Published : 04 Jul 2022 03:53 IST

క్వార్టర్స్‌లో గొఫిన్‌

సుదీర్ఘ పోరులో తియాఫోపై గెలుపు

నాదల్‌ ముందంజ

లండన్‌

నాలుగున్నర గంటలకు పైగా పోరు.. విజయం కోసం ప్రాణం పెట్టి పోరాడిన ఆటగాళ్లు.. కళ్లు చెదిరే విన్నర్లు.. తిరుగులేని ఏస్‌లు.. పోటాపోటీ షాట్లు.. చివరకు గెలిచింది గోఫిన్‌. వింబుల్డన్‌లో తియాఫోతో సాగిన సుదీర్ఘ పోరులో నెగ్గిన అతను రెండో సారి ఈ టోర్నీలో క్వార్టర్స్‌ చేరాడు. మరోవైపు నాదల్‌, కిర్గియోస్‌ ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో గొఫిన్‌ (బెల్జియం) జోరు కొనసాగుతోంది. ఆదివారం నాలుగో రౌండ్లో అతను 7-6 (7-3), 5-7, 5-7, 6-4, 7-5తో 23వ సీడ్‌ తియాఫో (అమెరికా)పై పోరాడి గెలిచాడు. విజయం కోసం ఇద్దరు క్రీడాకారులు హోరాహోరీగా తలపడడంతో పోరు రసవత్తరంగా మారింది. గొఫిన్‌ ఏస్‌లతో చెలరేగితే.. టియోఫీ విన్నర్లతో బదులిచ్చాడు. టైబ్రేకర్‌లో తేలిన తొలి సెట్‌ చూస్తేనే గెలుపు కోసం ఈ ఇద్దరూ ఎంతగా పోరాడారో అర్థమవుతోంది. ఆ తర్వాతి రెండు సెట్లను గెలుచుకున్న తియాఫో దూకుడు ప్రదర్శించడంతో అతనిదే విజయమనిపించింది. కానీ నాలుగో సెట్లో అద్భుతంగా పుంజుకున్న గొఫిన్‌ కథ మార్చేశాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అతను ఓ దశలో 3-0తో ఆధిపత్యం ప్రదర్శించాడు. అదే జోరు కొనసాగించి పదో గేమ్‌లో మళ్లీ సర్వీస్‌ బ్రేక్‌ చేసి సెట్‌ గెలిచాడు. ఇక నిర్ణయాత్మక అయిదో సెట్లో పోరు మరో స్థాయికి చేరింది. 5-5తో స్కోరు సమమైన దశలో పట్టు వదలని గొఫిన్‌ వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి మ్యాచ్‌ దక్కించుకున్నాడు. మ్యాచ్‌లో 18 ఏస్‌లు కొట్టిన అతను.. 59 విన్నర్లు సంధించాడు. తియాఫో 16 ఏస్‌లు, 68 విన్నర్లు కొట్టాడు. ప్రిక్వార్టర్స్‌లో 9వ సీడ్‌ నోరీ (బ్రిటన్‌) 6-4, 7-5, 6-4తో టామీ పాల్‌ (అమెరికా)పై గెలిచాడు. మరోవైపు రెండో సీడ్‌ నాదల్‌ (స్పెయిన్‌) ప్రిక్వార్టర్స్‌ చేరాడు. మూడో రౌండ్లో అతను 6-1, 6-2, 6-4తో లోరెంజో (ఇటలీ)ని ఓడించాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించిన నాదల్‌ 2 ఏస్‌లు, 24 విన్నర్లు కొట్టాడు. కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) 6-7 (2-7), 6-4, 6-3, 7-6 (9-7)తో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)ను ఓడించాడు.
మారియా తొలిసారి..: 34 ఏళ్ల మారియా (జర్మనీ) తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నాలుగో రౌండ్లో ఆమె 5-7, 7-5, 7-5తో 12వ సీడ్‌ ఓస్టాపెంకో (లాత్వియా)కు షాకిచ్చింది. తొలి సెట్లో ఓటమి తర్వాత మారియా గొప్పగా పుంజుకుంది. రెండో సెట్లో రెండు మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకుని గెలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లోనూ 5-5తో స్కోరు సమమైన దశలో వరుసగా రెండు గేమ్‌లో నెగ్గిన ఆమె మ్యాచ్‌ సొంతం చేసుకుంది. తొలిసారి వింబుల్డన్‌ ఆడుతున్న నీమయర్‌ (జర్మనీ) 6-2, 6-4తో వాట్సన్‌ (బ్రిటన్‌)పై, బోజ్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-5, 6-2తో గార్సియా (ఫ్రాన్స్‌)పై నెగ్గారు.

క్వార్టర్స్‌లో సానియా జోడీ: సానియా మీర్జా మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. రెండో రౌండ్లో ఆరో సీడ్‌ సానియా- పవిచ్‌ జంటకు వాకోవర్‌ లభించింది. లతీష (తైవాన్‌)- ఇవాన్‌ (క్రొయేషియా) పోటీ నుంచి ముందే తప్పుకున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts