ల ఎంపిక

లండన్‌: టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం టీ20, వన్డే జట్లను ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 34 ఏళ్ల పేసర్‌ రిచర్డ్‌ గ్లీసన్‌ తొలిసారి జట్టుకు ఎంపికయ్యాడు. మోర్గాన్‌ ఆటకు వీడ్కోలు పలకడంతో పరిమిత ఓవర్ల జట్టు సారథిగా బట్లర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్‌. ఈ నెల 7, 9, 10 తేదీల్లో టీ20లు.. 12, 14, 17 తేదీల్లో వన్డేలు జరుగుతాయి.
ఇంగ్లాండ్‌ టీ20 జట్టు: బట్లర్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, బ్రూక్‌, సామ్‌ కరన్‌, గ్లీసన్‌, జోర్డాన్‌, లివింగ్‌స్టోన్‌, మలన్‌, టైమల్‌ మిల్స్‌, పార్కిన్సన్‌, రాయ్‌, ఫిల్‌ సాల్ట్‌, రీస్‌ టాప్లీ, డేవిడ్‌ విల్లే.
వన్డే జట్టు: బట్లర్‌, మొయిన్‌ అలీ, బెయిర్‌స్టో, బ్రూక్‌, కార్స్‌, సామ్‌ కరన్‌, లివింగ్‌స్టోన్‌, సి.ఒవర్టన్‌, పార్కిన్సన్‌, రూట్‌, రాయ్‌, సాల్ట్‌, స్టోక్స్‌, టాప్లీ, విల్లీ.


ఆసీస్‌ చేతిలో లంక చిత్తు

గాలె: తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్‌లో శుక్రవారం ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. 2 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 313/8తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌ 321 పరుగులకు ఆలౌటైంది. 109 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 22.5 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ స్పిన్నర్లు నాథన్‌ లైయన్‌ (4/31), మిషెల్‌ స్వెప్సన్‌ (2/34), ట్రేవిస్‌ హెడ్‌ (4/10)లు విజృంభించడంతో శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. 5 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 4 బంతుల్లోనే వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. తొలి ఇన్నింగ్స్‌లో 77 పరుగులు సాధించిన కామెరూన్‌ గ్రీన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈనెల 8న రెండో టెస్టు ప్రారంభమవుతుంది.


భారత వాలీబాల్‌ జట్టుకు లావణ్య

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ (చింతకుంట) విద్యార్థిని చందు లావణ్య ఆసియా వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత అండర్‌-20 జట్టుకు ఎంపికైంది. 17 ఏళ్ల ఈ అటాకర్‌ మొదట భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీలో జరిగిన శిక్షణ శిబిరంలో రాణించి జులై 4 నుంచి కజకిస్థాన్‌లో జరిగే ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది.


అదరగొట్టిన ఆర్మండ్‌

స్టాక్‌హోమ్‌: స్వీడన్‌ పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ మరోసారి సత్తాచాటాడు. ఇదివరకు తన పేరిటే ఉన్న ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) ఎత్తు దూకి ఛాంపియన్‌గా నిలిచాడు. అతను 2020లో రోమ్‌లో తానే నెలకొల్పిన రికార్డు (6.15మీ)ను ఇప్పుడు బద్దలు కొట్టాడు. ఇండోర్‌ ప్రపంచ రికార్డు (ఈ ఏడాది సెర్బియాలో 6.20మీ) కూడా అతని ఖాతాలోనే ఉంది. ఒలింపిక్‌ ఛాంపియన్‌ అయిన అతను.. స్వదేశంలో సొంత అభిమానుల మధ్య ప్రపంచ రికార్డు తిరగరాయడం విశేషం. స్టాక్‌హోమ్‌లో ఈ రికార్డు అందుకోవడం అదనపు ప్రత్యేకతను తెచ్చిపెట్టిందని డుప్లాంటిస్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని