Published : 03 Jul 2022 04:00 IST

స్వైటెక్‌కు షాక్‌

టాప్‌సీడ్‌ను ఓడించిన కార్నెట్‌

గాఫ్‌, పెగులా ఔట్‌

వరుసగా 37 విజయాలు.. ఫిబ్రవరి నుంచి ఓటమన్నదే తెలీదు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ సహా ఆరు టోర్నీల్లో విజేత.. వింబుల్డన్‌లోనూ టైటిల్‌ ఫేవరెట్‌.. ఇదీ ఇగా స్వైటెక్‌ దూకుడు. కానీ మూడో రౌండ్లో ఈ ప్రపంచ నంబర్‌వన్‌కు కార్నెట్‌ షాకిచ్చింది. సంచలన ఆటతీరుతో ఆమె జైత్రయాత్రకు తెరదించింది.

లండన్‌

వింబుల్డన్‌లో సంచలనం. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ స్వైటెక్‌ (పోలెండ్‌)కు ఓటమి. శనివారం మూడో రౌండ్లో ఆమె 4-6, 2-6 తేడాతో కార్నెట్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడింది. వరుసగా 37 విజయాల తర్వాత ఆమెకిదే తొలి పరాజయం. ప్రపంచ 37వ ర్యాంకర్‌ కార్నెట్‌ తొలి మూడు గేమ్‌ల్లో రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 3-0తో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత విన్నర్లతో చెలరేగి తొలి సెట్‌ సొంతం చేసుకుంది. రెండో సెట్లో మరింత దూకుడుగా ఆడిన ఆమె ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. 33 అనవసర తప్పిదాలు చేయడంతో స్వైటెక్‌ మూల్యం చెల్లించుకుంది. తొలి రౌండ్లో సెరెనాను ఓడించి వెలుగులోకి వచ్చిన హార్మోనీ టాన్‌ (ఫ్రాన్స్‌) తన తొలి వింబుల్డన్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరింది. మూడో రౌండ్లో ఆమె 6-1, 6-1తో బోల్టర్‌ (బ్రిటన్‌)ను చిత్తుచేసింది. నాలుగో సీడ్‌ బడోసా (స్పెయిన్‌) 7-5, 7-6 (7-4)తో క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై పోరాడి గెలిచింది. హలెప్‌ (రొమేనియా) 6-4, 6-1తో ఫ్రెచ్‌ (పోలండ్‌)పై నెగ్గింది. రిబాకినా (కజకిస్థాన్‌) కూడా ముందంజ వేసింది. ఎనిమిదో సీడ్‌ పెగులా (అమెరికా) 2-6, 6-7 (5-7)తో మార్టిచ్‌ (క్రొయేషియా) చేతిలో, 11వ సీడ్‌ కోకో గాఫ్‌ (అమెరికా) 7-6 (7-4), 2-6, 1-6తో సహచర 20వ సీడ్‌ అనిసిమోవా చేతిలో, 13వ సీడ్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-2, 4-6, 3-6తో అన్‌సీడెడ్‌ ఐలా టోమియానోవిచ్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడారు.పురుషుల సింగిల్స్‌లో 11వ సీడ్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మూడో రౌండ్లో అతను 6-4, 6-1, 7-6 (7-3)తో అలెక్స్‌ (స్లొవేకియా)పై పైచేయి సాధించాడు. డిమినార్‌ (ఆస్ట్రేలియా), గారిన్‌ (చిలీ) కూడా ముందడుగు వేశారు.

వీనస్‌ 10 నెలల తర్వాత..

42 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ 10 నెలల తర్వాత టెన్నిస్‌లో తొలి విజయాన్ని అందుకుంది. తన చెల్లి సెరెనా స్ఫూర్తితో వింబుల్డన్‌లో అడుగుపెట్టానని చెప్పిన వీనస్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బ్రిటన్‌ ఆటగాడు ఆండీ ముర్రే సోదరుడు జేమీ ముర్రేతో కలిసి బరిలో దిగింది. వీనస్‌- జేమీ జోడీ తొలి రౌండ్లో 6-3, 6-7 (3-7), 6-3 తేడాతో రోసోల్కా- మైకెల్‌ జంటపై గెలిచింది.

‘‘సెరెనా స్ఫూర్తితోనే చివరి నిమిషంలో వింబుల్డన్‌ ఆడాలని అనుకున్నా. ఇక్కడి పచ్చిక చూసి ఉత్తేజం చెందా. ఏడాదిగా ఆడలేదు కాబట్టి ఫలితం ఎలా వస్తుందో తెలీదు’’ అని వీనస్‌ పేర్కొంది. ఏడాది విరామం తర్వాతి తిరిగి వింబుల్డన్‌లో సింగిల్స్‌ ఆడిన సెరెనా.. తొలి రౌండ్లోనే ఓడిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts